జోరుగా ‘పచ్చదనం’ పండగ

– ఉత్సవాన్ని తలపిస్తున్న వన మహోత్సవం
– ఇప్పటివరకు 1.70 కోట్ల మొక్కలు నాటిన పంచాయతీ, గ్రామీణాభివృద్ది శాఖ
– మంత్రి సీతక్క నేతృత్వంలో ఊపందుకున్న కార్యక్రమం

హైదరాబాద్‌, జూలై 19: రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏటా ప్రతిష్టాత్మకంగా చేపట్టే వనమహోత్సవ కార్యక్రమం పల్లెల్లో జోరుగా సాగుతోంది. గత ఏడాది 6 కోట్ల 90 లక్షల మొక్కలు నాటిన ఘనతను సాధించిన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ ఈ సంవత్సరం ఏడు కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకుని అదే దిశగా చురుకుగా పనిచేస్తోంది. ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యంలో పీఆర్‌ ఆర్‌డీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నాటికి 1.7 కోట్ల మొక్కలను నాటారు. ఇది నిర్దేశించుకున్న లక్ష్యంలో 39 శాతమని అధికారులు తెలిపారు. ఇక మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పీఆర్‌, ఆర్డీ శాఖ మంత్రి డాక్టరు దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. అందుకనుగుణంగా అధికారులు పనులను వేగవంతం చేశారు. మొక్కులు నాటేందుకు గుంతలు తవ్వే కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకు 85 శాతం మేర గుంతలు తవ్వి మొక్కులు నాటేందుకు సిద్దం చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే నల్గొండ జిల్లాల్లో వన మహోత్సవం కాస్త మందకొడిగా సాగుతోంది. ఇప్పటివరకు ఆ జిల్లాలో 42 వేల మొక్కలను మాత్రమే నాటారు. దీంతో ఆ జిల్లాలో వన మహోత్సవంలో వేగం పెంచాలని పీఆర్‌, ఆర్డీ శాఖ అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ములుగు, ఇల్లందు, కామారెడ్డి, పెద్దపల్లి, భూపాలపల్లి వంటి నియోజకవర్గాల్లో పర్యటించిన మంత్రి సీతక్క స్వయంగా మొక్కలు నాటి ప్రజల్లో పచ్చదనం పట్ల చైతన్యం కలిగించారు. పచ్చదనం లేకపోతే భవిష్యత్తు ఉండదని, పిల్లల భవిష్యత్తు కోసం అందరూ మొక్కలను సంరక్షించాలని పిలుపునిచ్చారు. పల్లెల్లో వనమహోత్సవం కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళా సంఘాలు, యువత, రైతులు, స్వచ్చంద సంస్థలు, బడి పిల్లలు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. పచ్చదనం విస్తరణతోపాటు నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, తద్వారా గ్రామాల్లో మౌలిక మార్పులకు ఈ వనమహెత్సవం దోహదపడనుందని అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంతో వనమహోత్సవ కార్యక్రమాలు జనమహోత్సవాన్ని తలపిస్తున్నాయి. ఈ దఫా వనమహోత్సవంలో బాగంగా పీఆర్‌ ఆర్‌డీ శాఖ పండ్ల తోటలకు, ఉద్యానవన పంటలకు అధిక ప్రధాన్యతనిస్తోంది. ఈసారి 22 వేల ఎకరాల్లో పండ్ల తోటలు పెంచాలని లక్షం పెట్టుకోగా ఇప్పటివరకు 4521 ఎకరాల్లో పండ్ల మొక్కలను నాటారు. ఇది లక్ష్యంలో 21 శాతంగా ఉంది. మంత్రి సీతక్క, ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎన్‌.శ్రీధర్‌, డైరెక్టర్‌ జి.సృజన ప్రతి రోజూ సమీక్షలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేస్తున్నారు. దీంతో నిర్దేశిత లక్ష్యాన్ని త్వరలోనే పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *