– పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నిర్లక్ష్యం
– డీపీఆర్ ఆమోదం పొందకముందే రూ. 20,641 కోట్లు ఖర్చు
– 90శాతం పనులు పూర్తయ్యాయనే దుష్ప్రచారం
– మండిపడ్డ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరించిన తీరుపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు బీఆర్‌ఎస్ హయాంలో తీరని అన్యాయం జరిగిందని, ఇప్పుడు తమ ప్రభుత్వంపై బురద జల్లడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సాగునీటి జలాలపై చర్చ జరిగింది. చర్చలో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు.ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ చేతకానితనాన్ని మంత్రి ఎండగట్టారు. 2015లో ఈ ప్రాజెక్టు కోసం జీ.ఓ. జారీ చేసినప్పటికీ, కేంద్ర జల సంఘానికి డీపీఆర్ సమర్పించడానికి నాటి ప్రభుత్వానికి ఏడేళ్ల మూడు నెలల సమయం పట్టిందని ఎద్దేవా చేశారు. ఆశ్చర్యకరంగా, డీపీఆర్ ఆమోదం పొందకముందే రూ. 20,641 కోట్లు ఖర్చు చేశారని, ఇది వారి పాలనలోని అస్తవ్యస్త విధానాలకు నిదర్శనమని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టి, దాని సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచిన కేసీఆర్.. పాలమూరు రంగారెడ్డి విషయంలో మాత్రం వివక్ష చూపారని ఆరోపించారు. పాలమూరు సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి తగ్గించారని దుయ్యబట్టారు. అంతేకాకుండా, ప్రాజెక్టు పనులను ఉద్దేశపూర్వకంగానే నెమ్మదిగా చేయాలని నాటి రాజకీయ పెద్దలు అధికారులకు ఆదేశాలు ఇచ్చారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 90 శాతం పనులు పూర్తయ్యాయని ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. అసలు ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 70వేల కోట్లకు పైగా ఉంటే, బీఆర్‌ఎస్ హయాంలో జరిగింది కేవలం రూ. 27,000 కోట్ల పనులు మాత్రమే. ఇది 90 శాతం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా వంటి వాటిని కూడా తొమ్మిదిన్నరేళ్లలో పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎన్ని ఆటంకాలు సృష్టించినా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తమ ప్రభుత్వం 90 టీఎంసీల సామర్థ్యంతోనే పూర్తి చేసి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తాము అధికారంలోకి వొచ్చాక 11 పంపుల ఇన్‌స్టాలేషన్ పూర్తి చేశామని, ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మాజీమంత్రి హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇరిగేషన్‌లో తానే మాస్టర్‌నని ఆయన అనుకుంటున్నారని విమర్శించారు. హరీష్ రావుకు అంత అహంకారం ఎందుకని ప్రశ్నించారు. ఎవరి హయాంలో ఏం జరిగిందో అంతా బయటపెడతామని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో తాము 90టీఎంసీలు డిమాండ్ చేశామని చెప్పుకొచ్చారు. తాము 45 టీఎంసీలు మాత్రమే అడిగామని హరీష్ రావు దుష్ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. అబద్దాల పునాదులపై బీఆర్‌ఎస్ బతుకుతోందని ఎద్దేవా చేశారు. ఒక అబద్దాన్ని పదే పదే చెబుతూ.. అదే నిజం అవుతుందనుకుంటున్నారని మండిడ్డారు. సీడబ్ల్యూకి రాసిన లేఖలో ఓ పేరాగ్రాఫ్‌ను అవుటాఫ్ కాంటెక్టస్ తీసుకొస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణకు అన్యాయం జరిగేలా తానెందుకు లేఖ రాస్తానని ప్రశ్నించారు. సీడబ్ల్యూకి రాసిన లేఖలో ఒక భాగాన్నే చూపిస్తున్నారని.. కృష్ణా బేసిన్‌పై అసెంబ్లీలో ప్రెజెంటేషన్‌కు తాము సిద్ధమని స్పష్టం చేశారు. మేడిగడ్డ పునర్నిర్మాణం పనులకు డెడ్‌లైన్ పెట్టామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నేతల చేతకాని తనాన్ని తమపై రుద్దవద్దని హితవు పలికారు. వారు ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సాగునీటి జలాలపై డీపీఆర్‌ను కేంద్రానికి పంపడానికి ఏడేళ్ల సమయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. డీపీఆర్ పంపే సమయానికి రూ.21 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు. ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు..అన్యాయం చేస్తున్నామంటూ బీఆర్‌ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.