-హెచ్‌ఐసీసీలో స్పోర్ట్సు కాంక్లేవ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీహరి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 2: యువతను క్రీడల వైపు మళ్ళిస్తూ అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ క్రీడల పాలసీని తీసుకొచ్చినట్లు క్రీడలు, యువజన సర్వీసులు, పశు సంవర్ధక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. హెచ్‌ఐసీసీలో ఫస్ట్ ఎడిషన్ తెలంగాణ స్పోర్ట్స్ కాన్‌క్లేవ్ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే కొత్తగా స్పోర్ట్స్ పాలసీని అమలు చేస్తూ అన్ని క్రీడలకు సముచిత స్థానం కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ఈ పాలసీ ద్వారా క్రీడలు ఎంతగానో అభివృద్ధి చెందుతాయన్నారు. క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ వాటి ప్రాముఖ్యతను పెంచే విధంగా నూతన క్రీడా విధానం అమలు చేస్తామని తెలిపారు. ఈ పాలసీ అమలులో గతంలో క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు, దీర్ఘకాలంగా క్రీడల్లో ఉన్న వారు, క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శించే వారికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతామన్నారు. ఈ పాలసీలో జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహకుల సహాయసహకారాలు తీసుకొని ఆస్థాయిలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి అన్నారు. 2036లో జరిగే ఒలింపిక్స్‌ను లక్ష్యంగా చేసుకొని క్రీడాకారులకు ఆయా క్రీడలలో శిక్షణ ఇప్పిస్తామని, తమ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా క్రీడాకారులకు విధివిధానాలను కల్పిస్తూ ఈ పాలసీకి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపారని చెప్పారు. తమ ప్రభుత్వం బడ్జెట్లో క్రీడలకు ఎక్కువ నిధులు కేటాయించిందని, స్టేడియాలకు, క్రీడాకారులకు కల్పించే మౌలిక వసతులకు అధిక నిధులు కేటాయించినట్లు తెలిపారు. సమావేశంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, అడ్వైజర్ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి వేణుగోపాల చారి, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేశ్ రంజన్, శాట్ వైస్ ఛైర్మన్, ఎండీ .సోనీ బాల, గోపీచంద్ అకాడమీ ఫౌండర్ పుల్లెల గోపీచంద్, ప్రముఖ క్రీడాకారులు గగన్ నారంగ్, అంజు బాబిజార్జ్, సుమిత్ పాండే, అభినవ్ బింద్రా, రవికాంత్ రెడ్డి, నీలం బాబర్ దేశాయ్, తతగత ముఖర్జీ, సబనాయకన్ విశ్వనాథ్, అడిళ్ళ సుమరివాల, తదితరులు పాల్గొన్నారు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే