డెహ్రాడూన్, ఆగస్ట్ 6 :ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలోని ధరాలి, సుఖీ అనే గ్రామాలను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షం కారణంగా మెరుపు వరద ధరాలి గ్రామాన్ని సగం తుడిచిపెట్టేసిసింది. కళ్లముందే ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగెత్తుతున్న వారిని వరద రాకాసిలా ముంచెత్తింది. దీంతో పదుల సంఖ్యలో జనాలు బురదలో కూరుకుపోయారు. ఇండ్లు, హోటళ్లను బురద ముంచెత్తింది. దాదాపు 25 హోటళ్లు కొట్టుకుపోయాయి. వరద కారణంగా ఇప్పటివరకు ఐదుగురు మరణించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో కేరళకు చెందిన 28 మంది పర్యాటకుల బృందం గల్లంతు అయినట్లు తెలుస్తోంది. ఉత్తరకాశి నుండి గంగోత్రికి బయలుదేరుతున్న సమయంలో వారు చివరిసారిగా తమతో మాట్లాడారని.. ఇప్పుడు వారి ఫోన్లు పనిచేయడం లేదని పర్యాటకుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సంఘటనాస్థలంలో ప్రస్తుతం భారత సైన్యం, సహాయక బృందాల నేతృత్వంలో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. భారీ వరదలతో కొట్టు-కుపోయిన రోడ్లు, కూలిపోయిన వంతెనల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ధరాలి నుండి ఇప్పటివరకు 130 మందికి పైగా ప్రజలను రక్షించారు. అయితే, కేరళ పర్యాటక బృందం ఆచూకీ ఇంకా తెలియలేదు.
ఉత్తరాది రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు
దిల్లీి, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఆకస్మిక వరదలు చుట్టుముడుతున్నాయి. ఉత్తర కాశీ జిల్లాలో జలవిలయం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. హిమాచల్ రాష్ట్ర వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. టాంగ్లింగ్ ప్రాంతంలో కురిసిన వర్షం కారణంగా కిన్నెర్ కైలాష్ యాత్ర మార్గంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల్లో వందలాదిమంది యాత్రికులు పర్వత మార్గంలో చిక్కుకుపోయారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టారు. రోప్‌వే సాయంతో దాదాపు 413 మంది యాత్రికులను రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా, రెండు రోజుల నుంచి హిమాచల్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు చాలాచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ కారణంగా దాదాపు 450 రోడ్లను అధికారులు మూసివేశారు. ముఖ్యంగా మండి జిల్లా అత్యంత ప్రభావితమైంది. ఇక్కడ దాదాపు 295 రోడ్లు మూసుకుపోయాయి. ఇక సిమ్లాలోని చక్కీమోర్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో కీలకమైన చండీగఢ్-సిమ్లా జాతీయ రహదారిని అధికారులు మూసివేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉనా, కాంగ్రా, మండి, సిర్మౌర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆ నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.





