– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా
న్యూదిల్లీ, జులై 24: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనకు చట్టపరంగా ఎలాంటి చిక్కులు ఏర్పడ్డా తట్టుకుని అంతిమంగా విజయం సాధిస్తామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 50 శాతం రిజర్వేషన్ల పరిమితి దాటినా చట్టపరంగా రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్గదర్శకం అవుతుందని అన్నారు. రాష్ట్రంలో జరిగిన కులగణన, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీల రిజర్వేషన్లు అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దిల్లీలో గురువారం నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో మంత్రి ఉత్తమ్ ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే బీసీల సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ అంశాలపై కులగణన నిర్వహించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలుపరచడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. కులగణనను కేవలం ఓబీసీలకే పరిమితం చేయకుండా సమాజంలోని అన్ని కులాలు, ఉప కులాలు వారివారి ఆర్థిక, విద్యలతోపాటు రాజకీయంగా వారు లబ్దిపొందిన అంశాలపై సమగ్రమైన సర్వే నిర్వహించామన్నారు. ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ అభీష్టానికి అనుగుణంగా సామాజిక న్యాయం-సమగ్ర అభివృద్ధిని నెరవేర్చే విదంగా నిర్వహించిన కులగణన ఇది అని ఆయన పేర్కొన్నారు. 94 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పారదర్శకంగా కులగణన నిర్వహించామన్నారు. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయం గతంలో సరైనవేనని ఆయన సమర్దించుకుంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుననుసరించి ఎవరైనా కోర్టు మెట్లు ఎక్కినా అంతిమ విజయం రాష్ట్ర ప్రభుత్వానీదేనని మంత్రి ఉత్తమ్ తేల్చిచెప్పారు. కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చెందిన మంత్రివర్గ ఉపసంఘం సమగ్ర సనాచారాన్ని క్షేత్రస్థాయి నుండి రాబట్టిందని, ఆ సమాచారాంతో మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర శాసనసభ రెండు బిల్లులను ఆమోదించిందని వెల్లడిరచారు. అందులో ఒకటి రాజకీయ రిజర్వేషన్లు అయితే మరోటి విద్య, ఉపాధి అవకాశాలపై అని స్పష్టం చేశారు. ఆ బిల్లులను గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతికి పంపినా నాలుగు నెలలుగా అవి పెండిరగ్‌లో ఉండడం బాధాకరమని ఉత్తమ్ అన్నారు. రాష్ట్రం చేపట్టిన కులగణను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని న్యాయ నిపుణుల బృందం అధ్యయనం చేసి మరీ ఆమోదించిందని చెప్పారు.



