- తొలి వోటు వేసిన ప్రధాని మోదీ
– వీల్ ఛైర్‌లో వొచ్చి వోటేసిన మాజీ ప్రధాని దేవెగౌడ
న్యూదిల్లీ,సెప్టెంబర్ 9: నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ భారత ఎన్నికల సంఘం మంగళవారం నిర్వహించింది. పార్లమెంటు నూతన భవనంలోని వసుధ ఎఫ్ 101లో 10 గంటలకు సందడిగా ఓటింగ్ ప్రారంభమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలి వోటు వేశారు. ఆ వెంటనే ఆయన వరద బాధిత రాష్ట్రాలైన హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌కు బయలుదేరారు. అనంతరం రాజ్‌నాథ్ సింగ్ తదితరులు వోటేశారు. పార్లమెంటు ఉభయ సభల ఎంపీలు తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ క్యూలో నిలబడి వోటువేయడం అందర్నీ ఆకట్టుకుంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరామ్ రమేష్, శశిథరూర్ తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ వీల్ చైర్‌లో వచ్చి వోటు వేశారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, కిరణ్ రిజిజు, చిరాగ్ పాశ్వాన్, కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ హరివంశ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, ఎస్పీ నేత రామ్‌గోపాల్ యాదవ్ తదితర ప్రముఖులు వోటు హక్కును వినియోగించుకున్నారు. వివిధ కారణాల రీత్యా వోటింగ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్టు భారత్ రాష్ట్ర సమితి, బిజూ జనతాదళ్, శిరోమణి అకాలీదళ్ ప్రకటించాయి. బీఆర్‌ఎస్‌కు నలుగురు రాజ్యసభ సభ్యులు, బీజేడీకి ఏడుగురు రాజ్యసభ సభ్యులు, శిరోమణి అకాలీదళ్‌కు ఒక ఎంపీ ఉన్నారు. జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఖాలీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ పదవి కోసం ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. పార్లమెంట్ ఉభయసభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 అయినప్పటికీ ఏడు స్థానాలు ఖాలీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. ఎన్డీయేకి 425 మంది సభ్యుల బలం ఉంది. వైకాపా, ఇతర పార్టీల మద్దతు కలిపితే ఆ సంఖ్య 438కి మించే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డికి 314 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ సంఖ్య పెద్దగా మారే సూచనలు లేవు. ఎన్డీయే అభ్యర్థి గెలుపు లాంఛనమని తెలిసినా ప్రతిపక్షాలు ఈ ఎన్నికలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని రంగంలోకి దించాయి. రాజ్యాంగం, ప్రజాస్వామ్య రక్షణ కోసం పార్టీలకతీతంగా ఆయనకు వోటేయాలని విస్తృత ప్రచారం చేశాయి. ఎన్డీయే అభ్యర్థి సి.పి.రాధాకృష్ణన్ హడావుడి లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. ఎన్నికలో రహస్య వోటింగ్ విధానాన్ని అనుసరిస్తారు. రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో కూడుకున్న ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు తమకు నచ్చిన వారికి వోటు వేసే వెసులుబాటు ఉంటుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





