- అప్పుల విషయంలో బీఆర్ఎస్ ను తలదన్నేలా కాంగ్రెస్
- తెలంగాణ బడ్జెట్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రాష్ట్ర బడ్జెట్ దున్నపోతుకు పాలు పిండినట్లుందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. అంచనాలు భారీ.. కేటాయింపులు, అమల్లో మాత్రం సారీ అని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసిందని, ఇది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్యారెంటీల అమలుపై ప్రజలు ఆశలు వదులుకునేలా పద్దుల రూపకల్పన చేశారని చెప్పారు అంకెల గారడీతో తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసింది. పదేళ్లపాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అఖాతంలోకి నెట్టేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు రాష్ట్రాన్ని పెనంపై నుంచి పొయ్యిలోకి పడేసినట్లు చేసింది. గతేడాది బడ్జెట్ పెట్టినపుడు.. తొలి ఏడాదే కదా అని తప్పించుకున్నారు. మరి 15 నెలలపాటు పాలించిన తర్వాత కూడా 6 గ్యారెంటీలు, 420 వాగ్దానాల అమలును పూర్తిగా విస్మరించారు. వివిధ ప్రాజెక్టులకు భారీగా ప్రకటనలు చేసినా.. కేటాయింపులు, ఆచరణ శూన్యమని ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమైంది. అంకెల గారడీ ద్వారా మరోసారి తెలంగాణ ప్రజలను నిట్టనిలువునా మోసం చేసిన బడ్జెట్ ఇది.
2024-25 బడ్జెట్ లో జీఎస్టీ ఆదాయాన్ని రూ.58,594 కోట్లుగా చూపించారు. కానీ సవరించిన అంచనాల్లో.. రూ.5వేల కోట్లు తగ్గించి.. రూ.53,665 కోట్లుగా వెల్లడించారు. అంటే దాదాపు 8.5% శాతం జీఎస్టీ వసూళ్లు తగ్గాయి. దీనికి కారణాలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. 2025-26 సంవత్సరానికి గానూ రూ.59,704 కోట్ల జీఎస్టీ వసూళ్లు ఉంటాయని బడ్జెట్లో పేర్కొన్నారు. ఇందులో లెక్కలు పెంచి ఎంత రాశారో అర్థం కావడం లేదు. రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని పెంచి దాని ద్వారా ఆదాయం పెంచుకోవడంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం దురదృష్టకరం. 2024-25లో ఎక్సైజ్ టాక్స్ ద్వారా రూ.25,617 కోట్ల అంచనాలు ప్రకటించిన సర్కారుకు.. ఈసారి బడ్జెట్‌లో.. రూ.27,623 కోట్ల ఆదాయాన్ని ఎక్సైజ్ ద్వారా రావొచ్చని అంచనా వేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రజలను మద్యానికి బానిసలు చేసి ప్రజల ఆర్థిక వనరులను కొల్లగొట్టాలనే కాంగ్రెస్ సర్కారు ఆలోచన స్పష్టంగా కనబడుతోంది. రైతులను, యువతను, విద్యార్థులను, మహిళలను, వృద్ధులను, ఉద్యోగులను ఇలా ప్రతి వర్గాన్ని అత్యంత దారుణంగా మోసం చేస్తూనే ఉన్నారు. నిరుద్యోగ భృతి గురించి చెప్పలేదు.
గత బడ్జెట్‌లో 60వేల కోట్ల అప్పులు తీసుకుంటామని చెప్పి.. లక్షన్నర కోట్ల అప్పులు తీసుకున్నారు. ఇప్పుడు 74 వేల కోట్లు అని చెప్పారు. అంటే ఇది 2.25 లక్షల కోట్లు దాటిపోతుంది. అప్పుల విషయంలో.. బీఆర్ఎస్ ప్రభుత్వం తీరును తలదన్నేలా.. కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. ఈసారి రుణమాఫీ ఊసు లేకుండానే.. వ్యవసాయ రంగానికి రూ.24,439 కోట్లు కేటాయించారు. కౌలు రైతులు, రైతు కూలీల సంగతి మరీ దారుణం. తెలంగాణలో ఇంతవరకు ఏ ఒక్క రైతు కూలీకి, ఏ ఒక్క కౌలు రైతుకు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.విద్యారంగానికి 2025-26 బడ్జెట్‌లో కేవలం.. 7.5% నిధులే (రూ.23,108 కోట్లు) కేటాయించారు. కానీ ఎన్నికల మేనిఫెస్టోలో.. 15% నిధులు విద్యారంగానికి ఖర్చుచేస్తామనే హామీని అసెంబ్లీ సాక్షిగా తుంగలో తొక్కారు. ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడికి పోయిందో చెప్పలేదు.
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కేటాయించే నిధుల్లోనూ కేటాయింపులు సగానికిపైగా తగ్గాయి. హామీల్లో అన్ని రకాల పింఛన్లు రూ.4వేలకు పెంచి ఇస్తామని చెప్పి మోసం చేశారు. వైద్యరంగానికి బడ్జెట్ పెంచలేదు. సమగ్ర సర్వే పేరిట.. బీసీల సంఖ్యను తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం.. బడ్జెట్ లోనూ వారిని నిట్టనిలువునా మోసం చేసింది. ఏడాదికి 20వేల కోట్లతో ఐదేళ్లలో లక్షకోట్లు ఇస్తామని చెప్పినా.. అమలులో అతీగతీ లేదు. మొత్తం 3 లక్షల 4 వేల కోట్ల బడ్జెట్‌లో.. 2.26 లక్షల కోట్ల బడ్జెట్ (74%) ఖర్చుగా.. (వేతనాలు, సబ్సిడీలు, ఇతర ఖర్చులు) * కేవలం రూ.36,504 కోట్లు (12%) మూలధన వ్యయంగా ఖర్చు చేస్తున్నారు. ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం 12% మాత్రమే అభివృద్ధికి కేటాయించడం శోచనీయం. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడితే, రాష్ట్ర ఆదాయం తగ్గుతుంది. ఆదాయం తగ్గితే రాష్ట్రం నష్టపోతోంది. దీని ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటాయి. రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతోంది. అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటిని అమలు చేయకుండా తప్పించుకుటోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.




