– భారతీయులతో దిల్లీ చేరుకున్నరెండు కమర్షియల్ విమానాలు
న్యూదిల్లీ, జనవరి 17: ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిరసనల కారణంగా ఇప్పటివరకు రెండు వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్‌లోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత త్వరగా ఇండియాకు వచ్చేయాలని సూచించింది. శుక్రవారం రాత్రి రెండు కమర్షియల్ విమానాలు భారతీయులతో దిల్లీ చేరుకున్నాయి. అయితే భారతీయులను ఇరాన్ నుంచి ఇండియాకు తరలించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాలు కాదు. ఇక అక్కడి పరిస్థితులనుబట్టి చర్యలు తీసుకోవడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అత్యవసరమైతే తప్ప ఇరాన్‌కు ప్రయాణించవద్దని భారతీయులను హెచ్చరించింది. ఇరాన్ ఎయిర్ స్పేస్ తాత్కాలికంగా మూసివేయడంతో ఈనెల 15 నుంచి రెండు దేశాల మధ్య పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇప్పుడిప్పుడే ఎయిర్ స్పేస్ పరిస్థితులు సాధారణ స్థితిలోకి వస్తున్నాయి. దీంతో భారతీయులు అక్కడి నుంచి ఇండియాకు వచ్చేస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో భారత ప్రభుత్వం తమకు ఎంతో సాయం చేసిందని అంటున్నారు. శుక్రవారం రాత్రి ఇండియాకు చేరుకున్న ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని విూడియాతో మాట్లాడుతూ ’నేను నిరసనల గురించి విన్నాను కానీ నేరుగా చూడలేదు. అక్కడ ఇంటర్‌నెట్ కూడా లేదు’ అని చెప్పారు. ’మేము బయటకు వెళ్లినపుడు నిరసనకారులు కారుకు అడ్డంగా వచ్చారు.. కొంచెం ఇబ్బంది పెట్టారు.. అక్కడ ఇంటర్‌నెట్ కూడా లేదు. ఆ కారణంతో ఇండియాలోని మా కుటుంబాలకు విషయం చెప్పలేకపోయాం.. ఆఖరికి ఇండియన్ ఎంబసీని కూడా సంప్రదించలేకపోయాం’ అని మరో వ్యక్తి వాపోయారు. ఓ ఇంజనీర్ మాట్లాడుతూ ’ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. నెట్‌వర్క్ సమస్యలు ఉన్నాయి’ అని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





