– మంత్రి దనసరి అనసూయ సీతక్క
– సమ్మక్క- సారలమ్మ మహా జాతరకు విచ్చేయండి
– రాష్ట్రపతి, కేంద్ర పర్యాటక శాఖల మంత్రికి ఆహ్వానం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: భారతీయ కళా, వంటకాల, ప్రజా సంప్రదాయాల వైభవాన్ని ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిసి అందిస్తున్న భారతీయ కళా మహోత్సవం భిన్నత్వంలో ఏకత్వం అనే భారత ఆత్మను ప్రతిఫలిస్తున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. తెలంగాణ నేలపై జరుగుతున్న ఈ వేడుక దేశవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యాన్ని ఒకే వేదికపై తీసుకొస్తోందన్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం జరిగిన భారతీయ కళామహోత్సవ్-2025లో ఆమె పాల్గొన్నారు. హైదరాబాద్‌ను మినీ ఇండియాగా పిలుస్తారని, ఇక్కడి గంగా-జమునా సంస్కృతి భారతీయ సమన్వయానికి ప్రతీక అని సీతక్క పేర్కొన్నారు. వైవిధ్యం సవాలు కాదని, అది దేశ బలమని, బలమైన రాష్ట్రాలే బలమైన భారతాన్ని నిర్మిస్తాయని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సంపదలైన ఒగ్గు కథ, పేరిణి శివతాండవం, బోనాలు, బతుకమ్మ, సమ్మక్క-సారలమ్మ జాతర వంటి గొప్ప సంప్రదాయాలను మంత్రి సీతక్క ప్రస్తావించారు. అలాగే కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ కళలతోపాటు గిరిజన, ప్రజా కళలకు తెలంగాణ ఇచ్చే గౌరవాన్ని వివరించారు. తమ గిరిజన మహిళా నేపథ్యాన్ని గుర్తుచేసుకున్న సీతక్క అడవి మా జీవనాధారం మాత్రమే కాదు, అది మా మతం, మా ఆత్మగౌరవం అని చెప్పారు. ఒడిశా నుండి వచ్చిన రాష్ట్రపతి, త్రిపురకు చెందిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మల ఆదివాసీ గిరిజన మూలాలు, తెలంగాణ గిరిజన ఆదివాసీ సంస్కృతికి బలమైన అనుబంధం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా జనవరిలో జరగబోయే సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్రపతిని రాష్ట్ర ప్రభుత్వం, ఆదివాసీ సమాజం తరఫున ఆహ్వానించారు. రాష్ట్రపతి మహాజాతరకు విచ్చేస్తే..గిరిజన సమాజానికి మహత్తర ప్రోత్సాహకంగా ఉంటుందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతి భవన్‌కు, సంబంధిత శాఖలకు మంత్రి అభినందనలు తెలియజేశారు. కాగా, ఆదివాసీ జనాభా అధికంగా ఉన్న ములుగు జిల్లాలో అభివృద్ది పనులకు, ఎకో ఫ్రెండ్లీ టూరిజం ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు వినతి పత్రం అందచేశారు. అలాగే మల్లూరు దేవస్థానం అభివృద్ది కోసం రూ.30 కోట్లు, బొగత వాటర్ ఫాల్స్ అభివృద్ది కోసం రూ.50 కోట్లు, జంపన్న వాగు అభివృద్ది కోసం రూ.50 కోట్లు కేటాయించాలని కూడా కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





