– ధరాలి గ్రామంపై విరుచుకుపడ్డ వరద
– నలుగురు మృతి
-రంగంలోకి దిగిన సహాయక బృందాలు
– సిఎం పుష్కర్ సింగ్ ధామితో ప్రధాని, హోంమంత్రి ఆరా
డెహ్రాడూన్, ఆగస్ట్ 5:ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. ఇక్కడి ధరాలీ గ్రామంపై జలప్రవాహం విరుచుకుపడింది. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు మృతిచెందినట్లు సమాచారం. దాదాపు 50 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని, 20-25 హోటళ్లు, నివాసాలు కొట్టుకుపోయి ఉండొచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కుంభవృష్టి కారణంగా ఎగువ ప్రాంతమైన ఖీర్‌గఢ్ నుంచి మెరుపు వరదలు సంభవించి నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం భారత సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఎన్డీఆర్‌ఎఫ్, ఐటీబీపీ బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల విషయంలో సీనియర్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఉత్తరకాశీ ప్రాంతంలోని ధరాలీలో కుండపోత వర్షాల వల్ల భారీ నష్టం జరిగిందనే వార్త చాలా బాధాకరమన్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, జిల్లా యంత్రాంగం, సంబంధిత అధికార బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యల్లో నిమగ్నమై పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నట్లు తెలిపారు. బాధిత ప్రజలకు అన్ని విధాలా సహాయం అందిస్తామన్నారు. అందరూ సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సీఎం ధామికి ఫోన్ చేసి స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. కేంద్రం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ధరాలీ ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ సంఘీభావం ప్రకటించారు. ముఖ్యమంత్రి పుష్కర్ ధామితో మాట్లాడి వివరాలు ఆరా తీసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సహాయ బృందాలు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లోని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ధరాలీ గ్రామం మెరుపు వరదలకు పూర్తిగా కొట్టుకుపోయింది. సముద్రం మిద పడిందా అన్న స్థాయిలో మేఘం వర్షించింది. దీంతో నీరు, అక్కడున్న మట్టి కలిసి భారీ ఎత్తున బురద వరద ధరాలిని కప్పేసింది. దీంతో ఇప్పుడు ఆ ప్రదేశం మరు భూమిని తలపిస్తోంది. చార్‌ధామ్ యాత్రికులు ఎక్కువగా ఈ గ్రామాన్ని సందర్శిస్తుంటారు. యాపిల్స్‌కు ప్రసిద్ధిగాంచిన ఉత్తరాఖండ్‌లోని హార్సిల్ లోయ ఇక్కడకు కేవలం 6 కిలోటర్ల దూరంలోనే ఉంది. ఇది ఉత్తరాఖండ్‌లో మారుమూల ఉన్న అత్యంత రమ్యమైన ప్రదేశాల్లో ఒకటి. దీని సపం నుంచే భాగీరథి నది ప్రవహిస్తోంది. రిషికేశ్ నుంచి బయల్దేరి చంబా, ఉత్తరకాశీ, హర్సిల్ మీదుగా ఇక్కడికి వెళ్లవచ్చు. సముద్రమట్టానికి దాదాపు 2,680 టర్ల ఎత్తున ఈ ప్రదేశం ఉంది. ఇక్కడి నుంచి గంగోత్రి ధామ్ కేవలం 20 కి.మీ దూరం. గ్రామం మధ్య నుంచి జాతీయ రహదారి వెళుతుంది. చార్‌ధామ్ సహా ఇతర తీర్థయాత్రల సీజన్‌లో ధరాలీకి సందర్శకులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో లాడ్జిలు, అతిథి గృహాలున్నాయి. తక్కువ ధరలకే వసతి లభిస్తుండటంతో యాత్రికులు వీటి వైపు మొగ్గుచూపుతారు. ఇక్కడి నుంచి 32 కి.మీ దూరంలో నీలాంగ్ లోయ ఉంది. భారత్-టిబెట్ మధ్య వ్యాపారం జరిగే పాత మార్గం ఇక్కడి నుంచి వెళుతుంది. ఇక్కడ రాత్రిళ్లు బస చేయడానికి అనుమతి లేదు. ఈ ప్రదేశాలను వీక్షించాలన్నా అటవీశాఖ అనుమతి ఉండాలి. ఇక ధరాలీ సమీపంలోని హార్సిల్ లోయలో భారీ విస్తీర్ణంలో యాపిల్ తోటలున్నాయి. చార్‌ధామ్ యాత్రికులు గంగోత్రికి వెళ్లే సమయంలో ఇక్కడ ఉండేందుకు ఇష్టపడతారు. కేదార్ తాల్ ప్రదేశానికి ట్రెక్కింగ్‌కు వెళ్లేవారికి ఈ ప్రాంతం బేస్‌క్యాంప్‌గా ఉంటుంది. ధరాలీ గ్రామం సపంలోని ఖీర్‌గఢ్ నదీ పరివాహక ప్రదేశంలో భారీ వర్షం కారణంగా నీరు నిలిచింది. ఇది ఒక్కసారిగా ధరాలీ మార్కెట్ ప్రదేశంపై విరుచుకుపడింది. 10వ తేదీ వరకు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. తాజాగా చోటుచేసుకున్న మెరుపు వరదల్లో 20 నుంచి 25 హోటళ్లు, హోమ్‌స్టేలు కొట్టుకుపోయాయి. అతి తక్కువ సమయంలో అత్యంత తీవ్రమైన వర్షపాతం నమోదు కావడాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. ముఖ్యంగా గంటలోపు 20 నుంచి 30 కి.మీ పరిధిలో 10 సెంటీ మీటర్లకు పైగా వర్షం కురిస్తే దానిని క్లౌడ్ బరస్ట్‌గా పేర్కొంటారు. ఇక 5 సెం.మీ కంటే తక్కువ ఉంటే వాటిని మినీ క్లౌడ్ బరస్ట్‌గా పేర్కొంటాం. ఇటువంటి వర్షాలు సాధారణంగా పర్వతాలు, కొండ ప్రదేశాల్లో కురుస్తుంటాయి. ముఖ్యంగా హిమాలయాల్లో తరచూ వీటిని చూడొచ్చు. భారీ ప్రాణ, ఆస్తి నష్టాలకు దారితీసే ఈ క్లౌడ్‌బరస్ట్‌లు గతంలోనూ చోటుచేసుకొన్నాయి.





