యూరియా కోసం రైతులు ధర్నాలు చేసే దుస్థితి

– కాంగ్రెస్‌, బీజేపీలకు రైతుల ఉసురు తగులుతుంది
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై హరీష్‌రావు ఫైర్‌

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 13: ఎనిమిదిమంది బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఎరువుల కొరత తీర్చడంలో విఫలమయ్యారని, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఎరువుల కొరతపై నోరు మెదపడం లేదని బీఆర్‌ఎస్‌ సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా వ్యసాయ పనులు వృథా చేసుకొని రైతులు పడిగాపులు కాస్తున్నారన్నారు. సిద్దిపేట రూరల్‌ మండలం రాఘవాపూర్‌ గ్రామం వద్ద ఎరువుల కోసం క్యూలో బారులు తిరిన రైతులను చూసి ఆగిన హరీష్‌ రావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 51సార్లు దిల్లీకి పోయాడు కానీ ఎరువుల కొరత తీర్చలేదన్నారు. రేవంత్‌ రెడ్డికి తిట్లు ఎక్కువ పని తక్కువ అని మీ ఎమ్మెల్యే రా.గోపాల్‌ రెడ్డి అన్నారని, ప్రజలకు కావాల్సింది తిట్లు కాదు.. పని అని హితవు పలికారు. కేసీఆర్‌ ఉన్నపుడు ఎరువులు ఎట్లా వచ్చాయి.. ఇప్పుడు ఎట్లా రావు అని రైతులు సూటిగా ప్రశ్నిస్తున్నారన్నారు. వెంటనే ఓటీపీ, ఒక్క బస్తా విధానాన్ని తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఉదయం 5 గంటల నుండి ఇక్కడే ఉంటున్నాం.. ఒక ఆధార్‌ కార్డుకి ఒకటే బస్తా ఇస్తామంటున్నారు.. ఆధార్‌ కార్డు.. ఓటీపీ అంటూ కాలయాపన చేస్తూ ఇబ్బందులు గురిచేస్తున్నారని అక్కడున్న రైతులు ఆయనతో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఉదయం నుండి రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకొనే అధికారి లేడు అని వ్యవసాయ అధికారులపై సీరియస్‌ అయ్యారు. పదేళ్లలో కేసీఆర్‌ హయాంలో ఎరువుల ఇబ్బంది లేదని, ప్రతి మండలానికి గోదాంలు ఏర్పాటు చేసుకొని వేసవిలోనే ఎరువులు స్టాక్‌ పెట్టినం అని హరీష్‌రావు చెప్పారు. రైతు సమయం వృధా కాకుండా గ్రామంలోనే ఎరువులు అందించామన్నారు. వెంటనే ఓటీపీ విధానం, ఒక బస్తా విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని, నానో యూరియా వాడాలని చెప్పడం రైతులపై రూ.500 అదనపు భారం మోపడమేనని అన్నారు. సబ్సిడీ నుండి తప్పించుకోడానికి ప్రభుత్వం ఎరువుల కృత్రిమ కొరతను సృష్టిస్తోందని హరీష్‌రావు ఆరోపించారు. ఎన్నికలు ఉన్నాయని బీహార్‌కు ఎరువులను తరలిస్తున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *