భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఇక్కడ పండుగలు కేవలం మతపరమైన ఆచారాలు మాత్రమే కావు; అవి ఈ దేశపు సామాజిక జీవన నాడి. అయితే, రాజ్యాంగం నిర్దేశించిన ప్రజాస్వామ్య విలువల చట్రంలో, మత విశ్వాసాలకు మరియు లౌకికవాదానికి మధ్య సమతుల్యతను కాపాడుకోవడం నేడు ఒక సవాలుగా మారింది.
భారతదేశంలో పండుగలు కాలానుగుణంగా వొస్తాయి, కానీ అవి వదిలి వెళ్లే ప్రభావం శాశ్వతమైనది. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ లేదా దీపావళి ఏదైనా కావొచ్చు—అవి వ్యక్తుల మధ్య ఉన్న సామాజిక అంతరాలను తొలగించి, సామూహిక ఆనందాన్ని పంచుతాయి. పండుగల సమయంలో జరిగే క్రయవిక్రయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతాన్నిస్తాయి అంతే కాదు తరతరాలుగా వొస్తున్న ఆచారాలను కాపాడుకుంటూనే, ఆధునికతను అందిపుచ్చుకోవడంలో పండుగలు కీలక పాత్ర పోషిస్తాయి.
పాశ్చాత్య దేశాల్లో సెక్యులరిజం అంటే మతానికి, రాజ్యానికి (State) మధ్య పూర్తి విడతీయడం. కానీ భారత్‌లో అది ‘సర్వ ధర్మ సమభావం’. అంటే ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది, ఏ ఒక్క మతాన్ని అధికారిక మతంగా గుర్తించదు. మెజారిటీ మతమైనా, మైనారిటీ మతమైనా చట్టం ముందు సమానమే. పండుగల నిర్వహణలో లేదా మతపరమైన ఊరేగింపుల్లో ప్రభుత్వం తటస్థంగా ఉంటూ శాంతిభద్రతలను కాపాడుతుంది .
ప్రస్తుత తరుణంలో, మతం మరియు రాజకీయాల మధ్య గీత మసకబారుతోంది. పండుగలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం, మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టి వోట్లు దండుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. మత విశ్వాసాలను అడ్డం పెట్టుకుని సమాజాన్ని విభజించడం వల్ల సామాజిక సామరస్యం దెబ్బతింటుంది. పండుగల సమయంలో శబ్ద కాలుష్యం, ట్రాఫిక్ నిబంధనలు లేదా పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై కోర్టులు ఇచ్చే తీర్పులను మతపరమైన కోణంలో చూడటం దురదృష్టకరం. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే మత విశ్వాసాలు వ్యక్తిగత ఆధ్యాత్మికతకు పరిమితం కావాలి, మరియు ప్రజా జీవితంలో అవి ఇతరుల హక్కులకు భంగం కలిగించకూడదు. రాజ్యాంగం సూచించిన ‘సైంటిఫిక్ టెంపర్’ (శాస్త్రీయ దృక్పథం) ప్రతి పౌరుడిలో ఉండాలి. మూఢనమ్మకాలకు, మత విద్వేషాలకు తావులేకుండా పండుగలను జరుపుకోవాలి.





