వేలేరు మాజీ జెడ్పీటీసీ సరిత కన్నుమూత

సోదరి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పల్లా

హన్మకొండ, ప్రజాతంత్ర, జులై 13: హన్మకొండ జిల్లా వేలేరు మండల జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి సోదరి చాడ సరిత అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. ఆమె క్యాన్సర్‌తో ఆరు నెలలుగా బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే కొత్త మండలమైన వేలేరు జెడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. మండలాభివృద్ధి కోసం తనపై ఒత్తిడి తెచ్చి అనేక అభివృద్ధి పనులు చేయించిందని ఆమె సోదరుడు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ధర్మసాగర్‌ నుండి వేలేరు డబుల్‌ రోడ్‌, మండలం మొత్తానికి దేవాదుల పైప్‌ లైన్‌ ద్వారా సాగు నీరు సాధించడం, వేలేరుకు సబ్‌-మార్కెట్‌ యార్డు, మహిళా సంఘాల భవనాల నిర్మాణం కోసం ఆమె కృషి చేశారంటూ ఆమె సేవలను కొనియాడారు. ఎవరు ఏ సమయంలో తనను సంప్రదించినా అధికారుల దృష్టికి కానీ, తన దృష్టికి కానీ ఆయా సమస్యలు తీసుకొచ్చి పనులు చేయించేవారన్నారు. తనకు ఎన్ని సమస్యలున్నా నొచ్చుకోకుండా నిత్యం ప్రజలందరికీ సేవలందించారని, సాదాసీదాగా ఉంటూ నిజాయతీకి మారుపేరుగా నిలిచిన తన సోదరి రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించారని, పార్టీ కార్యక్రమాల్లో అత్యంత చురుగ్గా పాల్గొని అన్నింటినీ విజయవంతం చేశారని పేర్కొన్నారు. సరిత మరణం తనకు వ్యక్తిగతంగా పూడ్చలేనిదని, మండల నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఆమె చేసిన సేవలు మరుపురానివని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటామని రాజేశ్వరరెడ్డి హామీ ఇస్తూ ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు.
శ్వరరెడ్డి హామీ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *