– డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు
– పార్టీ అధ్యక్షుడు రామచందర్‌రావు సమక్షంలో చేరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు బీసీ కమిషన్ సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్రంలో తొలి బీసీ కమిషన్ సభ్యుడిగా, అనంతరం రెండో హయాంలో బీసీ కమిషన్ చైర్మన్‌గా సేవలందించిన డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి ప్రాథమిక సభ్యత్వాన్ని రామచందర్‌రావు అందజేశారు. ముఖ్య అతిథులుగా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వకుళాభరణం మాట్లాడుతూ బీసీలకు న్యాయం చేయగల పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో రేవంత్ ప్రభుత్వం తప్పులు చేస్తూ మోసం చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. బీఆర్‌ఎస్ కూడా ఈ అంశంలో చిత్తశుద్ధి చూపలేదన్నారు. అందుకే తాను బీజేపీలో చేరినట్టు స్పష్టం చేశారు. బీసీల వాటాను కాపాడుకోవడం, కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పెంపు అవసరం ఉందని అన్నారు. తెలంగాణలో ప్రారంభమైన ఈ పోరాటాన్ని జాతీయ వేదికపై ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అత్యవసర సమావేశం నిమిత్తం దిల్లీకి వెళ్తూ ఉదయమే ప్రత్యేకంగా కలిసి వకుళాభరణానికి శాలువా కప్పి అభినందించారు. బీసీల హక్కుల కోసం వకుళాభరణం పోరాడిన విషయాలను లక్ష్మణ్ గుర్తుచేశారు. మేధావులు, కృష్ణమోహన్ చేరిక పార్టీకి శక్తిమంతమైన అస్త్రం అని, ఆయన బీసీ కమిషన్ చైర్మన్ కాకముందే 30 ఏళ్లకుపైగా బీసీల హక్కుల కోసం పోరాడారని, 1986 నుంచే అనేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని, ఆయన చేరిక బీజేపీకి పటిష్టతను తెస్తుందని ఆర్.కృష్ణయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావ్ పాటిల్, డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు, సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





