ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్న అర్బన్‌ నక్సల్స్‌

– మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనిపించని కబోదులు
– సోకాల్డ్‌ కమ్యూనిస్టులపైనా కేంద్ర మంత్రి బండి ఫైర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: సోకాల్డ్‌ కమ్యూనిస్టులు, అర్బన్‌ నక్సల్స్‌లారా ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి మీకు కనిపించడం లేదా అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కమ్యూనిస్టు నాయకులను ప్రశ్నించారు. ఎన్‌కౌంటర్లు బూటకమంటూ వారు మాట్లాడిన తీరును ఆయన విమర్శించారు. అర్బన్‌ నక్సల్స్‌, కమ్యూనిస్టు పార్టీలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ మరోసారి నిప్పులు చెరిగారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర నేతలు జి.మనోహర్‌ రెడ్డి, ఎస్‌.కుమార్‌, డాక్టర్‌ ప్రకాశ్‌ రెడ్డి, డాక్టర్‌ శిల్పారెడ్డి, తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అమాయకులను రెచ్చగొట్టి ఆయుధాలు పట్టించి వారి చావులకు కారకులైన అర్బన్‌ నక్సల్స్‌ సాధించిందేమిటని ప్రశ్నించారు. తిండీతిప్పలు లేక కుటుంబ సభ్యులకు దూరమై అడవుల్లో అల్లాడుతుంటే అర్బన్‌ నక్సల్స్‌ మాత్రం ఏసీ గదుల్లో ఉండి మావోయిజం వర్ధిల్లాలి.. తాడితపీడిత వర్గాలు ఏకం కావాలంటూ మాయమాటలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారని బండి సంజయ్‌ విమర్శించారు. బూటకపు ఎన్‌కౌంటర్లంటూ మాట్లాడుతున్న సోకాల్డ్‌ కమ్యూనిస్టులు, అర్బన్‌ నక్సల్స్‌ అడవుల్లోని వారిని లొంగిపోవాలని ఎన్నడైనా చెప్పారా అని అడిగారు. వాళ్లు చనిపోయాక శవాలకు నివాళులర్పించడం తప్ప వాళ్లు చేసిందేమిటన్నారు. ఒకవైపు రాజ్యాంగాన్ని కాపాడాలని ఆందోళనలు చేస్తారు. ఇంకోవైపు అదే రాజ్యాంగానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టి నక్సలిజంలో చేరాలని అమాయకులను రెచ్చగొడతారు.. ఇదేం ద్వంద్వ నీతి అని ప్రశ్నించారు. బీజేపీకి ఒక లక్ష్యం ఉందన్నారు. బ్యాలెట్‌ను నమ్ముకుని వరుసగా మూడుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.. కోట్లాదిమందికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తున్నాం.. 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చినం..  ఆర్దిక ప్రగతిలో భారత్‌ను 4వ స్థానానికి తీసుకొచ్చి అమెరికా, రష్యా, చైనా, జపాన్‌ సరసన చేర్చినం అని వివరించారు. 10 లక్షల మందికి రోజ్‌గార్‌ మేళా పేరుతో ఉద్యోగాలిచ్చినం. గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాం.. చిట్టచివరి వ్యక్తికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించాలని దీన్‌ దయాళ్‌ సిద్దాంతాన్ని అమలు చేస్తున్నాం.. మేం ఇన్ని చేసినా మీకు కనిపించదు.. కళ్లుండీ చూడలేని కబోదులు అని అభివర్ణించారు. కాంగ్రెస్‌ పార్టీ వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి ఎగ్గొట్టింది.. భూమలిచ్చిందా.. ఉద్యోగాలిచ్చిందా.. నిరుద్యోగ భృతి, మహిళలకు నెలనెలా రూ.2500లు, వృద్దులకు రూ.4 వేల పెన్షన్‌ ఇచ్చిందా.. మరి ఆ ప్రభుత్వంలో మీకు నచ్చింది ఏమిటి? ఎందుకు పదవులు తీసుకుని ప్రభుత్వంలో భాగస్వాములవుతున్నారు అని నిలదీశారు. మీకు నైతికత, చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంలో ఉంటూ పదవులు పొందిన వాళ్లు, కమిషన్‌లో, కమిటీల్లో ఉన్న వారు తక్షణమే ఆ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతివ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. ఇన్నాళ్లు బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అని ఎన్నికలకు ముందు ఆరోపించిన సీఎం ఇప్పుడేమంటారన్నారు. రాష్ట్రంలో ఆర్కే (రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌) పాలన కొనసాతోందన్నారు. తాను అభివృద్ధిపై మాట్లాడితే మీడియా ప్రచురించడంలేదు.. హిందుత్వంపైనే ఫోకస్‌ చేస్తోంది.. భవిష్యత్తులో రాజమౌళి దేవుడని నమ్మేలా చూడాలని, ఆయన బాగుండాలని కోరుకుంటున్నానన్నారు.

ప్రశ్నా పత్రం లీకేజీ కేసు కొట్టివేత

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బండి సంజయ్‌పై 2023లో టెన్త్‌ హిందీ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో కేసీఆర్‌ ప్రభుత్వం కమలాపురం పీఎస్‌లో నమోదు చేసిన కేసును హైకోర్టు గురువారం కొట్టివేసింది. రాజకీయ కక్షల కారణంగా కేసు నమోదు చేసినట్లు బండి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేసు నమోదులో సరైన సెక్షన్లు, దర్యాప్తులో పూర్తి వివరాలు లేవంటూ కేసును కోర్టు కొట్టివేసింది. కాగా, హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్‌ అన్నారు. చేయని తప్పుకు తనను జైలుకు పంపారని, రోడ్లపై తిప్పుతూ ఏదో చేద్దామనుకున్నారని ఆరోపించారు. టెన్త్‌ హిందీ పేపర్‌ను ఎవరైనా లీక్‌ చేస్తారా అంటూ జనం నవ్వుకున్నారన్నారు. ఇన్ని కేసుల విషయంలో కోర్టుల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడుతున్నానంటూ అయినా భరిస్తున్నానన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వ మెడలు వంచిన పార్టీ బీజేపీ అనే తృప్తి తనకు మిగిలిందన్నారు. ఈ పాపం ఊరికే పోదు.. కక్ష సాధింపు చర్యలకు ఫలితం ఉంటుందని వ్యాఖ్యానించారు. తనపై మోపిన కేసులన్నీ అక్రమమైనవని ఈ కోర్టు తీర్పు ద్వారా నిరూపితమైందన్నారు. ఆరోజు తనకు అమిత్‌ షా, జేపీ నడ్డా అండగా నిలిచారంటూ అండగా ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వానికి, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page