యూరియా కూడా రాజకీయ వస్తువే!

“అలా యూరియా మితిమీరిన వినియోగం అనే ఒక కారణం ఉండగా, దాన్ని సవరించవలసిన, రైతాంగానికి నచ్చజెప్పి యూరియా వాడకం తగ్గించవలసిన వ్యవసాయ శాఖ ఆ పని చేయకపోవడం వల్ల యూరియా అవసరం పెరిగిపోతూనే ఉంది. ఈ స్థితిలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు, వరి సాగు విస్తీర్ణం ఈ సంవత్సరం ఖరీఫ్ లో హఠాత్తుగా గత సంవత్సరం కన్న విపరీతంగా పెరిగిపోయింది. వరి సాగు విస్తీర్ణం 2024 ఖరీఫ్ లో 32 లక్షల ఎకరాలు ఉన్నదల్లా, 2025 ఖరీఫ్ లో 55 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే ఆ మేరకు యూరియా అవసరం పెరిగింది. అందువల్ల ఈ ఖరీఫ్ కు రాష్ట్రానికి 10.48 లక్షల టన్నుల యూరియా అవసరం అవుతుందని అంచనా వేశారు.”

telanganardhamరాష్ట్రమంతా యూరియా కొరతతో, యూరియా సంక్షోభంతో అతలాకుతలమవుతున్నది. ఒకవైపు చాలా జిల్లాలలో అకాల వర్షాలతో, వరదలతో వ్యవసాయ పనులకు తీవ్రమైన అంతరాయం కలుగుతుండగా, మరొకవైపు ఖరీఫ్ వరి పంటకు అవసరమైన యూరియా అందుబాటులో ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం రైతాంగాన్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎంత యూరియా కావాలో సమాచారం తీసుకుని, ఖరీఫ్ ప్రారంభానికి చాలా ముందే ఏ రాష్ట్రానికి ఎప్పుడెప్పుడు ఎంతెంత సరఫరా చేయాలో నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖతో అనుసంధానంలో రసాయనాల ఎరువుల మంత్రిత్వ శాఖది. అందువల్ల ప్రస్తుత సంక్షోభానికి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఎంతో కేంద్ర ప్రభుత్వ బాధ్యత అంతకన్నా ఎక్కువ. తప్పు నీదంటే నీడని ఇప్పటికే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, లేదా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి.

అలాగే ప్రత్యేకంగా తెలంగాణ వ్యవసాయంలో అవసరమైనదానికన్న ఎక్కువ యూరియా వినియోగం జరుగుతున్నదని గణాంకాలు చూపుతున్నాయి గనుక ఆ మేరకు ప్రస్తుత సంక్షోభానికి ఎంతో కొంత రైతాంగం బాధ్యత కూడా ఉన్నదనాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వం – రైతాంగం త్రిభుజంలో చెప్పుకోదగిన స్థానం దలారీలది , యూరియా చీకటి బజారు వ్యాపారస్తులది, వ్యవసాయానికి సరఫరా అయ్యే యూరియాను ఇతర అవసరాలకు మళ్లించే వ్యాపారులది. అసలే సంక్లిష్టంగా ఉన్న ఈ దృశ్యంలోకి రాజకీయపక్షాలు చొరబడి, వాస్తవికమైన సమస్యను తమ తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకుంటున్నాయి గనుక మొత్తం వ్యవహారం మరింత జటిలంగా మారింది.

యూరియా దొరకక రైతాంగం పడుతున్న ఇబ్బందులను, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ముందు గత రెండు మూడు వారాలుగా పడిగాపులు పడుతున్న రైతుల, క్యూలలో తమ స్థానం పదిలపరచుకోవడానికి రైతులు పెట్టిన చెప్పులు, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డుల ఫోటోలు, వీడియోలు ప్రచార సాధనాలలో కనబడుతున్నాయి. యూరియా కొరత ఒక వాస్తవికమైన సమస్య అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అయితే ఆ వాస్తవికతతో పాటే, ప్రభుత్వ విధానాల వల్ల, అధికారుల వల్ల, దలారీల వల్ల ఏర్పడిన కృత్రిమ కొరత పాత్ర కూడా ఉంది. మన సమాజంలో అతి మామూలు విషయాలు కూడా ఎలా సంక్లిష్టం అయిపోతాయో, ఎలా సరఫరా గొలుసులో లోపాలు అంతిమ వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బ తీస్తాయో చూడడానికి ఈ యూరియా కొరత ఉదంతం ఒక పాఠ్యపుస్తకం లాంటి ఉదాహరణ.

రైతులకు, ప్రత్యేకంగా తెలంగాణ రైతులకు ఎందువల్లనో వరి దిగుబడి ఎక్కువ రావాలంటే ఎక్కువ యూరియా వాడాలనే ఒక అభిప్రాయం ఉంది. నాట్ల తర్వాత ఇరవై రోజుల నుంచి నలబై రోజుల వరకూ రెండు కలుపుల సందర్భంలో యూరియా వాడకం హఠాత్తుగా పెరిగిపోతుంది. ఒక లెక్క ప్రకారం దేశవ్యాప్త సగటు యూరియా వినియోగం ఎకరానికి 100-120 కిలోలు ఉండగా, తెలంగాణలో అది 170 కిలోలుగా ఉంది.

“ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ సందర్భంగా ప్రతిపక్ష అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి తెలంగాణ బిడ్డగా గుర్తించి మద్దతు ఇస్తారా అనే ప్రశ్నకు, తాము ఇటు ఎన్ డి ఎ, అటు ఇండియా రెండు కూటములకూ చెందమని, ఎవరు రెండు లక్షల టన్నుల యూరియా ఇస్తే వారికి తమ వోటు వేస్తామని ఒక అర్థం పర్థం లేని జవాబు చెప్పారు. యూరియాకూ ఉప రాష్ట్రపతి ఎన్నికకూ సంబంధం ఏమిటో ఎవరూ చెప్పలేరు. నిజానికి ప్రతిపక్షాల అభ్యర్థిగా ఉన్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి యూరియా ఇచ్చే, ఇప్పించే సామర్థ్యం ఎలాగూ లేదు, ఉండదు. ఆ అవకాశం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. అంటే తమ వోటు ఎన్ డి ఎ అభ్యర్థికే వేయనున్నామని కెటిఆర్ చెప్పకనే చెప్పారన్నమాట! భారత రాష్ట్ర సమితి భారతీయ జనతాపార్టీతో నెయ్యానికి ఉవ్విళ్లూరుతున్నదని ఇప్పటికే చలామణీలో ఉన్న పుకార్ల నేపథ్యంలో ఆయన వ్యాఖ్య అసలు వాస్తవాన్ని చెపుతున్నదనుకోవాలి.”

అలా యూరియా మితిమీరిన వినియోగం అనే ఒక కారణం ఉండగా, దాన్ని సవరించవలసిన, రైతాంగానికి నచ్చజెప్పి యూరియా వాడకం తగ్గించవలసిన వ్యవసాయ శాఖ ఆ పని చేయకపోవడం వల్ల యూరియా అవసరం పెరిగిపోతూనే ఉంది. ఈ స్థితిలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు, వరి సాగు విస్తీర్ణం ఈ సంవత్సరం ఖరీఫ్ లో హఠాత్తుగా గత సంవత్సరం కన్న విపరీతంగా పెరిగిపోయింది. వరి సాగు విస్తీర్ణం 2024 ఖరీఫ్ లో 32 లక్షల ఎకరాలు ఉన్నదల్లా, 2025 ఖరీఫ్ లో 55 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే ఆ మేరకు యూరియా అవసరం పెరిగింది. అందువల్ల ఈ ఖరీఫ్ కు రాష్ట్రానికి 10.48 లక్షల టన్నుల యూరియా అవసరం అవుతుందని అంచనా వేశారు.

కాగా కేంద్ర రసాయనాల, ఎరువుల మంత్రిత్వ శాఖ ఈ ఖరీఫ్ కాలానికి (వాళ్లు ఏప్రిల్ – సెప్టెంబర్ అంటారు, నిజానికి తెలంగాణలో వినియోగం జూన్ చివరికి మొదలవుతుంది) 8.3 లక్షల టన్నులు సరఫరా చేస్తానని ప్రణాళిక సిద్ధం చేసి, వాస్తవంగా 5.6 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసింది. అంటే కావలసిన దానికన్న ఐదు లక్షల టన్నులు తక్కువ, కేంద్ర ప్రభుత్వం తానే ఇస్తానన్నదానికన్న రెండు లక్షల టన్నులు తక్కువ అందిందన్నమాట. ఖరీఫ్ ప్రారంభానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రెండు లక్షల టన్నుల యూరియా ఉందని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, తప్పుడు నిర్వహణ పద్ధతులే కృత్రిమ కొరతకు కారణమని కేంద్ర ప్రభుత్వం అంటున్నది. కేంద్ర ప్రభుత్వ వివక్ష వల్ల, అడిగినదానికన్న, వాగ్దానం చేసినదానికన్న తక్కువ సరఫరా చేయడం వల్లనే ప్రస్తుత సంక్షోభం ఏర్పడిందని రాష్ట్ర ప్రభుత్వం అంటున్నది.

యూరియా సంక్షోభానికి ప్రభుత్వ, సహకార రంగ యూరియా కర్మాగారాలు తగినంత ఉత్పత్తి చేయకపోవడం, ప్రైవేటు కర్మాగారాలు ఉత్పత్తి మానుకోవడం, లేదా తగ్గించడం, మొత్తంగా దేశం యూరియా కోసం విదేశాల నుంచి, ముఖ్యంగా చైనా నుంచి దిగుమతుల మీద ఆధారపడడం వంటి కారణాలు కూడా ఉన్నాయి. వాటితో పాటు, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్ డి ఎ ప్రభుత్వం సమాఖ్య స్వభావాన్ని తుంగలో తొక్కుతూ, ఇతర పార్టీల రాష్ట్ర ప్రభుత్వాల పట్ల వివక్ష చూపడం అనే కారణం కూడా ఉంది.

యూరియా సరఫరా తక్కువ ఉండడం ఒక సమస్య అయితే, వ్యవసాయానికి మాత్రమే వాడవలసిన యూరియాను రసాయనాలు, ఫ్లై ఉడ్, పశువుల దాణా వంటి ఇతర పారిశ్రామిక రంగాలకు మళ్లించడం (పాడి తయారీలో కూడా యూరియా వాడుతున్నారని అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి), చీకటి బజారుకు తరలించడం, కొరత ఉందని చెప్పి అంగబలం, అర్థబలం ఉన్నవారు ఎక్కువ కొని అక్రమంగా నిలువ చేసుకోవడం వంటి సమస్యల వల్ల కృత్రిమ కొరత తయారవుతున్నది. అందువల్ల ధరలు పెరుగుతున్నాయి. వాస్తవానికి యూరియా అంతా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సబ్సిడైజ్డ్ ధరకు, అంటే బస్తాకు రు. 266.50కు మాత్రమే అమ్మాలి. ఆ అమ్మకాలన్నీ పాయింట్ ఆఫ్ సేల్ లో మాత్రమే జరిగి నమోదు కావాలి. కాని అధికారవర్గపు అలసత్వం, అక్రమాల వల్ల సరఫరా గొలుసులో అనేక చోట్ల లీకేజీలతో, చీకటి బజారులో బస్తా రు. 350-400 కు అమ్మకాలు జరుగుతున్నాయి.

‘అరయంగా కర్ణుడీల్గె నార్గురి చేతన్’ అన్నట్టు ఈ సమస్యలన్నీ కలిసి రైతాంగం మీద దారుణమైన ప్రభావం చూపుతున్నాయి. కాలం గడిచిపోతే వరి రంగు మారుతుందనే భయం, అదునులో యూరియా పడకపోతే దిగుబడి దెబ్బ తింటుందనే భయం, అసలు మొత్తం వ్యవసాయమే భయం భయంగా జూదంలా సాగుతున్నప్పుడు సమయానికి యూరియా దొరకడమే రైతుకు జీవన్మరణ సమస్యగా మారుతున్నది. యూరియా ఇచ్చే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గరికి సమయానికి వెళ్లడం, ఆ చాంతాడు లాంటి క్యూలో నిలబడడం, అసలే అవసరమైనంత రాని స్థితిలో తనకు కావలసినంత సంపాదించడం కష్టసాధ్యమైన విషయాలే. అందువల్లనే రైతులలో ఆందోళన, ఆగ్రహం ముప్పిరి గొంటున్నాయి. మహబూబాబాద్, మెదక్, గద్వాల, సిరిసిల్ల, నల్లగొండ వంటి జిల్లాల్లో రైతుల ఆందోళన ఉద్రిక్తతకు కూడా దారి తీసినట్టు వార్తలు వస్తున్నాయి.

రైతుల ఆందోళనలకు కొన్ని చోట్ల భారత రాష్ట్ర సమితి నాయకత్వం వహించి ఈ సమస్యను తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి ప్రయత్నించింది. జిల్లాలలో మాత్రమే కాక, రాజధానిలో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు, సెక్రటేరియట్ ముందు కూడా నిరసన ప్రదర్శనలు జరపడానికి ప్రయత్నించింది. ప్రతిపక్షం ఒక నిజమైన ప్రజా సమస్య మీద పని చేయడం సంతోషకరమే. నిజానికి యూరియా కొరత సమస్య బి ఆర్ ఎస్ కు ఒక వరంలా దొరికింది. ఇథనాల్, గనులు, ఇసుక, నిరుద్యోగం వంటి ఏ ప్రజా సమస్య మీద కదిలినా, ‘మీరు ఉన్నప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరించారు’, ‘ఈ సమస్యకు బీజం వేసిందే మీరు గదా’ అనే ప్రశ్నలు వచ్చి బి ఆర్ ఎస్ ను ఇబ్బంది పెడుతుండేవి. కాని తెలంగాణకు సంబంధించినంతవరకు ప్రస్తుత సంక్షోభంతో పోల్చదగిన యూరియా సంక్షోభాలు రాష్ట్రం ఏర్పడక ముందు 2007లో, 2011లో వచ్చాయి. రాష్ట్రం ఏర్పడ్డాక పది సంవత్సరాల తెరాస/భారాస పాలనలో కేవలం 2015లో మాత్రమే అటువంటి సంక్షోభం వచ్చింది. అది కూడా సబ్సిడీ ధర సవరింపు అనే చర్యతో పరిష్కారం అయింది. కాబట్టి ప్రస్తుతం ఈ సమస్య మీద బి ఆర్ ఎస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోరాటం చేపట్టవచ్చు.

అయితే ఆ అవకాశాన్ని కూడా భారాస నాయకులు కె టి రామారావు హాస్యాస్పద వ్యాఖ్యతో జారవిడుచుకున్నట్టు కనబడుతున్నది. ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ సందర్భంగా ప్రతిపక్ష అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి తెలంగాణ బిడ్డగా గుర్తించి మద్దతు ఇస్తారా అనే ప్రశ్నకు, తాము ఇటు ఎన్ డి ఎ, అటు ఇండియా రెండు కూటములకూ చెందమని, ఎవరు రెండు లక్షల టన్నుల యూరియా ఇస్తే వారికి తమ వోటు వేస్తామని ఒక అర్థం పర్థం లేని జవాబు చెప్పారు. యూరియాకూ ఉప రాష్ట్రపతి ఎన్నికకూ సంబంధం ఏమిటో ఎవరూ చెప్పలేరు. నిజానికి ప్రతిపక్షాల అభ్యర్థిగా ఉన్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి యూరియా ఇచ్చే, ఇప్పించే సామర్థ్యం ఎలాగూ లేదు, ఉండదు. ఆ అవకాశం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. అంటే తమ వోటు ఎన్ డి ఎ అభ్యర్థికే వేయనున్నామని కెటిఆర్ చెప్పకనే చెప్పారన్నమాట! భారత రాష్ట్ర సమితి భారతీయ జనతాపార్టీతో నెయ్యానికి ఉవ్విళ్లూరుతున్నదని ఇప్పటికే చలామణీలో ఉన్న పుకార్ల నేపథ్యంలో ఆయన వ్యాఖ్య అసలు వాస్తవాన్ని చెపుతున్నదనుకోవాలి.

యూరియా సంక్షోభాన్ని నివారించడానికి ఇంకా నెల రోజుల సమయం ఉంది. రాజకీయ పక్షాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, అసలు సమస్య నుంచి వక్రీకరణ మార్గాలు పక్కన పెట్టి ఇప్పటికైనా చేయదగిన పనులున్నాయి. నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే, తెలంగాణ రైతాంగం పడుతున్న ఇక్కట్లను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా తెలంగాణలోని అన్ని రాజకీయపక్షాలు కలిసికట్టుగా ఉమ్మడిగా కొన్ని పనులు చేయవచ్చు. మొట్టమొదట అన్ని పక్షాలూ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తాను వాగ్దానం చేసినంత యూరియానైనా సరఫరా చేసేట్టు చూడాలి. దేశంలోని యూరియా ఉత్పత్తి సరిపోదనుకుంటే వీలైనంత త్వరగా విదేశాల నుంచి దిగుమతి చేసుకొమ్మని, నేరుగా సమీప ఓడరేవులకు వచ్చేట్టు చూడమని ఒత్తిడి తేవాలి. వచ్చిన యూరియాను నిర్వహణ లోపాలు లేకుండా, సరఫరా గొలుసులో ఎక్కడో ఒకచోట జారిపోకుండా కట్టుదిట్టంగా గ్రామాలకు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు చేరేలా, అక్కడ సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడాలి. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లో తెలంగాణకు కూడా వాటా ఉంది గనుక ఆ కర్మాగారం ఎందుకు సరిగ్గా పని చేయడం లేదో (145 రోజులకు గాను అది 78 రోజులు మాత్రమే పని చేసిందని వార్తలు) పరిశీలించి, ఉత్పత్తి పెంచాలి. తెలంగాణ వ్యవసాయం మీద, రైతాంగం మీద ప్రేమాభిమానాలు ఉంటే ఇవేమీ గొంతెమ్మ కోర్కెలు కావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page