‘రైతు నేస్తం’లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: దేశంలో అధికంగా యూరియా వాడుతున్న రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆయన సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి మాట్లాడారు. యూరియాను అధికంగా వాడటం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు రానురాను దిగుబడులు కూడా తగ్గుతాయని, చీడపీడల సమస్యలు పెరుగుతాయని తెలిపారు. అందువల్ల యూరియాను శాస్త్రీయంగా వాడాలని సూచించారు. యూరియా యాప్, యూరియా వినియోగం వంటి అంశాలపై రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ‘రైతు నేస్తం’లో రైతులు అధికంగా పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల సందేహాలను నివృత్తి చేయడంతోపాటు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. యూరియా యాప్‌పై రైతుల అభిప్రాయాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. యూరియా యాప్‌తో లైన్లలో నిలబడే బాధ తప్పిందని, ఇంట్లో నుంచే యూరియాను బుక్ చేసుకుని తగిన సమయంలో తెచ్చుకునేందుకు వీలు కలిగిందని, దీంతో సమయం వృథా కావడంలేదని రైతులు యూరియా యాప్‌ని కొనియాడారు. భవిష్యత్తులో కూడా యూరియా యాప్‌తోనే యూరియా అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని రైతుల అభిప్రాయాల మేరకే ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పుడు పంట కోతల సమయం వచ్చిందని, రైతులు కోతల అనంతరం వచ్చే పంట వ్యర్థాలను కాల్చవద్దని సూచించారు. పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా పర్యావరణం దెబ్బతింటుందని తెలిపారు. రైతులు తాము పండించే అన్ని పంటలలో పామాయిల్ పంటను కూడా వేయవచ్చని వివరించారు. రైతులందరు పామాయిల్ పంటను వేసినట్లయితే స్థిరమైన అధిక ఆదాయం పొందే వీలుంటుందన్నారు.
మంత్రిని కలిసిన హుజురాబాద్ మున్సిపల్ పాలకవర్గం
సచివాలయంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ప్రతిపాదించిన డంపింగ్ యార్డు పనులను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీహుజురాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఒడితల ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





