నాయకుల భాష హుందాగా ఉండాలి

– రాజకీయాల నుంచి వైదొలగడం ఇష్టం లేదు
– పుస్తకావిష్కరణలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 5: భాష విషయంలో నాయకుల తీరు మారాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. సీనియర్‌ సంపాదకుడు ఇనగంటి వెంకట్రావు రాసిన విలీనం-విభజన-మన ముఖ్యమంత్రులు పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మంగళవారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు. విలీనం – విభజన మన ముఖ్యమంత్రులు పుస్తకాన్ని నేటితరం యువత తప్పనిసరిగా చదవాలని సూచించారు. ఈ పుస్తకం చదివితే నాయకుల పరిపాలన, విజ్ఞానం, వారి గురించి అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పుకొచ్చారు. పత్రికలు సమాజానికి దర్పణం లాంటివని.. సమాజంలో ఏం జరుగుతోందో ప్రజలకు చెప్పాలని సూచించారు. భాష విషయంలో రాజకీయ నాయకులు చాలా హుందాగా ప్రవర్తించాలని సూచించారు. బూతులు మాట్లాడిన నేతలు తర్వాతి ఎన్నికల్లో గెలవలేదని చెప్పారు. చాలామంది జర్నలిస్టులు కూడా కొత్తగా యూట్యూబ్‌లో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, పాత్రికేయంలో భాష చాలా ముఖ్యమని ఉద్ఘాటించారు. భాష విషయంలో అందరూ ఒకసారి పున:పరిశీలన చేసుకోవాలని సూచించారు. రాజకీయాల నుంచి వైదొలగడం తనకు ఇష్టం లేదని తెలిపారు. అయినా తాను ఉప రాష్ట్రపతిగా దిగిపోయిన నాటి నుంచి ఇప్పటివరకు బీజేపీ కార్యాలయం గుమ్మం తొక్కలేదని చెప్పారు. ఉప రాష్ట్రపతిగా రిటైర్‌ అయ్యాక యువత కోసం రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి, పుస్తక రచయిత ఇనగంటి వెంకట్రావు, సీనియర్‌ జర్నలిస్టులు కట్టా శేఖర్‌ రెడ్డి, బండారు శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *