– సీఎస్ రామకృష్ణారావు వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : రాష్ట్రంలో ఇంటర్మీడియట్, ఎస్ఎస్సీ పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్ష ప్రారంభం తర్వాత ఐదు నిమిషాల వరకు హాజరయ్యేందుకు అనుమతినిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 25 నుండి ఇంటర్ పరీక్షలు, మార్చి 14 నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయని, ఈ పరీక్షల నిర్వహణలో ఏవిధమైన అవకతవకలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈసారి పరీక్షలకు నిర్ణీత సమయానికన్నా ఐదు నిమిషాల తర్వాత కూడా పరీక్ష కేంద్రాలకు విద్యార్థులను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో తాగునీరు, విద్యుత్, టాయిలెట్ల సౌకర్యాలు కల్పనతోపాటు సిసి టీవీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతీ కేంద్రంలో ఒక ఏఎన్ఎం, ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏ ఒక్క విద్యార్థి నేలపై కూర్చొని పరీక్ష రాయకూడదని, అన్ని కేంద్రాలలో బల్లలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యా శాఖ అధికారులు కాక ఇతర శాఖల అధికారులతో సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా మాట్లాడుతూ పరీక్షా కేంద్రాలకు సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను అనుమతించడం లేదని, ప్రతీ కేంద్రం వద్ద మొదటిసారిగా క్లోక్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నామని, పరీక్ష కేంద్రం ఛీప్ సూపరింటెండెంట్‌కు మాత్రమే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉపయోగించడానికి సెల్‌ఫోన్‌ను అనుమతిస్తున్నట్టు తెలిపారు. ఏ పరీక్షా కేంద్రంలోనైనా ఏవిధమైన అవకతవకలు జరిగినా సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు చేపట్టనున్నట్టు హెచ్చరించారు. ప్రతీ పరీక్ష ప్రశ్న పత్రానికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్, సీరియల్ నెంబర్ ఉంటుందని, పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందుగా మాత్రమే ప్రశ్నాపత్రాలను తెరవాలని స్పష్టం చేశారు. ఈసారి మొదటిసారిగా విద్యార్థుల హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా పంపడమేకాక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించామని వెల్లడించారు. కాగా, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్లు కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.
నేటినుంచి ఇంటర్ పరీక్షలు : పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ నెల 25, బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం నుంచి ప్రథమ, గురువారం నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని ఇంటర్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం 1495పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఫస్టియర్‌లో 489126 మంది, సెకండియర్‌లో 507949 మంది కలిపి మొత్తం 997075 మంది పరీక్షలకు హాజరుకానున్నారని వెల్లడించారు. పరీక్ష కేంద్రానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని తెలిపారు. విద్యార్థుల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, గోడ గడియారాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల సమయంలో ఒత్తిడి, ఆందోళన, మానసిక ఆవేదన లాంటి సమస్యలను అధిగమించేందుకు 14416, 80693 91416 నెంబర్లను అందుబాటులోకి తెచ్చామని, విద్యార్థులు ఈ నెంబర్లకు ఫోన్ చేసి కౌన్సెలింగ్ సేవలు పొందవచ్చని కృష్ణ ఆదిత్య తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





