– ఎన్‌డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్..‘ఇండీ’ కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి
– ఉదయం పది గంటలకు పోలింగ్ ప్రారంభం
– సాయంత్రం 5 వరకు జరగనున్న పోలింగ్
– 6 గంటల నుంచి వోట్ల లెక్కింపు.. వెంటనే ఫలితం ప్రకటన
న్యూదిల్లీ,సెప్టెంబర్8: జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఖాలీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి మంగళవారం ఎన్నిక జరగనుంది. ఎన్నికకు సర్వం సిద్ధమైంది. పార్లమెంటు ఉభయసభల సభ్యులుగా ఉన్నవారు మంగళవారం జరిగే ఎన్నికలో వోటేస్తారు. ఈ ఎన్నికలను తెలంగాణకు చెందిన బిఆర్‌ఎస్ బహిష్కరించింది. ఒడిషాకు చెందిన బిజూ జనతా దళ్ కూడా వోటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఎన్‌డీఏ తరఫున మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (67), విపక్ష ‘ఇండీ’ కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి (79) పోటీ చేస్తున్నారు. అన్ని పార్టీల ఎంపీలూ ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు. ఈ ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. పార్లమెంటు భవనంలోని వసుధలో ఎఫ్-101 గదిలో మంగళవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 6 గంటలకు వోట్లు లెక్కించి ఫలితం ప్రకటిస్తారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల మద్దతు కోరిన సుదర్శన్‌రెడ్డి కూడా దేశ రాజధానికి వచ్చేశారు. తాను ఏ పార్టీ తరఫునా పోటీ చేయడం లేదని, రాజకీయాలకతీతంగా తనకు వోటు వేయాలని ఆయన ఉభయ సభల ఎంపీలకు లేఖ రాశారు. తమ ఎంపీలు వోట్లు సక్రమంగా వేసేందుకు వీలు కల్పిస్తూ రెండు కూటములూ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేశాయి. బీజేపీ ఎంపీలకు ఆ పార్టీ అధినాయకత్వం తలపెట్టిన రెండ్రోజుల వర్క్‌షాప్ ఆదివారం దిల్లీలో మొదలైంది. ప్రధాని మోదీ దీనికి హాజరయ్యారు. ఈ క్రమంలో సోమవారం ఎన్‌డీఏ ఎంపీలతో కలిసికట్టుగా వ్యూహరచనకు దిగారు. ఇక విపక్ష ఎంపీలకు కాంగ్రెస్ సోమవారం మధ్యాహ్నం సంవిధాన్ సదన్ సెంట్రల్ హాలులో మాక్‌పోల్ నిర్వహించి.. వోటు ఎలా వేయాలో వివరించారు.ఉభయసభల్లో ఎన్‌డీఏకే సంఖ్యాబలం ఉంది. రెండు సభల్లో మొత్తం 788 మంది సభ్యులకు గాను ప్రస్తుతం 781 మందికి గాను లోక్‌సభలో 542, రాజ్యసభలో 239 మంది ఉన్నారు. ఎన్‌డీఏకి 425 మంది, ఇండీ కూటమికి 311 మంది, ఇతర ప్రతిపక్షాలకు 45 మంది సభ్యులున్నారు. ఇతర ప్రతిపక్షాల్లో వైసీపీ (11) ఎన్‌డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. బీజేడీ (7) మద్దతు కోసం ఆ పార్టీ అధినేత, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్‌కు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేశారు. సరైన సమయంలో తమ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని బీఆర్‌ఎస్ ఎంపీ కె.సురేశ్‌రెడ్డి మిడియాకు తెలిపారు. అయితే ఈ రెండు పార్టీలు తాజాగా ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. బిఆర్‌ఎస్‌కు రాజ్యసభలో నలుగురు సభ్యులున్నారు. శిరోమణి అకాలీదళ్ వంటి ఏకసభ్య పార్టీలు, స్వతంత్రులు ఎటు మొగ్గుతారో చూడాలి. రహస్య బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనున్నందున అధికార కూటమి నుంచి సుదర్శన్‌రెడ్డికి క్రాస్ వోటింగ్ జరుగుతుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. అటు బీజేపీ కూడా తమిళనాడు ఎంపీల్లో కొందరు తమ రాష్ట్రానికే చెందిన రాధాకృష్ణన్ వైపు మొగ్గుచూపుతారని అంచనా వేస్తోంది. దళిత, ఆదివాసీ ఎంపీలందరూ జస్టిస్ సుదర్శన్‌రెడ్డికే మద్దతివ్వాలని తమిళనాడుకు చెందిన వీసీకే ఎంపీ తిరుమావళవన్ ఒక లేఖలో పిలుపిచ్చారు. ఆయన పార్టీకి లోక్‌సభలో ఇద్దరు సభ్యులున్నారు. 2002 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భైరాన్‌సింగ్ షెకావత్‌కు 454 వోట్లు రాగా.. ఆయనపై బరిలోకి దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్‌కుమార్ షిండేకు 302 వోట్లు వొచ్చాయి. వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నికైనడు 516 వోట్లు సాధించగా ప్రత్యర్థి గోపాలకృష్ణ గాంధీకి కేవలం 244 వోట్లు వొచ్చాయి. 2022 ఎన్నికల్లో జగదీప్ ధన్‌ఖడ్‌కు 520 ఓట్లు వచ్చాయి. విపక్షాల ఐక్య అభ్యర్థి మార్గరెట్ ఆల్వా కేవలం 182 వోట్లు సాధించారు. ఈసారి ఎన్‌డీఏ అభ్యర్థికి 500 వోట్లలోపే వొచ్చే అవకాశాలున్నాయి. ప్రతిపక్షాలు తమకున్న మొత్తం 324 వోట్లు సాధించినప్పటికీ అన్ని ఎక్కువ వోట్లు పొంది ఓడిపోవడం ఇదే మొదటిసారి అవుతుంది. చెల్లని వోట్లపై రెండు కూటముల్లో ఆందోళన నెలకొంది. 2022లో 15 మంది ఎంపీల వోట్లు చెల్లకపోవడమే దీనికి కారణం. ఎంపీలు తమ వోటింగ్ ప్రాధాన్యాలను అక్షరాల్లో కాకుండా అంకెల ద్వారా సూచించాలని, కానీ కొందరు అది గ్రహించలేకపోతున్నారని వారు చెబుతున్నారు. అంతేగాక ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిర్దిష్ట పెన్నులతోనే వారు తమ ప్రాధాన్యాలను తెలుపవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రతి 15 మంది పార్టీ ఎంపీలకు ఒక సమన్వయకర్తను నియమించింది. ప్రతిపక్ష సభ్యులను సమన్వయపరిచేందుకు ప్రత్యేక బృందాలను మోహరించింది.



