కాంగ్రెస్ ప్ర‌భుత్వం సాధించింది సున్నా

– ఇచ్చిన హామీలేవీ తీర్చ‌లేదు
-బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీల పాల‌న‌కు తేడాలేదు
– వికేంద్రీకృత అవినీతి విస్త‌రించింది
– మంత్రులు, ఎమ్మెల్యేలు దుకాణాలు తెరిచారు
– కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి విమ‌ర్శ‌

నల్గొండ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 7 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవాల పేరిట సీఎం రేవంత్ రెడ్డి అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రభుత్వం తరఫున కూడా అనేక కార్యక్రమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నిర్దిష్టంగా గత రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయం ఏదీ లేదని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయ‌న బీజేపీ న‌ల్గొండ  కార్యాల‌యంలో మీడియా స‌మావేశంలో ప్ర‌సంగించారు. మార్పు తీసుకొస్తామని, ప్రజాపాలన తీసుకొస్తామని ఇచ్చిన‌ అనేక రకాల హామీలు ఏవీ కండ్ల ముందు కనిపించడం లేద‌న్నారు. బీఆర్ఎస్ పార్టీ పదేండ్లు ఎలా పాలన చేసిందో  ఒక శాతం అటు ఇటు కాంగ్రెస్ సర్కారు కూడా అదే పాలన చేస్తోంద‌న్నారు. అదే రకమైన అవినీతి, అదే రకమైన అక్రమాలు ఉన్నాయి. ఇందులో తేడా ఏముందంటే, అప్పుడు కేంద్రీకృతి అవినీతి ఉంటే, ఇప్పుడు వికేంద్రీకృతి అవినీతి కనిపిస్తున్నద‌న్నారు. నాడు కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వారు దుకాణాలు తెరిచి మాస్ క‌ర‌ప్ష‌న్‌కు పాల్పడుతున్నారు. మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయంటే మంత్రుల మధ్య పంపకాల చర్చలు జరుగుతున్నాయని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మంత్రివర్గ సమావేశాల కూడా మంత్రుల మధ్య సఖ్యత కుదర్చడం కోసమే పెడుతున్న సందర్భాలు అనేకం ఉంటున్నాయ‌న్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని మంత్రివర్గంలో స్థానం కూడా కల్పించారన్నారు. ఈరోజు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నది. గత ప్రభుత్వంలో కేసీఆర్ తనకు తాను మేధావిగా చెప్పుకునేవారు. ఇప్పుడు నేనేం తక్కువ అన్నట్లు రేవంత్ రెడ్డి కూడా గొప్ప మేధావిన‌ని చెప్పుకుంటున్నారు.  మీరు ఎన్నికల ముందు ప్రతి ఊరికి వెళ్లి దేవుళ్లపై ఒట్లు వేస్తూ.. అధికారంలోకి వస్తే.. వారిని అరెస్ట్ చేస్తం, వాళ్ల అవినీతి కక్కిస్తం అని హామీ ఇచ్చారు కదా? మరి రెండేండ్లలో ఏం చేశారని నేను ప్రశ్నిస్తున్న. ఏమన్నంటే.. ఉచిత బస్సు, సన్నబియ్యం పేరు చెప్తున్నారు. సన్నబియ్యంలో కేంద్ర ప్రభుత్వమే రూ.43 ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం రూ.15 మాత్రమే సర్దుతున్నది. ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం లక్షా యాభైవేలు ఇస్తున్నది. కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తానన్న సాయం ఇవ్వలేదు. మహిళలకు ఇస్తానన్న రూ.2500 మరిచిపోయారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ఇస్తానన్న తులం బంగారం ఇవ్వడం లేదు. ఏ ఒక్క ఆడబిడ్డకు స్కూటీ రాలేదు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. చేయలేదు. నిరుద్యోగులకు 4 వేల భృతి ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అన్నారు. బీసీలకు లక్ష కోట్లు ఖర్చు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పారు. విద్యార్థులకురూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ఇవ్వలేదు. ఇలా కాంగ్రెస్ ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి అమలు కావడం లేదు. పంట బోనస్ ఇస్తామని మోసం చేశారు. ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ఈ రెండేండ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా ప్ర‌శ్నిస్తున్నాన‌న్నారు. రెండు మాత్రం అమలు చేస్తున్నారు. అందులో ఒకటి భూదందాలు.దందాల కోసం మంత్రులు పోటీలు పడి ఏం కావాలో చెప్పాలంటూ ఒక్కరి దగ్గరికి ముగ్గురు ముగ్గురు పోతున్నారు. ఇండ్ల పర్మిషన్ కోసం ఎన్‌వోసీ ఇవ్వడం కోసం ఇబ్బందులు ఉన్నయి. హైదరాబాద్ లో రియలెస్టేట్ కుప్పకూలిపోయింది. కృత్రిమ వేలాలు పెట్టి రియలెస్టేట్ వ్యాపారం పెరిగిందని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ భూములు అమ్మింది.. ఇప్పుడు కాంగ్రెస్ అదే పనిచేస్తోంది. భూములు, బీరు, బ్రాంది అమ్మకుండా ఈ ప్రభుత్వం ఒక్క రోజు కూడా పని చేసే పరిస్థితి లేదు. మద్యం ద్వారా లక్ష కోట్లు రాబట్టాలని టార్గెట్ పెట్టుకున్నరట! ఎవరి సంక్షేమం కోసం మద్యం విక్రయాలను పెంచి పోషిస్తున్నరో చెప్పాల‌న్నారు. ఎవరి కొంపలు కూలుస్తారో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. బెల్ట్ షాపులు రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క బెల్టు షాపు కూడా రద్దు చేయలేదు. రిటైర్ అయిన ఉద్యోగస్తులకు వారు దాచుకున్న డబ్బులు వాళ్లకు ఇచ్చేందుకు ప్రభుత్వం భూములు అమ్ముతూ సర్దుతున్నది. ఒక్క సింగరేణి సంస్థకే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల ద్వారా దాదాపు రూ.42 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి. బీరు, బ్రాంది తయారు చేసే కంపెనీలకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదు. ఇలా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గతంలో కేసీఆర్ హయాంలో ఎట్ల ఉండేనో.. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా అలాగే తయారైంద‌న్నారు. రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడినంత మాత్రాన.. ఇచ్చిన గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించలేరన్నారు. అందుకే ఈ రోజు తెలంగాణలో అన్ని వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ రెండు పార్టీల్లో ఎలాంటి తేడా లేదు. తప్పకుండా ఈ విషయంపై బీజేపీ రానున్న రోజుల్లో ప్రభుత్వ తీరుపై పోరాటాలు చేస్తుందని తెలుపుతున్నాను. ఇండిగో విమానాలు రద్దు విషయంపై కేంద్రం ఇప్పటికే స్పందించింది. ఆ కంపెనీ తీరుపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీజేపీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పెట్టిన బిల్లుకు మద్దతు తెలిపింది. దీనిపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సిన అవసరం ఉన్నది. పత్తి కొనుగోళ్ల విషయంలో ఎలాంటి పరిమితి లేదు. వ్యవసాయ అధికారి సర్టిఫై చేస్తే.. రైతుకు ఎంత పండినా సీసీఐ కొనుగోలు చేస్తుంది. తేమ శాతం ఇబ్బందులు కూడా ఎక్కడా లేవు. వచ్చే ఏడాది మార్చి వరకు సీసీఐ చివరి క్వింటాలు వరకు పత్తిని కొనుగోలు చేస్తుంది”అని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *