దేశ గౌరవం, సమగ్రతకు పునరంకితమ‌వుదాం

– వందేమాతరం గీతం ఉత్సవంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: వందేమాతరం గీతాన్ని రచించి నేటికి సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ చారిత్రక సమయంలో అందరం మన ఆత్మగౌరవం, దేశ గౌరవం, సమగ్రత కోసం పునరంకితం కావాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. అందుకే నేటి యువతరం ఈ స్ఫూర్తిని భవితరానికి అందించాలన్నారు. ఇది ఏ ఒక్క మతానికో సంబంధించిన నినాదం కాదని, ఇది అన్ని వర్గాలలో స్ఫూర్తిని నింపిందని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం అందించడంలో కీలక పాత్ర పోషించిన నినాదం ఇదేనన్నారు. వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా కోఠిలోని హనుమాన్‌ వ్యాయామశాల వద్ద జరిగిన వందేమాతరం గీతం 150 ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన ఎందరో మహానుభావులు ‘వందేమాతరం’ రణ నినాదంతో పోరాడారని, బానిస సంకెళ్లను తెంచడంలో ఈ గేయం అద్భుతమైన స్ఫూర్తిని నింపిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. బ్రిటిషర్లపై పోరాటంలోనే కాదు.. నిజాం, రజాకార్ల వ్యతిరేక పోరాటంలో కూడా వందేమాతరం నినాదం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఈ పోరాటంలో నారాయణరావు పవర్‌, వందేమాతరం రామచందర్‌, రామ్‌నాథ్‌ తీర్ధ కావచ్చు.. ఎందరో మహానుభావులు నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి పోరాడారు. వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ గడ్డపై మూడు రంగుల జెండా ఎగిరేలా చేశాం అని వివరించారు. 13 నెలల ఆలస్యంగా 1948 సెప్టెంబర్‌ 17న మనకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో రామచందర్‌ అనే విద్యార్థి నిజాంకు వ్యతిరేకంగా నినాదం ఇస్తే అతన్ని కాలేజీ నుండి బహిష్కరించి అనేక ఇబ్బందులు పెట్టారు.. మన తెలుగు బిడ్డ అల్లూరి సీతారామరాజు బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడగా వారు కాల్చినప్పుడు కూడా చివరి క్షణంలో వందేమాతరం నినాదం ఇచ్చారు అని ఆయన చెప్పారు. బంకించంద్ర ఛటర్జీ వందేమాతరం గేయాన్ని రూపొందిస్తున్నప్పుడు ఈ దేశంలోని మాతల పేర్లు, నదుల పేర్లు, ప్రాంతాల పేర్లు ఉండేలా చూసుకున్నారు. కానీ, దురదృష్టవశాత్త్తు కొందరు దీనిని విమర్శిస్తున్నారన్నారు. ఇక్కడ ఉన్న అసదుద్దీన్‌ ఒవైసీ హైదరాబాద్‌ ఎంపీ అయినప్పటికీ భారతమాతా కీ జై అనే నినాదం ఇవ్వరు కానీ పార్లమెంటులో జై పాలస్తీన్‌ అని అన్నారు.. అతనికి భారత మాత పేరు చెప్పాలంటే నచ్చదు అని కిషన్‌రెడ్డి విమర్శించారు. భారతమాత సంకెళ్లను తెంచడంలో కీలక పాత్ర పోషించిన ఈ వందేమాతరం ఉత్సవాలను మనం ఏడాదిపాటు ఘనంగా జరుపుకుందామని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బంకించంద్ర ఛటర్జీ మన దేశం సుసంపన్న దేశంగా, విశ్వగురువుగా ఉండేలా ఆశించారన్నారు.

వందేమాతరంలోని మహత్తును అర్థం చేసుకోవాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు మాట్లాడుతూ వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో నేటినుండి 25వ తేదీ వరకు ‘వందేమాతరం-150’ పేరుతో పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వందేమాతరం అంటే భరతమాతకు వందనం. రాష్ట్ర యువత, విద్యార్థులు వందేమాతరం గీతం అసలైన మహత్తును అర్థం చేసుకోవాలి. ఇది ఒక గేయం మాత్రమే కాదు- భారతీయుల జీవన జ్యోతి.. దేశ స్వాతంత్య్ర సమరానికి ప్రేరణనిచ్చిన శక్తిగా నిలిచింది. ఆ జ్వాల, ఆ ప్రేరణ మనలో ప్రతి రోజూ సజీవంగా ఉండాలి అని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *