– కీలక నిర్ణయం దిశగా రాష్ట్ర ప్రభుత్వం
– సాగు లెక్కల కోసం ప్రత్యేక యాప్ అభివృద్ధి
హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్6: వానాకాలం సాగు సమయంలో రాష్ట్రంలోయూరియా కోసం రైతుల ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బస్తా యూరియా కోసం గంటల కొద్ది కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిల్చున్నారు. యూరియా కొరతపై ఇటు విపక్షాల నుంచే కాక ప్రజలు కూడా ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఇక విపక్షాలు అయితే ప్రభుత్వ అసమర్థత వల్లే కేంద్రం రాష్ట్రానికి సరిపడా యూరియాను సరఫరా చేయలేదని దుమ్మెత్తిపోశాయి. ఈ క్రమంలో యాసంగి సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి యూరియా కొరత లేకుండా, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు గాను తెలంగాణ వ్యవసాయ శాఖ కఠిన చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతోంది. దీనిలో భాగంగా ఈ సారి నుంచి సాగు విస్తీర్ణం ప్రకరమే యూరియా పంపిణీ చేయనున్నారు. అంటే రైతులు ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు అనే వివరాల ఆధారంగానే యూరియా పంపిణీ జరగబోతుంది. దీనికోసం రైతుల పట్టాదారు పాస్‌బుక్కుల నుంచి వివరాలు సేకరించి.. ఎంత యూరియా అవసరమో లెక్కలు తేల్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రైతులు తాము సాగు చేసే పొలం విస్తీర్ణం కంటే ఎక్కువ యూరియా తీసుకోకుండా ప్రత్యేక యాప్‌ని అభివృద్ధి చేస్తున్నారు. గత నెల నుంచి ఆధార్ లింకుతో ఈ-పాస్ యంత్రాల ద్వారా యూరియా, ఇతర మందుల అమ్మకాలు జరుగుతున్నాయి. రైతుకు ఉన్న భూమికి ఎంత యూరియా అవసరమో అంతే తీసుకునేలా చర్యలు చేపట్టారు. దీని వల్ల.. అధికారులను తప్పుదోవ పట్టించి బ్లాక్‌లో అమ్మడం కోసం.. ఎక్కువ యూరియా తీసుకుంటే దొరికిపోతారు. దీని వల్ల బ్లాక్ మార్కెట్‌ను కట్టడి చేయవచ్చని భావిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్‌కు 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అవసరమని కేంద్రానికి లేఖ రాసింది. ఈ నెలాఖరు వరకు నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కోరింది. అయితే, ఇప్పటివరకు రెండు నెలలకు సంబంధించిన యూరియా నిల్వల్లో సగం మాత్రమే రాష్ట్రానికి వచ్చిందని వ్యవసాయ శాఖ తెలిపింది. అక్టోబర్‌కు సంబంధించి 37 వేల మెట్రిక్ టన్నులు, నవంబర్ నెలకు సంబంధించిన 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరింది. రాష్ట్రంలో అక్టోబర్ నుండి ఇప్పటివరకు 3.10 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా జరిగింది. ఇప్పటికే మండల వ్యవసాయ శాఖ అధికారులు పంటలు వేసిన రైతులు ఏమేరకు యూరియా వాడకం చేస్తారో పట్టాపాసు బుక్ వివరాలు ఇచ్చి నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు అధికారులు వివరాల ప్రకారం 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేశారు. కేంద్రం మిగతా యూరియా కోటాను త్వరగా పంపాలని కోరుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.
ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే