– మహిళా జడ్జిల పదోన్నతిపై దృష్టి సారించాలి
– సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్
న్యూదిల్లీ, మార్చి 27 : కోర్టుల్లో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని, ప్రధానంగా మహిళా జడ్జిల పదోన్నతిపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఈ మేరకు సిజెఐ గత వారం 25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు లేఖ రాశారని సంబంధిత వర్గాలు శుక్రవారం తెలిపాయి. న్యాయ వ్యవస్థలో జడ్జిల ఖాళీల భర్తీ విషయాన్ని, ధర్మాసనాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాల్సిన అవసరముందని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా కోర్టుల్లో మహిళా జడ్జిల సంఖ్య తక్కువగా ఉందన్నారు. కొలీజియం సిఫారసులను ఆలస్యం చేయవద్దని, ఖాళీ కానున్నాయని తెలిసిన వెంటనే వాటి భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. న్యాయ రంగంలోకి మరింతమంది మహిళలు వచ్చేలా న్యాయవ్యవస్థలో పెద్ద ఎత్తున సంస్థాగత మార్పులు చేపట్టాల్సి వుందని మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. హైకోర్టు కొలీజియంలు జడ్జిల పదవుల భర్తీ కోసం ప్రతిభావంతులైన మహిళా జడ్జిలను మినహాయించకుండా వారిని కేటాయించడం ఒక నిబంధనగా పరిగణించాలన్నారు. పదోన్నతి కోసం తమ పరిశీలన పరిధిని విస్తృతం చేయాలని, తమ రాష్ట్రాల్లోని, సుప్రీంకోర్టులో న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్న మహిళా న్యాయవ్యాదులను కూడా చేర్చుకోవాలని హైకోర్టు జడ్జిలకు సూచించారు. ప్రస్తుతం వివిధ హైకోర్టుల్లో పలువురు మహిళలు ప్రధాన జడ్జిలుగా విధులు నిర్వహిస్తున్నారని, పంజాబ్, హర్యానా హైకోర్టులో 18మంది మహిళా జడ్జిలు ఉన్నారని తెలిపారు. మద్రాస్, ముంబయి హైకోర్టుల్లో కూడా సుమారు 12మంది మహిళా జడ్జిలు ఉన్నారన్నారు. జిల్లా స్థాయిలో పనిచేస్తున్న న్యాయాధికారుల్లో మహిళలు సుమారు 36.3శాతం ఉన్నారని సిజెఐ పేర్కొన్నారు. ఇది ఒక సాధారణ గణాంకం కాదని, ఇది తరాల మార్పును ప్రతిబింబిస్తోందని అన్నారు. వ్యవస్థ పునాదిలోనే ఎక్కువ మహిళా భాగస్వామ్యం ఉన్నప్పుడు అది అత్యున్నత న్యాయవ్యవస్థలో కూడా త్వరలోనే ప్రతిబింబిస్తుందని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





