– ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వెలువడిన రోజు
– కేసీఆర్ ఆమరణ దీక్షకు కేంద్రం తలొగ్గిన రోజు
– పింక్ బెలూన్లను గాల్లో ఎగురవేయాలి
– తెలంగాణ పోరాటంపై ప్రజలకు అవగాహన కల్పించాలి
– వీడియో కాన్ఫరెన్స్ లో కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9వ తేదీని ‘విజయ్ దివస్’గా ఘనంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు అదివారం పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 9 చరిత్రలో నిలిచిపోయే రోజన్నారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రోజే డిసెంబర్ 9 అని కేటీఆర్ గుర్తుచేశారు. నవంబర్ 29న ‘దీక్షా దివస్’ను విజయవంతం చేసినట్లే, కేసీఆర్ 11 రోజుల దీక్ష ఫలించిన డిసెంబర్ 9ని విజయం సాధించిన రోజుగా.. ‘విజయ్ దివస్’ పేరుతో పండుగలా జరుపుకోవాలని ఆయన సూచించారు. డిసెంబర్ 9 రోజే 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షకు కేసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష వలన ఒక రూపం వచ్చిందని అన్నారు. అంతటి ఘనమైన చారిత్రక ఘట్టాన్ని మరోసారి స్మరించుకుంటూ, ఆనాడు కెసిఆర్ తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని గుర్తుచేస్తూ, ప్రత్యేక రాష్ట్ర ప్రకటన సిద్ధించిన రోజును సంబరంగా నిర్వహించుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అందరూ బిజీగా ఉన్నందున, గ్రామాల్లో కాకుండా కేవలం నియోజకవర్గ కేంద్రాల్లో మాత్రమే ఈ కార్యక్రమాలను నిర్వహించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. నియోజకవర్గ కేంద్రాల్లోని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలి. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాలి. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేయాలి. పార్టీ కార్యాలయాల వద్ద లేదా ప్రధాన కూడళ్లలో విజయానికి సూచికగా పింక్ బెలూన్లను గాలిలోకి ఎగురవేయాలి. కార్యక్రమం అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి, కేసీఆర్ దీక్ష, తెలంగాణ పోరాటం, విద్యార్థుల త్యాగాలను ప్రజలకు, భవిష్యత్ తరాలకు గుర్తుచేయాలి. కేసీఆర్ గారి దీక్ష ఫలవంతమైన నిమ్స్ (నిమ్స్) హాస్పిటల్, గాంధీ హాస్పిటల్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. నగర నాయకత్వం ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. మరో రెండు రోజులు సమయం ఉన్నందున జిల్లా అధ్యక్షులు చొరవ తీసుకొని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా సమన్వయం చేసుకోవాలని కేటీఆర్ కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



