మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం మాదే

– మరో మూడేళ్లు అధికారంలో ఉండేది మేమే
– అభివృద్ధి చేస్తున్నాం.. ఇంకా చేసి చూపిస్తాం
– వికారాబాద్‌, ‌పరిగి, తాండూర్‌లకు గోదావరి నీళ్లు పారిస్తాం
-కే సిఆర్‌ ‌కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలేశ్వరంగా మారింది
– దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసిన చరిత్ర దాగదు
– బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌కుమ్మక్కు రాజకీయాలను తిప్పికొట్టండి
– వికారాబాద్‌ ‌జిల్లా పర్యటనలో సిఎం రేవంత్‌ ‌పిలుపు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచేది మళ్లీ కాంగ్రెస్‌ ‌పార్టీయేనని సిఎం రేవంత్‌ ‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మీరిచ్చిన అధికారంతో అభివృద్ధి పనులు చేస్తున్నామని అంటూ..వికారాబాద్‌, ‌తాండూర్‌, ‌పరిగి ప్రాంతాలకు గోదావరి జలాలను తరలిస్తామని అన్నారు. ఇందుకు మంత్రి శ్రీధర్‌ ‌బాబే సాక్ష్యం అంటూ హామీ ఇచ్చారు. వికారాబాద్‌ ‌జిల్లాలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి పర్యటించారు. నారాయణపూర్‌లో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతిబాట బహిరంగ సభ పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రంలో మంజూరైన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్‌ ‌తన స్వార్థం కోసం అటకెక్కించారని రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాకు 3 టీఎంసీల గోదావరి జలాలను అందిస్తే లక్షలాది ఎకరాలు సాగులోకి వొచ్చేవేనని, కానీ కేసీఆర్‌ ‌నిర్లక్ష్యం వల్ల జిల్లా రైతాంగం బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ‌లక్ష కోట్లు వెచ్చించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడు ఏళ్లలోనే ‘కూలేశ్వరం’గా మారిందని, ఆ ప్రాజెక్టు నిధులతో ఆయన కుటుంబ సభ్యులు ఫామ్‌ ‌హౌసులు కట్టుకుని వ్యాపారాలు చేసుకున్నారని ఆరోపించారు. తాండూరు, పరిగి , వికారాబాద్‌ ‌ప్రాంతాలను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.స్వయం సహాయక సంఘాల మహిళలకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఇందిరా మహిళా శక్తి చెక్కుల పంపిణీ చేశారు  ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను, తప్పులను సరిదిద్దుకుంటూ తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి కోసం ముందుకు వెళుతోందని ఆయన స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌, ‌కేంద్రంలో పన్నెండేళ్లుగా ఉన్న మోదీ రాష్ట్రానికి చేసిందే లేదని విమర్శించిన ఆయన, బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌పార్టీల మధ్య ’చీకటి ఒప్పందాలు’ ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ కార్యకర్తలు తమ బీ-ఫామ్‌లను బీఆర్‌ఎస్‌ ఆఫీసుల నుండి తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేస్తూ, గల్లీలో పనిచేసే నాయకుడిని చూసి కాకుండా దిల్లీలో ఉండే పెళ్లి పెద్దను చూసి వోట్లు వేయడం ఏమిటని ప్రజలను ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి పలు కీలక ప్రకటనలు

జిల్లా అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి పలు కీలక ప్రకటనలు చేశారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ ‌భూసేకరణను త్వరలోనే పూర్తి చేసి, ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. మక్తల్‌, ‌నారాయణపేట, కొడంగల్‌ ‌నియోజకవర్గాలకు కృష్ణా జలాలను తరలించి 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పా జంక్షన్‌ ‌నుండి మన్నెగూడ రోడ్డు పూర్తి కాకపోవడం వల్ల జరిగిన ప్రాణనష్టానికి కేసీఆర్‌, ‌సబితా ఇంద్రారెడ్డిలే బాధ్యులని విమర్శించిన రేవంత్‌ ‌రెడ్డి, ప్రస్తుతం కోర్టు కేసులను పరిష్కరించి ఆ రోడ్డు పనులను వేగవంతం చేశామని వెల్లడించారు. భవిష్యత్తులో రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు , రేడియల్‌ ‌రోడ్లు రాబోతున్నాయని, వికారాబాద్‌ ‌త్వరలోనే ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ‌చరిత్రను తాను చెరిపేయాలని చూస్తున్నానని కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. ఆ ’పాపాల భైరవుడి’ చరిత్ర ప్రజలకు గుర్తుండేలా చేసే బాధ్యత తనదని ఆయన వ్యాఖ్యానించారు. ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌లాంటి చిల్లర పనులకు నోటీసులు ఇవ్వక ఏం చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే 70 వేల ఉద్యోగాల భర్తీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ వంటి హాలను అమలు చేశామని గుర్తు చేస్తూ, రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో విషం చిమ్మే పాములకు మళ్ళీ పాలు పోయకుండా కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రెండేళ్ల ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తున్నాం. అప్పులున్నా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఎన్నికల్లో నిలబడి కొట్లాడాలి కానీ, చీకటి ఒప్పందాలు చేసుకొని ఫెవికాల్‌ ‌బంధంతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ లు కాంగ్రెస్‌ను ఓడించాలని కుట్రలు చేస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ను ప్రజలు బొందపెట్టారు. కాంగ్రెస్‌తో పోరాడటం మావల్ల కాదని బీజేపీతో బీఆర్‌ఎస్‌ ‌కలిసిపోయింది. బీజేపీ అభ్యర్థుల బీఫామ్‌లు బీఆర్‌ఎస్‌ ‌లో ఇచ్చే దుస్థితి ఏర్పడింది. స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ ప్రయత్నించలేదు. ప్రధాని మోదీని చూసి వోటేయాలని బీజేపీ నేతలు అడుగుతున్నారు. పదేళ్లలో సమస్యలు పరిష్కరించి ఉంటే బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ నేతలు వంగి వంగి దండాలు పెట్టాల్సిన పరిస్థితి  ఉండేది కాదు. అడగకుండానే ప్రజలు వోటేసేవారు. ప్రజల సమస్యలను ఏనాడైనా పట్టించుకున్నారా? ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు కోసం రూ.38వేల కోట్లతో నాటి సీఎం రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. కేసీఆర్‌ ‌సీఎం అయ్యాక రంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారు. తెలంగాణ ఉద్యమ నాయకుడినని చెప్పుకొని కేసీఆర్‌ రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. గోదావరి జలాలను తీసుకొచ్చి తాండూరు, పరిగి, వికారాబాద్‌, ‌చేవెళ్ల ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది అని సీఎం హామీ ఇచ్చారు. కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు, కల్లకుంట్ల కిషన్‌ ‌రావు గుర్తు పెట్టుకోండి తెలంగాణలో మళ్లీ గెలిచేది కాంగ్రెస్సేనని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. పదేళ్లు పవర్‌లో ఉన్న బీఆర్‌ఎస్‌ 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఏనాడు మన సమస్యలని పట్టించుకోలేదని విమర్శించారు. మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ అడ్డుకుంటున్నాయని.. అభివృద్ధి పనులకు కాళ్లల్లో క్టటెలు పెడుతున్నాయని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌పేరుతో పెళ్లాంమొగుళ్ల మాటలు కుడా విన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అనైతిక పనులు, తప్పులు చేస్తే నోటీసులు ఇవ్వకపోతే ఏం చేస్తారని ప్రశ్నించారు. దళితలను సీఎం చేస్తానన్న చరిత్రను నేనేలా తుడుస్తాన‌ని కేసీఆర్‌ ‌తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. గత పాలకుల తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలంతా ఆలోచించి వోటేయాలని సూచించారు.  శాసనసభ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌కుమార్‌, ‌మంత్రి శ్రీధర్‌బాబు స్థానిక నేతలు సభలో పాల్గొన్నారు.

ప‌ర్యాట‌క కేంద్రంగా వికారాబాద్‌ 

పరిగి : సంక్షేమం, అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, జిల్లా అభివృద్ధికి ఎన్ని నిధులైన కేటాయిస్తామని రాష్ట ముఖ్య మంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి తెలిపారు.శనివారం వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని నారాయణపూర్ లో “ ప్రజా పాలన- ప్రగతి బాట” బహిరంగ సభలో ఆయ‌న‌ మాట్లాడుతూ జిల్లాకు నీటి సౌకర్యాన్ని కల్పించే అవసరం ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలో కోట్ల రూపాయలతో జిల్లాకు గోదావరి నీటిని ఖచ్చితంగా తీసుకువస్తానని హామీ ఇచ్చారు. కాగ్నా నది ప్రాజెక్ట్ నిర్మాణం గావించి తాండూర్ ప్రాంత ప్రజలకు నీటి సౌకర్యాన్ని కల్పిస్తానని తెలిపారు. ఎన్ని కోట్ల నిధులు వెచ్చించి అయినా రోడ్ల పనులను చేపడతామన్నారు. రైతు భరోసాలో భాగంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేశామ‌ని ముఖ్య మంత్రి తెలిపారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా 70 వేల ఉద్యోగాలు కల్పించిన‌ట్లు తెలిపారు ఇండ్లు లేని పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టి వారికి ఆత్మ గౌర‌వాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని, ఏప్రిల్ మే నెలల్లో రెండో విడత ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని తెలిపారు. చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటనలో 40 మంది చనిపోయారని, ఆ పాపం టిఆర్ఎస్ ప్రభుత్వానిది కాదా అని అన్నారు. అప్ప జంక్షన్ నుండి మన్నెగూడ వరకు రోడ్డు పనులు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 6650 స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి 567.69 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, సాంకేతిక, జిల్లా ఇంచార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసన మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, శాసన సభ్యులు టి.రామ్మోహన్ రెడ్డి, బుయ్యని మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *