– వెనుకబడిన తరగతుల కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: దేశంలో ఆర్థిక ప్రగతికి, సమగ్ర సంక్షేమ సాధనకు బలమైన పునాదులు వేసిన దార్శనిక పరిపాలకుడు భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు అని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. పి.వి. 21వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పి.వి. జ్ఞానభూమి వద్ద మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పి.వి. నరసింహారావు పాలన కాలం (1991-1996) భారతదేశ ఆధునిక చరిత్రలో ఒక నిర్ణాయక మలుపుగా నిలిచిందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనేకాక దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లను అమలులోకి తీసుకొచ్చిన ఘనత ఆయనదేనని కొనియాడారు. సామాజిక న్యాయాన్ని కేవలం నినాదంగా కాక విధానపరమైన చర్యల రూపంలో అమలు చేసిన నాయకత్వం పీవీదేనని స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళల హక్కుల పరిరక్షణ కోసం కమిషన్లను ఏర్పాటు చేసి, అణగారిన వర్గాలకు రాజ్యాంగపరమైన భరోసా కల్పించిన దూరదృష్టి గల పరిపాలకుడిగా ఆయన నిలిచారన్నారు. ఆర్థిక రంగంలో లైసెన్స్ రాజ్‌ను రద్దు చేయడం, విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవడం, ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహం వంటి సాహసోపేత నిర్ణయాలతో దేశ ఆర్థిక దిశనే మార్చారని పేర్కొన్నారు.ఆనాటి సంస్కరణలే నేటి స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా వంటి కార్యక్రమాలకు పునాదులుగా నిలిచాయని వివరించారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటు ద్వారా గ్రామీణ, పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి, ఎందరో ప్రతిభావంతుల భవిష్యత్తుకు మార్గదర్శనం చేసిన నాయకత్వం పీవీదేనన్నారు. విద్య, ఆర్థిక అభివృద్ధి, సామాజిక సమానత్వాన్ని సమన్వయపరిచి పాలన సాగించారని కొనియాడారు. తక్షణ రాజకీయ లాభాలకన్నా, తరతరాల భారత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాలతో ఆయన భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని డాక్టర్ వకుళాభరణం పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




