– బిజెపితో బిఆర్‌ఎస్ లోపాయికారీ మద్దతు
– మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్8: కేంద ప్రభుత్వం యూరియా ఇవ్వలేదని, అందుకే సమస్యలు వొస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత వొచ్చిందని ఆరోపించారు. గాంధీ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావుకి ఎరువుల గురించి ఏమీ తెలియదన్నారు. ఆయనకు రాజకీయ విమర్శలు తప్ప రైతుల సమస్యలు పట్టవా? అని ప్రశ్నించారు. యూరియా కోసం ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారా అని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, ఎంపీలు యూరియాపై కేంద్ర ప్రభుత్వం పెద్దలను కలసి విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు. యూరియా ఉత్పత్తి, సరఫరా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని.. దాన్ని ఆసరాగా చేసుకుని బీజేపీ, బీఆర్‌ఎస్‌లు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఆపేశారని గుర్తుచేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు యూరియా కొరతకు బాధ్యత వహించాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. యూరియా సమస్యను పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి చేస్తున్నారన్నారు. ఎరువుల అంశంపై సంబంధిత కేంద్ర మంత్రి స్పందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున పోరుబాట పడుతామని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఎరువుల కొరతతో రైతులు ఆందోళనలో ఉన్నారని మంత్రి తెలిపారు. ఎరువుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని అన్నారు. ఎరువుల తయారీ, సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రానిదే అని రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలనేది ఉద్దేశం కాదని చెప్పారు. బిజెపితో బిఆర్‌ఎస్ కుమ్మక్కయి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎరువుల సమస్య ఉందనేది వాస్తవం అని పేర్కొన్నారు. రైతులకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏ లేదని అన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్దేశపూర్వకంగా 4 నెలలుగా ఉత్పత్తి జరగట్లేదని ఆరోపించారు. రామగుండం కర్మాగారం ఉత్పత్తి చేసి ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని, రాష్ట్రానికి 11 లక్షల టన్నులకు గాను 5.2 లక్షల టన్నుల ఎరువులే వచ్చాయని తెలియజేశారు. ఎరువుల వైఫల్యం బాధ్యత బిజెపి తీసుకోవాల్సిందేనని రాజకీయ కక్ష ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై తీర్చుకోవాలని సూచించారు. రైతుల సహకారంతో బిజెపికి వ్యతిరేకంగా ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





