– అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: రైతులకు ఎరువులు సులభంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా చేపట్టిన పంపిణీ విధానం సత్ఫలితాలు ఇస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల వద్ద అదనపు సేల్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నెలలో గత నాలుగు రోజుల్లో రాష్ట్రానికి 28 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయిందని, సరఫరా పెరుగుతున్న నేపథ్యంలో రైతు వేదికల వద్ద అదనపు యూరియా సేల్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మండలానికి ఒకటి లేదా రెండు పీఏసీఎస్‌లు మాత్రమే ఉన్న ప్రాంతాలల్లో రైతు వేదికలను వాడుకొని గ్రామాలవారీగా, పాస్ పుస్తకాల ఆధారంగా ఒక రోజు ముందుగానే టోకెన్లు జారీ చేసి ఎరువులు అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సహకార, మార్క్‌ఫెడ్ అధికారులతో సమన్వయం చేసుకొని అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించామని, పోలీస్, విజిలెన్స్ విభాగాలతో కూడిన పర్యవేక్షణ వల్ల ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. దిల్లీ పర్యటనలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల రాష్ట్రంలో యూరియా పరిస్థితులను కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వానాకాలం సాగు విస్తారంగా సాగుతున్న ప్రస్తుత సమయంలో వచ్చే 20 రోజుల్లో 2 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాలని గట్టిగా కోరామన్నారు. దీనిపై కేంద్రం వెంటనే స్పందించి తూర్పు తీరంలోని వివిధ నౌకాశ్రయాలకు రానున్న నాలుగు దిగుమతి నౌకల నుండి తెలంగాణకు అవసరమైన యూరియా కేటాయించేందుకు అంగీకరించిందన్నారు. దిగుమతి సరఫరా కాకుండా, ఆర్‌ఎఫ్‌సీఎల్ మూత పడటంతో కేంద్రం దేశీయ తయారీ యూనిట్ల నుండి కూడా అదనంగా 30 వేల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయించడానికి కేంద్రం అంగీకరించినట్లు తెలిపారు. అంతేకాక రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్ నిలిచిపోయినందున రాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణలోనికి తీసుకొని వెంటనే ఉత్పత్తి ఆరంభించేలా చర్యలకు ఉపక్రమించాలని కేంద్ర మంత్రులను కోరామన్నారు. శుక్రవారం జీఎస్‌ఎఫ్‌సీ, ఐపీఎల్, సీఐఎల్-కరాయికల్, సీఐఎల్-కాకినాడ కంపెనీల ద్వారా 11,181 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రంలోని రైల్వే రేక్ పాయింట్లు అయిన కరీంనగర్, మిర్యాలగూడ, వరంగల్, పెద్దపల్లి ప్రాంతాలకు చేరిందని, రేపు మరో 9,039 మెట్రిక్ టన్నులు ఎంఎఫ్‌ఎల్, క్రిభ్‌కో, సీఐఎల్-కృష్ణపట్నం కంపెనీల నుండి వరంగల్, సనత్‌నగర్, కరీంనగర్ రైల్వే రేక్ పాయింట్లకు చేరనున్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 8,20,112 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని, గత ఏడాది ఇదే సమయానికి 7,75,157 మెట్రిక్ టన్నుల అమ్మకాలు మాత్రమే జరిగాయని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





