ఈవీలు వాడండి.. పర్యావరణాన్ని కాపాడండి

– ప్రభుత్వోద్యోగులకు ఈవీల్లో ప్రోత్సాహకం
– ఈవీలకు బ్రాండ్ అంబాసిడర్ వారే
– ప్రోత్సాహకాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం, సిఎస్, డీజీపీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పాలసీ తీసుకొచ్చిందని, రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్ పూర్తిగా మినహాయింపు ఇవ్వడం ద్వారా పాలసీ ప్రారంభమైనప్పటి నుండి 1,15, 551 ఎలక్ట్రిక్ వాహనాలకు రూ.925.94 కోట్లను ప్రభుత్వం నష్టపోయినప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సెక్రటేరియట్‌లో సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వోద్యోగులకు 10-20 శాతం డిస్కౌంట్ ఇచ్చేందుకు మహీంద్రా ఎలక్ట్రిక్స్, ఆథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటార్స్, ఓలాతో పాటు పలు కంపెనీలు ముందుకొచ్చాయని ఆయన వెల్లడించారు. ప్రజాప్రతినిధులు ఈవీలకు లోన్ తీసుకునేలా చెప్పామని, ముందుగా ఉద్యోగులకు ప్రథమ పౌరుడైన సీఎస్, ఉద్యోగ సంఘాల నాయకులు ఈవీలను బుక్ చేసుకుంటున్నారని అన్నారు. సీఎస్, డీజీపీ, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి ఈవీలను పరిశీలించి వాటి గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈవీలు ఉపయోగించేలా డిస్కౌంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈవీ పాలసీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో వాటి వినియోగం 0.60 నుండి 1.50 శాతం పెరిగిందని తెలిపారు. ప్రభుత్వం విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి సుస్థిర రవాణాను ప్రోత్సహించడం, సాంప్రదాయ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించడానికి విస్తృత ప్రయత్నాల్లో భాగంగా ఉద్యోగులకు 10-20 శాతం డిస్కౌంట్ వచ్చేలా ఈవీ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కొనే వాహనాల్లో కూడా ఈవీలు ఉండేలా ఇటీవల జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి సూచించారని, అందుకు హైర్ పద్ధతిలో లేదా డిపార్ట్మెంట్ల నుండి వాహనాలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యుత్ వాహనాల వినియోగంలో తెలంగాణ నార్వే, చైనా లతో పోటీపడుతుందని తెలిపారు. ఈవీలకు ఇబ్బందులు లేకుండా అన్ని ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ‘క్యూర్’ ఏరియాలో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, ఆ ఏరియాలో డీజిల్ ఆటోలు కూడా రిటైరోఫిట్‌గా మార్చి నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం తెలిపారు. రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, స్క్రాపేజీ పాలసీలో భాగంగా 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాపింగ్‌కి పంపిస్తున్నామని, వాహన్ సారథి పోర్టల్‌లోకి రాష్ట్రం చేరిందని, వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు షో రూమ్‌లోనే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిద్దాలనే లక్ష్యంతో ఈవీలను ప్రభుత్వం తీసుకొస్తున్నదని, రెండు వేల కిలోమీటర్ల మేరకు ‘క్యూర్’ చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ప్రణాళిక సిద్ధం చేసిందని పేర్కొన్నారు. నగరంలో ఎలక్ట్రిక్ బస్సులను, ఇతర వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఈవీ పాలసీ ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చనీ ఆకాంక్షించారు. ఈవీలకు బ్రాండ్ అంబాసిడర్ ప్రభుత్వ ఉద్యోగులేనని చెప్పారు. పెద్దపెద్ద పట్టణాల్లో ఎయిర్ క్వాలిటీ తగ్గుతున్నదంటూ రాష్ట్రంలోని 30 శాతం జనాభా హైదరాబాద్‌లోనే నివసిస్తున్నందున ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలంటే, గాలి, నీరు కాలుష్యం కాకుండా ఉండాలంటే ఈవీలు ఉపయోగించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు వారికి ఇస్తున్న ఇన్సెంటివ్‌ను ఉపయోగించుకోవాలంటూ ముందుకు వచ్చిన ఈవీ కంపెనీలకు అభినందనలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *