విలువల రాజకీయాలకు ప్రతీక వాజ్‌పేయి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
– పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో వాజ్‌పేయికి ఘ‌న నివాళులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: సుపరిపాలనకు నిలువెత్తు నిదర్శనం, మహోన్నత నాయకుడు మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి అని బీజేపీ రాష్ఠ్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు కొనియాడారు. వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటం వ‌ద్ద‌ ఘనంగా నివాళులర్పించ‌గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్‌ రావు మీడియాతో మాట్లాడుతూ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా సుశాసన్‌ దివస్‌ (సుపరిపాలన దినోత్సవం)గా జరుపుకుంటున్నామన్నారు. మొబైల్‌ ఫోన్‌ విప్లవం నుంచి ఇంటింటికీ గ్యాస్‌ కనెక్షన్లు, స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన పాలన బాటలు వేసిందన్నారు. విలువలతో కూడిన రాజకీయాలకు వాజ్‌పేయి ప్రతీకగా నిలిచారని చెప్పారు. రాష్ట్రంలో ఒకవైపు పార్టీ ఫిరాయింపుదారులు రాజకీయ విలువలను తుంగలో తొక్కుతుంటే, మరోవైపు కొందరు అధికార, ప్రతిపక్ష నాయకులు సహా ఉపయోగిస్తున్న భాష ప్రజలను అవమానించేలా ఉందని రామచందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. బూతు మాటలు, దిగజారుడు రాజకీయాలు, అర్థంపర్థం లేని విమర్శలు రాష్ట్రానికి ఏమాత్రం మేలు చేయవని హితవు పలికారు. వాజ్‌పేయి పార్లమెంటులో గానీ, బయట గానీ ఎప్పుడూ నోరు జారి మాట్లాడలేదని, ఎవరినీ అవమానించలేదని, సిద్ధాంతపరమైన విమర్శలతోనే రాజకీయాలు నడిపిన గొప్ప నాయకుడని తెలిపారు. అందుకే ఆయన నేటి యువతకు స్ఫూర్తి, ప్రేరణగా నిలుస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మారిస్తే ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని భిక్షాందేహీ అనే మాదిరిగా అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితికి తీసుకువెళ్తోందని విమర్శించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పేరుతో గొప్ప ప్రచారాలు చేయడం తప్ప అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. రైతులకు ఎరువులపై సబ్సిడీతోపాటు అనేక సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే అమలవుతున్నాయన్నారు. వాజ్‌పేయిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ విలువలతో కూడిన మార్గంలో ముందుకు సాగాలని రామచందర్‌రావు సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ ఎన్‌.గౌతంరావు, వేముల అశోక్‌, తూళ్ల వీరేందర్‌గౌడ్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు బద్దం మైపాల్‌ రెడ్డి, సీనియర్‌ నాయకురాలు బండారు విజయలక్ష్మి, సీనియర్‌ నాయకురాలు బంగారు శృతి, బీజేపీ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎల్‌బీ నగర్‌లో వాజ్‌పేయి విగ్రహావిష్కరణ

దేశానికి అటల్‌ జీ అందించిన అపూర్వ సేవలు, ఆయన దూరదృష్టిగల నాయకత్వం, సుస్థిర పరిపాలన, ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయన నెలకొల్పిన చిరస్థాయి వారసత్వం తరతరాలుగా అందరికీ ప్రేరణగా నిలుస్తున్నాయని రామచందర్‌రావు అన్నారు. ఎల్‌బీనగర్‌లో వాజ్‌పేయి విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి త్రిపుర రాష్ట్ర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనా రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ , వనిపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, రంగారెడ్డి (అర్బన్‌) జిల్లా అధ్యక్షుడు, ఇతర సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *