ప్రాథమిక చర్యలు ప్రారంభించిన ఎన్నికల సంఘం
న్యూదిల్లీ, జులై 23: భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ రాజీనామా చేసిన విషయం గురించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈనెల 22న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక నిర్వహించే బాధ్యత భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం భారత ఎన్నికల సంఘానికి ఉందని, ఈ ఎన్నికలు 1952 అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల చట్టం, 1974 ఎన్నికల నిబంధనలు ప్రకారం నిర్వహించనున్నట్లు ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ క్రమంలో ఉప రాష్ట్రపతి ఎన్నిక 2025 కోసం ఎన్నికల సంఘం అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించింది. ఈ ప్రాథమిక చర్యలు పూర్తయిన వెంటనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఈ ఎన్నికల ప్రక్రియలో రాజ్యసభ, లోక్‌సభలోని ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యులు పాల్గొంటారు. రిటర్నింగ్ ఆఫీసర్/అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్(లు) నియామకం తుది దశలో ఉంది. గత ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్య సమాచారాన్ని సేకరించి పంపిణీ చేయడం వంటి ప్రాథమిక ఏర్పాట్లు పూర్తి చేయనుంది.





