“ఒకప్పుడు తనకు అత్యంత మిత్రదేశంగా ఉన్న వెనిజువెలా ఇప్పుడు ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లిపోవడం కూడా అమెరికా సహించలేకపోతున్నది. భారత్, చైనా, రష్యా వంటి దేశాలు డీడాలరైజేషన్ వైపుకు వేగంగా అడుగులు వేస్తున్నాయి. బ్రిక్స్ కూటమిలోని ఇతర దేశాలు కూడా డాలర్ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో, వెనిజువెలా తాను ఎగుమతి చేస్తున్న చమురుకు డాలర్‌కు బదులు యువాన్ వంటి ఇతర కరెన్సీలను అంగీకరించడం అమెరికాకు ఎక్కడలేని కోపాన్ని తెచ్చిపెట్టింది. ప్రపంచంలో బహుళ కరెన్సీల వినియోగం దిశగా వెళుతున్నప్పటికీ, డాలర్‌కు వచ్చిన ప్రమాదమేంలేదనేది కొందరు ఆర్థిక నిపుణుల అంచనా. కేవలం వెనిజువెలా మాత్రమే డాలర్‌ను దెబ్బతీస్తుందనుకోవడం కూడా భ్రమ మాత్రమే.”
వెనిజువెలా పై అర్థరాత్రి దాడిచేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అరెస్ట్ చేసిన సంఘటన లాటిన్ అమెరికా దేశాలను మాత్రమే కాదు ప్రపంచంలోని ఇతర దేశాలను ఒక్కసారిగా కుదిపేసిందనే చెప్పాలి. చమురు ఎగుమతి చేసే దేశాలు అమెరికా దురహంకారపూరిత దుశ్చర్యపై నోరు మెదపలేదు. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా దేశాలపై ఈ అరెస్ట్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ప్రపంచాన్ని శాసించిన చమురు రాజకీయాలు మరోసారి జడలు విప్పాయని మదురో అరెస్ట్ స్పష్టం చేస్తున్నది.
ప్రపంచంలోనే అత్యధికంగా అంటే 303 బిలియన్ బ్యారళ్ల చమురు నిల్వలున్న దేశం వెనిజువెలా. మొత్తం ప్రపంచ చమురు నిల్వల్లో 17శాతం ఇక్కడే ఉండటం తో వెనిజువెలా ప్రాధాన్యతను పెద్దగా వివరించాల్సిన పనిలేదు. ఇక్కడి జనాభా 30 మిలియన్లు. 267 బిలియన్ బ్యారళ్ల నిక్షేపాలతో సౌదీ అరేబియా రెండోస్థానంలో ఉంది. చమురు ఎగుమతి చేసే దేశాల సంస్థ (ఒపెక్) గణాంకాల ప్రకారం నవంబర్ నెలలో రోజుకు 93400 బ్యారళ్ల చమురును వెనెజులా ఉత్పత్తి చేసింది. 1990 నుంచి 2000 మధ్యకాలంలో రోజుకు మూడు మిలియన్ బ్యారళ్ల ఉత్పత్తితో పోలిస్తే ఇది చాలా తక్కువనే చెప్పాలి. చమురు ఉత్పత్తి పడిపోవడం హ్యూగో చావెజ్‌నుంచి ప్రారంభమై, మదురో కాలంలో కూడా కొనసాగింది. 2019లో మదురో వెనిజువెలా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత దేశంపై అమెరికా ఆంక్షలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మదురో అక్రమాలకు పాల్పడి తిరిగి అధ్యక్షుడయ్యాడనేది అమెరికా అభియోగం. ఈ కారణాన్ని చూపుతూ ఆంక్షలు విధించడంతో దేశంలోని చమురు పరిశ్రమ కుప్పకూలిపోయింది. ఫలితంగా దేశ ఆర్థిక పరిస్థితి తల్లక్రిందులైంది. వెనిజువెలాకు చెందిన ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థ ‘పీడీవీఎస్‌ఏ’ లావాదేవీలపై పూర్తిస్థాయి ఆంక్షలు విధించడంతో పాటు, ఈ సంస్థతో ఆర్థిక లావాదేవీలు జరిపే ఇతర దేశాలపై కూడా ఆంక్షలు తప్పవంటూ అమెరికా హెచ్చరించింది.
ఫలితంగా ఐరోపా సమాఖ్య, భారత్ వంటి దేశాలకు వెనిజువెలా చమురు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతోపాటు చమురు శుద్ధికి అవసరమైన రసాయనాల దిగుమతి కూడా ఆగిపోయింది. దీంతో వెనిజువెలా ప్రభుత్వం కరెన్సీని పెద్దమొత్తంలో ప్రింట్ చేయాలని సెంట్రల్ బ్యాంకును ఆదేశించడంతో, ఒక్కసారిగా దేశంలో అతి ద్రవ్యోల్బణం పెచ్చరిల్లి అసలు కరెన్సీకి విలువ లేకుండా పోయింది. 1970 ప్రాంతంలో అత్యంత ధనికదేశంగా ఉండిన వెనిజువెలా ఇప్పుడు దుర్భర దారిద్య్రంలోకి నెట్టివేతకు గురైంది. ఉపాధి లేక, ఆహార కొరతతో సతమతమైన ప్రజలు 2019 నుంచి పెద్ద ఎత్తున దేశం విడిచి వెళ్లిపోవడం మొదలైంది.
నిజం చెప్పాలంటే వెనిజువెలా ప్రభుత్వ అసమర్థ విధానాలవల్ల అమెరికా ఆంక్షలకు ముందే దేశ ఆర్థిక వ్యవస్థ పతనపథంలో పయనించడం మొద లైంది. నిర్వహణా లోపం, విపరీతమైన రాజకీయ ప్రమేయం, అన్ని రంగా ల్లో పెట్టుబడులు తగ్గడం, రాజకీయ పార్టీలు మితిమీరిన ఉచితాలు ప్రకటిం చడం వంటివి ప్రజలను బద్ధకస్తులుగా మార్చడమే కాకుండా, ప్రభుత్వాలపై విపరీత ఆర్థిక భారం పడి, దేశం దివాలా స్థితికి చేరుకోవడానికి కారణమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో వెనిజువెలా ప్రభుత్వ ఆధీనంలోని కంపెనీ ‘పీడీవీఎస్‌ఏ’ నిపుణుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఫలితంగా ప్రాథమిక నిర్వహణ కూడా కష్టమై పెట్టుబడుల కొరతతో సతమతమైంది. ప్రస్తుతం వెనిజువెలా చమురు ఉత్పత్తి మొత్తం అమెరికా నియంత్రణలోకి వెళ్లింది. అమెరికా కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించి పూర్తిస్థాయి ఉత్పత్తి దశకు చేరుకోవడానికి దశాబ్ద కాలం పట్టవచ్చు. అయితే వెనిజువెలా నుంచి తగ్గిన చమురు ఉత్పత్తిని ఇరాక్, సౌదీ అరేబియా వంటి దేశాలు పూడ్చగలవు.
వెనిజువెలా అధ్యక్షుడు మదురో దేశంలో డ్రగ్స్ ఉత్పత్తిని నియంత్రించలేక పోవడంతో, దీని ప్రభావం ఇతరదేశాలపై పడుతున్నదన్న కారణాన్ని చూపుతూ యు.ఎస్. అరెస్ట్ చేసినప్పటికీ, తెరవెనుక కారణాలు భిన్నం! ప్రపంచంలో 90 శాతం అరుదైన లోహాల ఉత్పత్తిని చైనా నియంత్రిస్తోంది. ఇదే చైనా వెనిజువెలా ప్రభుత్వ ఆధీనంలోని పీడీవీఎస్‌ఏకు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండటమే కాకుండా, ఆధునిక ఆయుధాల తయారీకి అవసరమైన క్రిటికల్ మినరల్స్ మైనింగ్ చేయడంలో ఈ సంస్థతో కలిసి పనిచేస్తున్నది. ఇక వెనిజువెలా భూభాగంలో ఇరాన్ డ్రోన్ల తయారీ సంస్థలను నెలకొల్పగా, రష్యా తన సైనిక సలహాదారులను ఇక్కడ నియమించింది. ఈ పరిణామాలన్నీ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న 2025 వ్యూహాత్మక భద్రతా వ్యూహానికి ఇబ్బందికరంగా మారాయి. యు.ఎస్. ఫస్ట్ పాలసీని అమలు చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్న ట్రంప్, ఈ పరిణామాలను అరికట్టి దేశ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి వీలుగా 1990 నాటి ప్రచ్ఛన్న యుద్ధ వ్యూహాన్ని తిరిగి అమలు చేస్తున్నారనుకోవాలి.
ఒకప్పుడు తనకు అత్యంత మిత్రదేశంగా ఉన్న వెనిజువెలా ఇప్పుడు ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లిపోవడం కూడా అమెరికా సహించలేకపోతున్నది. భారత్, చైనా, రష్యా వంటి దేశాలు డీడాలరైజేషన్ వైపుకు వేగంగా అడుగులు వేస్తున్నాయి. బ్రిక్స్ కూటమిలోని ఇతర దేశాలు కూడా డాలర్ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో, వెనిజువెలా తాను ఎగుమతి చేస్తున్న చమురుకు డాలర్‌కు బదులు యువాన్ వంటి ఇతర కరెన్సీలను అంగీకరించడం అమెరికాకు ఎక్కడలేని కోపాన్ని తెచ్చిపెట్టింది.
ప్రపంచంలో బహుళ కరెన్సీల వినియోగం దిశగా వెళుతున్నప్పటికీ, డాలర్‌కు వచ్చిన ప్రమాదమేంలేదనేది కొందరు ఆర్థిక నిపుణుల అంచనా. కేవలం వెనిజువెలా మాత్రమే డాలర్‌ను దెబ్బతీస్తుందనుకోవడం కూడా భ్రమ మాత్రమే. ఇదిలాఉండగా ఇప్పుడు అమెరికా నియంత్రణలోకి వెనిజువెలా వెళ్లిపోవడంతో, అక్కడి చమురు పరిశ్రమ మళ్లీ మామూలు స్థితికి చేరుకోవడానికి చాలా కాలం పడుతుంది. గతంలో అమెరికా పుణ్యమాని ప్రభుత్వాలు కుప్పకూలిన ఇరాక్, లిబియాల పరిస్థితి ఎట్లా ఉన్నదో మనకు బాగా తెలుసు. ఇప్పుడు వెనిజువెలా భవిష్యత్తు కూడా ఇదే మాదిరి ఉండబోతున్నదనేది మాత్రం సుస్పష్టం.
-జమలాపురం విఠల్ రావు
సీనియర్ జర్నలిస్ట్