ఈ విజయం ‘దామన్న’కే అంకితం

– సూర్యాపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా రెపరెపలు
– మూడింట రెండొంతుల మెజారిటీతో అఖండ విజయం
– ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 31 స్థానాలను కైవసం చేసుకుని మూడింట రెండొంతుల ఆధిక్యాన్ని సాధించిన కాంగ్రెస్ మున్సిపాలిటీపై తన పట్టును సాధించింది. ఈ విజయాన్ని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (దామన్న)కు అంకితం చేస్తున్నట్లు ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ప్రకటించారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన తండ్రి దామోదర్ రెడ్డి చిరకాల స్వప్నం నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో కాంగ్రెస్ పునరుజ్జీవానికి ఇది నాంది పలికిందని, ఈ విజయం పార్టీ పట్టణ చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార సరళి రూపకల్పన, పోల్ మేనేజ్‌మెంట్, చైర్మన్ అభ్యర్థి ఎంపిక వరకు ప్రతి దశలో సమన్వయంతో ముందుకెళ్లినట్లు తెలిపారు. పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్యల సహకారం కీలకమైందని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయడంతోనే ఈ ఫలితం సాధ్యమైందని స్పష్టం చేశారు. జిల్లాలో రెండుసార్లు మంత్రిగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎన్నికల ఫలితాలకు ముందే క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టి ప్రజల్లో అభాసుపాలైనారని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రతి వార్డులో ప్రజలు అఖండ మెజారిటీతో ఆశీర్వదించి బీఆరఎస్‌కు గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిల సహకారంతో సూర్యాపేట మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడమే ఈ విజయానికి మూలకారణమని చెప్పారు. గత పదేళ్లలో మున్సిపాలిటీ అభివృద్ధిపరంగా వెనుకబడిందని విమర్శిస్తూ తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేయడం తమ ముందున్న తక్షణ కర్తవ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వచ్చే మూడేళ్లేకాÅ£ మరో ఐదేళ్లపాటు కూడా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. గెలుపే లక్ష్యంగా కృషి చేసిన ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర నాయకుడు పోతు భాస్కర్, పట్టణ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *