జనారణ్యంగా ఏడుపాయల

– భక్తులతో కిక్కిరిసిన వనదుర్గమాత ఆలయం
– కన్నులపండువగా మహా శివరాత్రి జాతర
– పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రోహిత్ దంపతులు

మెదక్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఏడుపాయల గుట్టలు శివనామ స్మరణలతో మార్మోగాయి. ఏడు పాయలుగా ప్రవహించే మంజీరా నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, ఉపవాసదీక్షలు ప్రారంభించారు. తెల్లవారు జామున ఆలయ అర్చకులు మూలవిరాట్ వనదుర్గ అమ్మవారి విగ్రహానికి అభిషేకం నిర్వహించగా భక్తులకు ద‌ర్శ‌నాలు ప్రారంభమ య్యాయి. మూడు రోజులపాటు జరిగే జాతరను ఆదివారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు దంపతులు అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి  ప్రారంభించారు. లక్షలాది మంది భక్తులు ఏడుపాయలకు చేరుకున్నారు. శివరాత్రి ఉపవాస దీక్షలు చేపట్టాలనే ఉద్దేశంతో శనివారం రాత్రే చాలామంది భక్తులు ఏడుపాయలకు చేరుకోగా మరికొంతనుంది తెల్లవారు జామున చేరుకున్నారు. గంట గంటకు భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. పోతంశెట్టిపల్లి వైపు నుండి వచ్చిన భక్తులు రెండవ బ్రిడ్జి వద్ద పార్కింగ్ ప్రదేశంలో తమ వాహనాలను నిలిపి కిలోమీటర్ పొడవున నడుచుకుంటూ ఏడుపాయలకు చేరుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, జహీరాబాద్, నారాయణఖేడ్ తదితర ప్రాంతాల వారు నాగ్సాన్పల్లి వైపు గల ఏడుపాయల కమాన్ మీదుగా ఏడుపాయలకు చేరుకున్నారు. వాహనాలను చల్మెల కుంట వద్ద పోలీసులు  నిలిపివేయగా భక్తులు ఆలయానికి  కిలోమీటర్ మేర నడవాల్సి రావడంతో వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు ఎదుర్కున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర తదితర సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు మూడు రోజులపాటు ఏడుపాయల్లో ఉండేలా మూటముల్లెతో చేరుకున్నారు. ఏడుపాయల్లో ధర్మ సత్రాలు అందుబాటులో లేనందున టెంట్లు, డేరాలు వేసుకున్నారు. మరికొందరు తమ రవాణా సాధ‌నాలైన‌ లారీలు, ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, ఆటోల మీదే ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. భక్తులు మొదటి రోజు ఏడుపాయల్లో ఉపవాస దీక్షలు చేపట్టి మరుసటి రోజు బండ్లు తిరిగే కార్యక్రమంలో పాల్గొని రథోత్సవం ముగిశాక తిరిగి ప్రయాణం అవుతారు. హైదరాబాద్ నుండి పోతంశెట్టిపల్లి వైపు నుండి బస్సులలో వచ్చే భక్తుల కోసం ఏడుపాయల వరకు ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. అంతేకాక పరిసర ప్రాంతాలోని వివిధ గ్రామాల ప్రజలు తండోపతందాలుగా ఏడుపాయలకు తరలి వచ్చారు. ఉదయం అంతంతమాత్రంగా ఉన్న భక్తుల సంఖ్య సాయంత్రానికి భారీ స్థాయికి చేరుకుంది. ఆనకట్టపై ప్రమాదాలు జరగకకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో బారికేడ్లను కట్టి దారిని మూసివేశారు.
అద్భుతంగా ఆలయ అలంకరణ
ఆలయాన్ని రకరకాల పూలతో మహా అద్బు తంగా అలంకరించారు. ఆలయ మంటపం ప్రధాన ద్వారం వద్ద అమ్మవారి రూపంలో పూలతో అలంకరించడం భక్తులకు ముచ్చట గొలిపింది. ఆలయ మంటపం వెలుపల రంగురంగుల పూలతో అలంకరించారు. ఫ్లడ్ లైట్ల, రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణ భక్తులను ఆకర్షిస్తున్నది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చర్యలు తీసుకున్నారు. అమ్మవారి మూల విరాట్ ని సైతం బంగారు కిరీటం, బంగారు ఆభరణాలతో అలంకరించారు.
పకడ్బంగా ఏర్పాట్లు
జాతరకు 10 లక్షలపై చిలుకు భక్తులు రానున్నారన్న అంచనాలతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల స్నానాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సింగూర్ ప్రాజెక్టు నుండి నీటిని వనదుర్గా ప్రాజెక్టుకు విడుదల చేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఘనపురం ఆనకట్ట, అమ్మవారి ఆలయం, చెక్ డ్యామ్ తదితర ప్రాంతాలలో, షవర్ల వద్ద స్నానాలు ఆచరించారు. భక్తులకు తాగునీటి ఇబ్బందులు ఎదురవ్వకుండా నల్లాలతోపాటు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించారు. నీరు కలుషితం కాకుండా వైద్య సిబ్బంది మనపురం అనకట్ట, చెక్ డ్యాం ప్రాంతాలలో క్లోరినేషన్ చేశారు. భక్తుల సంఖ్యకనుగుణంగా మరుగుదొడ్లతోపాటు బాయో టాయిలెట్స్ సైతం ఏర్పాటు చేశారు. విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రోహిత్ దంపతులు
వన దుర్గ మాతకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడుపాయల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
వన దుర్గామాతను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ దంపతులు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ మర్యాదలతో ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వీరేశం చంద్రశేఖర్, సూర్య శ్రీనివాస్, పూజారులు శంకర్ శర్మ, పార్టివ శర్మతోపాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట మాజీ చైర్మన్ పబ్బతి ప్రభాకర్ రెడ్డి, గోవింద్ నాయక్, ప్రశాంత్ రెడ్డి, భారత్ తదితరులు న్నారు. జాతరను మెదక్ అదనపు ఎస్పీ మహేందర్ పర్యవేక్షించారు. మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు కొనసాగుతున్నది. ఇద్ద‌రు డీఎస్పీలు, ఎనిమిదిమంది సీఐలు అనుక్షణం జాతర పరిసర ప్రాంతాల్లో భద్రతను అనుక్షణం పరిశీలిస్తున్నారు. దీంతోపాటు సీసీ కెమెరాల తో డేగకన్నుల నిఘాతో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *