– రైతు వేదికల వద్ద కూడా అందించాలి
– ముందుగా రైతులకు టోకెన్ల జారీ
– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8: క్యూ లైన్లు వంటి ఇబ్బందులు లేకుండా రైతులకు సజావుగా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొద్ది రోజులుగా యూరియా పంపిణీలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా రైతు వేదికల వద్ద కూడా పంపిణీ చేపట్టాలనే మంత్రి ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల వ్యవధిలో 500 ఈ-పోస్ మిషన్లు తెప్పించి సిబ్బందికి శిక్షణ ఇప్పించి 500 రౖౖెతు వేదికల వద్ద యూరియా అమ్మకాలు చేపట్టారు. రైతులకు ముందుగానే టోకెన్లు జారీ చేసి క్యూ లైన్లు, తోపులాటలు లేకుండా పంపిణీ సజావుగా జరిపారు. యూరియా పంపిణీపై మంత్రి తుమ్మల ఆదేశాలతో వ్యవసాయ శాఖ కార్యాలయంలో అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. రైతు వేదికల వద్ద యూరియా పంపిణీ మొదటి రోజు ఎలాంటి ఆందోళనలు లేకుండా సజావుగా సాగుతుండటంతో అదే పద్ధతిలో పకడ్బందీగా యూరియా పంపిణీ చేయాలని మంత్రి తుమ్మల అధికారులకు దిశానిర్దేశం చేశారు. జియో పాలిటిక్స్ వల్ల యూరియా దిగుమతి లేకపోవడం, డిమాండ్‌కు తగ్గట్టు దేశీయంగా ఉత్పత్తి లేకపోవటం వల్ల రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో యూరియా సరఫరాలో కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో ఆగస్టులో అదనంగా 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా తెచ్చుకున్నామని, ఇకపై ప్రతి రోజూ పది వేల మెట్రిక్ టన్నుల యూరియా వివిధ కంపెనీలు సరఫరా చేసేలా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తితో యూరియా సరఫరా మెరుగుపడిరదని మంత్రి తెలిపారు. కొన్ని పార్టీలు రాజకీయ స్వార్థంతో యూరియా పంపిణీ కేంద్రాల వద్ద కావాలని ఆందోళనలు చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే దిగజారుడు రాజకీయం చేస్తున్నాయంటూ రైతులు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల కోరారు. రైతులకు ప్రజా ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





