– కాజీపేట ఐటీఐ ప్రిన్సిపాల్‌గా సేవలకు గుర్తింపు
– మంత్రి వివేక్ చేతుల మీదుగా రాజధానిలో ప్రదానం
వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10: కృషి, పట్టుదలకు మారుపేరు పెచ్చెట్టి వెంకటేశ్వరరావు. క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్ధత కలిగిన ఆయన కాజీపేట ఐటీఐ ప్రిన్సిపాల్‌గా ఎందరో విద్యార్థులను పారిశ్రామిక రంగంలో తీర్చిదిద్దారు. మూడు దశాబ్దాలకుపైగా ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం లభించింది. ఏడాది కాలంగా కాజీపేట ఐటీఐ/అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) ప్రిన్సిపాల్‌గా ఆయన నూటికి నూరు శాతం అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. అలాగే ఉత్తీర్ణులైన విద్యార్థులకు 60 శాతం ప్లేస్‌మెంట్స్ ఇప్పించి వారి జీవితాల్లో వెలుగు దివ్వెలు ప్రసరింపచేస్తున్నారు. ఇందుకుగాను పారిశ్రామిక ఉపాధి, శిక్షణ శాఖల మంత్రి వివేక్, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్‌లు రాష్ట్రస్థాయి ఉత్తమ ఐటీఐ ప్రిన్సిపాల్ అవార్డును వెంకటేశ్వరరావుకు హైదరాబాద్‌లో మంగళవారం అందజేశారు. ఆయన స్వస్థలం పూర్వ వరంగల్ జిల్లా బచ్చన్నపేట. విధి నిర్వహణలో భాగంగా వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో సేవలందించారు. ఏటూరునాగారం, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, చివరగా కాజీపేట ఐటీఐ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఆయన సతీమణి సీతామహాలక్ష్మి మిషన్ భగీరథ విభాగం(హన్మకొండ) అధికారి కాగా కుమారుడు నాగార్జున జనరల్ సర్జన్, కుమార్తె డాక్టర్ స్నిగ్ధ డెంటల్ స్పెషలిస్ట్. జిల్లాస్థాయిలో అనేక అవార్డులు తీసుకున్న తనకు ఇపుడు రాష్ట్రస్థాయి అవార్డు రావడంతో బాధ్యత మరింత పెరిగిందని వెంకటేశ్వరరావు అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





