– ఉత్తర ద్వారంలో భద్రగిరి రామయ్యను చూసి తరించిన భక్తజనం
భద్రాచలం, ప్రజాతంత్ర,డిసెంబర్ 30 : ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా దక్షిణ భారత దేశంలోనే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఉత్తర ద్వారదర్శనం మంగళవారం తెల్లవారుజామున వైభవంగా జరిగింది. వేదపండితులు మంత్రోచ్ఛారణలు, ధూపదీపాల నడుమ జే గంటలు మోగుతుండగా ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి. వైకుంఠ రాముడి కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ఆ ఘడియలు ఆసన్నం కాగా జై శ్రీరామ్.. జై శ్రీరామ్ అంటూ తన్మయంతో భక్తులు నినదించారు. ఉత్తర ద్వారంలో వైకుంఠ రామున్ని దర్శించుకుంటే సకల పాపాలు హరించుకుపోతాయని, సుఖశాంతులతో ఉంటారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. స్వామివారిని గరుడ వాహనంపై ఉంచి వెనుకవైపు నుంచి ఉత్తర ద్వారంలోనకి తీసుకొచ్చారు. సరిగ్గా 5 గంటలకు జే గంటలు మోతుండగా రామనామ సంకీర్తనల నడుమ ఉత్తర ద్వారం తలుపులు తెరుచుకున్నాయి. భక్తులు స్వామిని కనులారా దర్శించుకుని భక్తులు నిర్మలమైన మనస్సుతో పునీతులయ్యారు. శ్రీరామచంద్రుడు భక్తులకు శ్రీ మహావిష్ణువు రూపంలో దర్శనం ఇచ్చారు. తెల్లవారుజామునే గౌతమి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తు ఉత్తర ద్వారదర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠాన్ని తలపించేలా ఉత్తర ద్వారదర్శనం జరిగింది. ఒక్కసారిగా భక్తుల రామ నామ కీర్తనలతో ఆ ప్రాంతం అంతా మారుమ్రోగింది. స్వామివారిపై పుష్పవర్షం కురుస్తుండగా గరుడ వాహనంపై స్వామివారి దర్శనం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తర ద్వారంలో గంటపాటు స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీ రామాయనమహా అనే సహస్త్ర నామంతో అష్టోత్తర పూజలు శాస్త్రయుక్తంగా జరిగాయి. రుగ్వేద, యజుర్వేద, సామ, అధర్వణ వేదాలను వేదపండితులు పఠించారు. స్వామికి హారతిని పట్టారు. శరణాగతి దండకం అనంతరం ద్వాదర్శన విశిష్టతను అర్చకులు భక్తులకు వివరించారు. కోలాటంతో కళాకారులు అలరించారు. సామాన్య భక్తులకు కూడా స్వామివారి దర్శనం కల్పించాలనే ఉద్దేశ్యంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న ప్రముఖుల్లో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఐటిడిఏ పీవో రాహుల్, ట్రైనీ కలెక్టర్ సొరబ్ శర్మ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఏఎస్పీ విక్రాంత్ సింగ్, దేవస్థానం ఈఓ దామోదర్ రావు, భద్రాచలం సర్పంచ్ పూనం కృష్ణ దొర తదితరులు ఉన్నారు.

ఉత్సవాలు విజయవంతం : కలెక్టర్ జితేష్ వి. పాటిల్
సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో నిర్వహించిన ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు విజయవంతంగా పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతమైన ఏర్పాట్లు చేయగలిగామన్నారు. ఉత్సవాల నిర్వహణలో సహకరించిన జిల్లా యంత్రాంగానికి, భక్తులకు, పాత్రికేయులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




