క్రీడా రంగానికి మంచి భవిష్యత్తు

– నూతన విధానంతో మారనున్న క్రీడారంగ ముఖచిత్రం
– క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

వనపర్తి, ప్రజాతంత్ర, జులై 31: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆలోచనల మేరకు సమగ్రమైన తెలంగాణ క్రీడా విధానం 2025ను రూపొందించామని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. వనపర్తి నియోజకవర్గం ఆత్మకూరు కేంద్రంలో స్పోర్ట్స్‌ కాంక్లేవ్‌ పోస్టర్లను స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనరెడ్డితో కలిసి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ద కాలంగా క్రీడారంగం విస్మరణకు గురవగా సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో వేగవంతంగా పనిచేస్తూ క్రీడల అభివృద్ధికి కృషి జరుగుతోందని చెప్పారు. తాను క్రీడల మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొట్టమొదటి కేబినెట్‌ సమావేశంలోనే క్రీడా విధానం ఆమోదం పొందడం ఒక క్రీడాకారుడిగా తనకి ఎంతో సంతోషం కలిగించిందన్నారు. ఈ నూతన క్రీడా విధానాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ క్రీడారంగ నిష్ణాతులు, వివిధ క్రీడా సమాఖ్యల ప్రతినిధులతో కలిసి విస్తృతస్థాయిలో ఈ స్పోర్ట్స్‌ కాంక్లేవ్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడా విధానం-2025 తెలంగాణ క్రీడా రంగానికి ఒక నూతన ఒరవడిని సాధించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడా రంగానికి, క్రీడాకారులకు మంచి భవిష్యత్తును అందజేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామీణస్థాయి నుండి క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడానికి, మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారిని ప్రపంచ చాంపియన్లుగా తీర్చిదిద్దడానికి ఇది ఎంతో దోహదం చేస్తుందని మంత్రి వాకిటి అన్నారు. శివసేన రెడ్డి మాట్లాడుతూ నూతన క్రీడా విధానంతో తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ బాధ్యతలు మరింత విస్తరించబోతున్నాయని, వివిధ శాఖల సమన్వయంతో క్రీడా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడానికి, క్రీడాకారులను ప్రోత్సహించడానికి బహుముఖంగా తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ సేవలు అందజేయడానికి ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఏడాదికాలంగా తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ తరఫున ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు నిర్వహించామని, రానున్న రోజుల్లో ఈ కృషిని మరింత రెట్టింపు ఉత్సాహంతో కొనసాగిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రహమతుల్లా, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *