ఈ నెలలో మెరుగైన యూరియా సరఫరా

– రబీ సీజన్‌కు ముందుగానే సరఫరా చేయాలి
– కేంద్రాన్ని కోరిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: రాష్ట్రానికి యూరియా సరఫరా గత నెలల కంటే సెప్టెంబర్‌లో మెరుగ్గా రావడం రైతులకు ఎంతో ఊరట కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడిరచారు. ఏప్రిల్‌ నుండి సెప్టెంబర్‌ వరకు రాష్ట్రానికి మొత్తం 7.88 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అందగా ఒక్క సెప్టెంబర్‌లోనే 1.84 లక్షల మెట్రిక్‌ టన్నులు సరఫరా కావడం ముఖ్యమైన పరిణామమని తెలిపారు. గత నెలలో ప్రతిసారి కేటాయించిన యూరియా కంటే తక్కువగా సరఫరా అవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆయితే రాష్ట్ర ప్రభుత్వం పదేపదే కేంద్రానికి రైతుల సమస్యలను వివరించడం వల్ల ఈ నెలలో అదనంగా యూరియా సరఫరా జరిగిందని చెప్పారు. దిగుమతి టెండర్లలో ఆలస్యం, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత కారణంగా దిగుమతులపై ప్రతికూల ప్రభావం పడటం, దాని వల్ల కేంద్రం కూడా రాష్ట్రాలకు సరిపడా యూరియాను అందించలేకపోవడం రైతులను ఇబ్బందులకు గురిచేసిందని వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడకుండా రైతుల అవసరాలు తీర్చడానికి నిరంతరం కృషి చేసిందని తెలిపారు. రాష్ట్ర అధికారులు కేంద్ర ఎరువుల శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరపడం వల్ల కేంద్రం సానుకూలంగా స్పందించి ఈ నెలలో అదనంగా యూరియా సరఫరా చేసిందని మంత్రి తెలిపారు. ఆగస్టులోనే సెప్టెంబర్‌ కేటాయింపుతోపాటు అప్పటి వరకు ఏర్పడిన లోటును కూడా భర్తీ చేసేలా యూరియా ఇవ్వాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరిందని, దానికనుగుణంగానే సెప్టెంబర్‌లో కేటాయించిన 1.60 లక్షల మెట్రిక్‌ టన్నులకు బదులుగా 25వ తేదీ వరకు 1.84 లక్షల మెట్రిక్‌ టన్నులు రాష్ట్రానికి అందిందని వెల్లడిరచారు. ఇప్పటికే అందిన యూరియాతోపాటు ఈరోజు, రేపు వరుసగా ఆయా కంపెనీల నుండి మరో 9,864 మెట్రిక్‌ టన్నులు, 9,674 మెట్రిక్‌ టన్నుల యూరియా రాష్ట్రానికి రానున్నదన్నారు. అంతేకాక కంపెనీల నుండి మరో 34,700 మెట్రిక్‌ టన్నుల యూరియా రేక్‌ ప్లాన్‌ ఉందని, ఇది ఈ నెలాఖరుకు రాష్ట్రానికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. గత ఖరీఫ్‌ సీజన్‌లో ఇదే సమయానికి 9.30 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అమ్మకాలు జరగడాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం ఇప్పటివరకు జిల్లాలకు 9.50 లక్షల మెట్రిక్‌ టన్నుల సరఫరా చేశామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో జులైలోనే గత ఏడాది కంటే లక్ష మెట్రిక్‌ టన్నుల యూరియా అధికంగా అమ్ముడయిందని, అయితే అప్పట్లో కేంద్రం నుండి సరఫరా తక్కువ వల్ల రైతులు కొంత ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. అయినప్పటికీ జిల్లాలకు గత ఏడాది ఇదే సమయానికి కంటే ఈసారి ఎక్కువ యూరియాను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయగలిగిందని చెప్పారు. ఉదాహరణకు నల్లగొండ జిల్లాకు గతేడాది కంటే 5 వేల మెట్రిక్‌ టన్నులు, పెద్దపల్లికి 3,200 మెట్రిక్‌ టన్నులు, కరీంనగర్‌కు 2,580 మెట్రిక్‌ టన్నులు, వనపర్తికి 1,600 మెట్రిక్‌ టన్నులు ఎక్కువగా సరఫరా చేశామని మంత్రి తుమ్మల తెలిపారు.

రబీ సీజన్‌కు ముందుగానే సరఫరా చేయాలి

రానున్న రబీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌లలో ప్రతి నెలకు 2 లక్షలకు తగ్గకుండా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్టు మంత్రి తెలిపారు. రబీ సీజన్‌కు వాస్తవ ప్రణాళిక 10.40 లక్షల మెట్రిక్‌ టన్నులు అని, ఖరీఫ్‌లో జరిగినట్టు రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండాలంటే రబీ సీజన్‌ మొదటి మూడు నెలల్లో 6 లక్షల మెట్రిక్‌ టన్నులకు తగ్గకుండా యూరియాను సరఫరా చేయాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని రౖెెతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సమయానికి అందించడమే తమప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *