– కలెక్టర్లను ఆదేశించిన మంత్రి జూపల్లి
మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 26: వ్యవసాయ సీజన్ పూర్తి అయ్యే వరకు యూరియా సరఫరాపై జిల్లా కలెక్టర్ లు, ఎస్.పి .లు ప్రత్యేక దృష్టి సారించి నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్ర. ఎక్సైజ్,పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రావు అన్నారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో మంగళ వారం సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా సరఫరాలో ఎటువంటి అవకతవకలు జరిగినా, కృత్రిమ కొరత సృష్టించిన ఎరువుల డీలర్ లపై,నకిలీ విత్తనాలు విక్రయించిన , అధిక రేటుకు విక్రయించిన వారిపై కేసులు నమోదు చేసి శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాస్తవంగా కేంద్రం నుండి 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా ఇప్పటివరకు 5.72 లక్షల మెట్రిక్ టన్నుల వచ్చిందని, ఇంకా సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉందని తెలిపారు. కొన్ని ప్రైవేటు షాపులలో ఎక్కువ రేటుకు యూరియా విక్రయిస్తూ యూరియాతోపాటు గ్రాన్యూల్స్ కొంటేనే ఇస్తామని చెబుతున్నారని అలాంటి షాపులు కానీ సొసైటీలలో కానీ అధిక ధరలకు విక్రయిస్తే వాటిని వెంటనే సీజ్ చేసి తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని,ఎప్పటి కప్పుడు రేకుల వారీగా వచ్చిన యూరియా ఇండెంట్ ను అవసరం ఉన్న చోట సమర్థంగా పంపిణీకి కి చర్యలు తీసుకుంటామన్నారు. యూరియా, ఎరువులు,విత్తనాలు విక్రయిస్తున్న ప్రైవేట్ డీలర్లతో, శాసన సభ్యులతో జిల్లా కలెక్టర్ లు సమావేశం నిర్వహించి వారికి యూరియా సరఫరా పై తగు ఆదేశాలు జారీ చేయాలన్నారు. నానో యూరియా వాడకం ప్రయోజనాలు గురించి కూడా వ్యవసాయ అధికారులు రైతులకు వివరించాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ లు జిల్లాలో యూరియా వచ్చిన సరఫరాపై ఎప్పటికప్పుడు మీడియా సమావేశాల ద్వారా వివరించాలన్నారు. సమావేశంలో పాల్గొన్న దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో వరి సాగు మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఎక్కువగా నార్లు వేశారని నియోజకవర్గం రైతులు ఎక్కువ మొత్తంలో కొని నిల్వ చేసుకుంటున్నారని తెలిపారు. అచ్చంపేట శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రైవేట్ డీలర్ల వద్ద ఉన్న యూరియాను రైతులకు సరఫరా చేయకుండా దాచి ఉంచి కృత్రిమ కొరత సృష్టించి రేటు పెంచి అమ్ముతున్నారని, వచ్చిన యూరియాను శాస్త్రీయంగా వాడితే సరిపోతుందని రైతులకు ఆవగాహన కలిగించాలని అన్నారు. నారాయణపేట శాసనసభ్యురాలు పర్ణికా రెడ్డి మాట్లాడుతూ యూరియా సరఫరాలో లోడు సమయానికి రావడం లేదని సమయానికి వచ్చేలా అధికారులు చొరవ తీసుకోవాలని అదేవిధంగా అధికారులు యూరియా సరఫరా నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి,డి.సి.సి.బి చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి లు మాట్లాడుతూ ప్రైవేట్ డీలర్ల వద్ద ఉన్న యూరియా పై అధికారులు పర్యవేక్షించి సక్రమంగా సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మహబూబ్ నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి దేవరకద్ర,ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి యూరియాను కొనుగోలు చేస్తారని, జిల్లా కేంద్రంలోని ఎరువుల షాపులకు ఎక్కువ యూరియా కేటాయించాలని కోరారు. కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం లో వెల్దండ, ఊరుకొండ మండలాలకు యూరియా ఎక్కువగా సరఫరా చేయాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.




