– ఉప్పుమడుగులో కొత్తకొండ రోజా రికార్డు
జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబరు 15: రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ మహిళ సర్పంచ్‌గా ఎన్నికవడమేగాక వార్డు మెంబరుగా కూడా ఆమే విజయం సాధించారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఉప్పుమడుగు సర్పంచ్‌గా, ఆరో వార్డు సభ్యురాలిగా కొత్తకొండ రోజా నవీన్ నామినేషన్ దాఖలు చేశారు. ఆరో వార్డుకు మరెవరి నామినేషన్లు రాకపోవడంతో ఆమె ఏకగ్రీవమయ్యారు. మరోవైపు ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో రోజా సర్పంచ్‌గానూ గెలుపొందారు. తన సవిూప అభ్యర్థిపై 140 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో అటు వార్డు మెంబర్‌గా, ఇటు సర్పంచ్‌గా డబుల్ విక్టరీ సొంతం చేసుకున్నారు. అయితే ఆమె వార్డు మెంబర్ పదవికి రాజీనామా చేయనున్నారు.
అత్తాకోడళ్లు పోటీ.. కోడలు విజయం
మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్తా, మామలతో కోడళ్లు సవాల్ విసిరి విజయం సాధించారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం గన్‌శ్యాందాస్‌నగర్ గ్రామ సర్పంచ్ స్థానానికి అత్తాకోడళ్లు పోటీపడ్డారు. అత్త సూర నర్సమ్మపై కోడలు సూర రమ 18 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. మొత్తం 1906 ఓట్లు పోలవగా రమకు 874, నర్సమ్మకు 856 ఓట్లు పోలయ్యాయి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరామ్‌నగర్ సర్పంచ్ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వు కాగా సర్పంచ్ స్థానానికి ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకు, కోడలు నామినేషన్ వేయగా, కొడుకు శ్రీరామ్‌గౌడ్ ఉపసంహరించుకున్నారు. దీంతో బరిలో మామ, కోడలు మిగిలారు. ఆదివారం జరిగిన ఎన్నికలో మామపై రాధిక 14 ఓట్ల మెజరిటీతో విజయం సాధించారు.
వార్డు మెంబర్‌గా గెలుపు : గుండెపోటుతో మృతి
నాగర్‌కర్నూల్, ప్రజాతంత్ర, డిసెంబరు 15: నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన ఓ వ్యక్తి హఠాత్తుగా మృత్యువాత పడటం స్థానికంగా విషాదం నింపింది. ఈ సంఘటన బిజినపల్లి మండలం వెంకటాపూర్‌లో చోటుచేసుకుంది. రెండో విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన జుర్రు మహేష్ యాదవ్ (34) వార్డు మెంబర్‌గా పోటీ చేసి ఆదివారం విజయం సాధించాడు. అయితూ అనూహ్యంగా అర్ధరాత్రి నిద్రలోనే గుండెపోటుతో మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య లావణ్యతోపాటు ఇద్దరు సంతానం ఉన్నారు. మహేష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



