– ఓఆర్‌ఆర్ చుట్టూ మధ్యతరగతి వారికి ఇండ్ల నిర్మాణం
– మార్చిలోగా లక్ష ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు
– జూన్ నాటికి మరో రెండు లక్షల ఇళ్లల్లోకి ప్రవేశాలు
– ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు
– రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: రాష్ట్రంలో మధ్య తరగతి ప్రజల కోసం ప్రభుత్వానికి లాభనష్టాలు లేకుండా సరసమైన ధరకు ఇండ్లను నిర్మించి అఫర్డబుల్ హౌసింగ్ పాలసీకి త్వరలో రూపకల్పన చేయబోతున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో తన ఛాంబర్‌లో శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో హౌసింగ్ శాఖలో రెండేళ్ల ప్రగతిని వివరించారు. రాష్ట్రంలోని జీహెచ్‌ఎంసీ సహా అన్ని పట్టణాలు, నగరాల్లో ఇందిరమ్మ ఇండ్ల పధకం మంజూరుకు ప్రణాళిక సిద్దమైందని, జి ప్లస్ త్రీ పద్దతిలో నిర్మించే గృహాల కోసం అతి కొద్ది రోజుల్లో పాలసీని ప్రకటించబోతున్నామని చెప్పారు. దీనికోసం ఓఆర్‌ఆర్ చుట్టూ నాలుగు స్ధలాలను గుర్తించామని, ఒక్కోచోట 8 నుంచి 10 వేల ఇండ్లు నిర్మించే ప్రతిపాదన ఉందని, అలాగే పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే జీ ప్లస్ 4 పద్దతిలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేలా త్వరలో ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ పాలసీని ప్రకటించబోతున్నామని చెప్పారు. ఈ పధకంపై గ్లోబల్ సమ్మిట్‌లో కూడా చర్చిస్తామని వెల్లడిరచారు. ఇందిరమ్మ ఇండ్ల పధకంలో ఇప్పటివరకు దాదాపు నాలుగు లక్షల ఇండ్లను మంజూరు చేయగా మూడు లక్షల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. వచ్చే మార్చి నాటికి లక్ష ఇందిరమ్మ ఇండ్లకు గృహ ప్రవేశాలు చేస్తామని, ఆ తర్వాత జూన్ నాటికి మరో రెండు లక్షల గృహ ప్రవేశాలు జరుగుతాయని మంత్రి తెలిపారు. ఇండ్ల పధకం అవినీతి రహితంగా సాగాలని భావించి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా 24 గంటల్లోగా చర్యలు తీసుకుంటున్నామని పొంగులేటి చెప్పారు. లంచం అడిగిన తొమ్మిదిమంది పంచాయతీరాజ్ కార్యదర్శులను సస్పెండ్ చేశామని, మరో ఇద్దరిని సర్వీసు నుంచి తొలగించామని తెలిపారు.
కేపీహెచ్‌బీలో హైరైజ్ అపార్టుమెంట్లు!
గత ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖను రద్దు చేయగా పేదలకు పక్కా ఇండ్లు నిర్మించాలన్న ఆలోచనతో గృహ నిర్మాణ శాఖను తాము పునరుద్దరించామన్నారు. ఇందుకోసం 394 మంది డీఈఈలను వెనక్కి రప్పించామని, 800 మంది ఏఈలను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నామని, వివిధ శాఖల నుంచి 152 మందిని, రెవెన్యూ శాఖ నుంచి 32 మందిని డిప్యూటేషన్‌పై తీసుకున్నామని తెలిపారు. పూర్తిస్ధాయిలో గృహ నిర్మాణ శాఖను రూపొందించి ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో నిర్మించిన ఇండ్లు శిధిలమవుతున్నందున వాటిని తొలగించి హైరైజ్ అపార్టుమెంట్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన 2బీహెచ్‌కే ఇండ్ల నిర్మాణాన్ని రూ.700 కోట్లతో పూర్తి చేశామని, రూ.200 కోట్లతో ఆయా కాలనీలకు మౌలిక వసతులు కల్పించామని, హౌసింగ్ బోర్డు పరిధిలో లీజుకు తీసుకున్న లేదా కబ్జా అయిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ఇప్పటికే వెయ్యి ఎకరాల భూమికి ప్రహారీలు నిర్మించామని పొంగులేటి ప్రకటించారు. గృహ జ్యోతి పథకంతోపాటు గతంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించి మధ్యలోనే వదిలేసిన సుమారు 15 వేల మందికి కొత్త పథకం వర్తించేలా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మూడో విడత ఇండ్ల మంజూరులో స్ధలాలు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మించే అంశాన్ని చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





