సుస్థిర అభివృద్ధిని కాంక్షించే కేంద్ర బడ్జెట్

– వికసిత్ భారత్ లక్ష్య సిద్ధికి ప్రయోజనకారి
– తెలంగాణ అభివృద్ధికి ఢోకా లేదు
– ‘ఉపాధి హామీ’కి పెరిగిన కేటాయింపులు
– ఏ రాష్ట్రానికి లేనివిధంగా తెలంగాణకు రైల్వే ప్రాజెక్టులు
– డేటా సెంటర్లలో వసతుల కల్పనకు మద్దతు
– నైనీ బ్లాక్ టెండర్లలో రెండు వర్గాలుగా రాష్ట్ర మంత్రులు
– మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: ఉచితాలు, తాయిలాలతో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బడ్జెట్ ప్రవేశపెడతారనే ప్రజల ఆలోచనకు భిన్నంగా ఈసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. 2047 నాటికి వికసిత భారత్‌ను తీర్చిదిద్దే లక్ష్యంలో ఈ బడ్జెట్ మరొక ముందడుగు అని చెప్పొచ్చన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువతకు, గ్రామీణ ప్రాంతాల వారికి ఉపాధి అవకాశాలు, పరిశోధనలు, పెట్టుబడులు ఆకర్షించేందుకు, దేశంలో సుస్థిరమైన అభివృద్ధి కావాలనే ఆకాంక్షకు రెక్కలు తొడిగే బడ్జెట్ ఇది అని చెప్పారు. రాష్ట్రాలవారీగా కాక దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్‌ అని, కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగిస్తున్నామ‌న్నారు. గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలకు సరిపడా నిధులను కేటాయించామని, వాటికి ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులు అందుతాయని చెప్పారు.

‘హబ్స్ ఆఫ్ హైద్రాబాద్’గా అవతరించింది

ఐటీ హబ్, ఎడ్యుకేషనల్ హబ్, డిజిటల్ హబ్, హైస్పీడ్ రైల్ కారిడార్ హబ్, సెమీ కండక్టర్ హబ్, డేటా సెంటర్ హబ్, మెడికల్ హబ్.. ఇలా హైదరాబాద్ ‘హబ్స్ ఆఫ్ హైద్రాబాద్ గా అవతరించిందన్నారు. తెలంగాణలో ఉన్న 23 లక్షల ఎంఎస్‌ఎంఈలకు ఈ బడ్జెట్ ద్వారా లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. వచ్చే ఐదేళ్ల కోసం రూ.10వేల కోట్లతో ప్రకటించిన బయోఫార్మా శక్తి (స్ట్రాటజీ ఫర్ హెల్త్ కేర్ అడ్వాన్స్‌మెంట్ త్రూ నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్) కార్యక్రమం ద్వారా ఫార్మా కేపిటల్‌గా ఉన్న హైదరాబాద్ నగరానికి చాలా మేలు జరగనుందని ఆయన తెలిపారు. నైపర్-హైదరాబాద్‌ను మరింతగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. క్లినికల్ ట్రయల్స్ రంగంలో కూడా నైపర్ ద్వారా పరిశోధనలు పెరుగుతాయన్నారు. బయోలాజిక్స్, బయోసిమిలర్స్ (అడ్వాన్స్‌డ్ మెడిసిన్స్) ఉత్పత్తి దేశీయంగా పెరుగుతుందని, క్లినికల్ ట్రయల్స్ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఆర్ అండ్ డి కెపాసిటీ పెరుగుతుందని కూడా తెలిపారు. గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా మన రెగ్యులటరీ ఇన్‌ఫ్రా సదుపాయాలు పెరుగుతాయని, గ్లోబల్ బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా భారతదేశం ఎదగడంలో హైదరాబాద్ కీలకపాత్ర పోషించేందుకు వీలతుందని మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. వికసిత్ భారత్ రూరల్ అజీవికా మిషన్ – గ్రామీణ్(వీబీ గ్రామ్ జీ)కి సంబంధించిన నిధులు కూడా పెరగనున్నాయని, అయితే కాంగ్రెస్ పార్టీ దీనిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నదని, 2025-26లో రూ.88వేల కోట్లు ఉన్న ఉపాధి హామీ పథకం బడ్జెట్ 2026-27కి రూ.96 వేల కోట్లకు పెరిగిందని చెప్పారు. టెక్స్-ఇకో కార్యక్రమం ద్వారా టెక్స్‌టైల్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీకి తగ్గట్లుగా భారతీయ వస్త్ర పరిశ్రమ ఎదిగేందుకు కేంద్రం సహకరించనుందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రానికి ప్రకటించిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు ఈ పథకం ద్వారా మరింత లబ్ధి చేకూరనుందన్నారు. ప్రతి జిల్లాకు ఒక గర్ల్స్ హాస్టల్ నిర్మించాలన్న కేంద్ర నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఒక్కో గర్ల్స్ హాస్టల్ రానుందన్నారు. త్వరలోనే అర్బన్ డెవలప్‌మెంట్ మినిస్ట్రీ కూడా హైదరాబాద్ అభివృద్ధికి ఎస్‌ఏఎస్‌సీఐ కింద మరిన్ని నిధులు ఇవ్వనుందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ కింద తెలంగాణకు 1.3 లక్షల ఇళ్లకు రూ.2,190 కోట్లు కేటాయించనుందని, ప్రధానమంత్రి అవాస్ యోజన-రూరల్‌లో భాగంగా రాష్ట్రానికి 3 లక్షల ఇళ్ల కోసం రూ.2,160 కోట్లు కేటాయించనుందని చెప్పారు. హైదరాబాద్‌లో అటమిక్ మినరల్స్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు రూ.406 కోట్లు, ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్(ఐఏఆర్‌సీఐ), సెంటర్ ఫర్ డీఎనఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నొస్టిక్(సీడీఎఫ్‌డీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ వంటి కేంద్ర సంస్థలకు సుమారు రూ.3 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం

టర్నోవర్ ఆధారంగా ఐటీ కంపెనీలకు సంబంధించిన ట్యాక్స్ వివాదాలు, వారి సమస్యల పరిష్కారం తదితర అంశాలకు సంబంధించిన విషయాల్లో పూర్తి మినహాయింపునిచ్చిందని కిషన్‌రెడ్డి తెలిపారు. దేశ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించే డేటా సెంటర్లలో అవసరమైన మౌలిక వసతుల Å£ల్పనకు మద్దతివ్వడం, ఇందులో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్రం నడుం బిగించిందన్నారు. ఏ విదేశీ కంపెనీ అయినా భారతీయ డేటా సెంటర్ల సర్వీసెస్ వాడితే ఆ కంపెనీకి 2047 వరకు టాక్స్ హాలిడేను ప్రకటించారని, దీని వల్ల దేశంలోని డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం సాధ్యమవుతుందని అన్నారు.

రూ.42 వేల కోట్లతో కొత్త జాతీయ రహదారుల నిర్మాణం

రాష్ట్రంలో దాదాపు 5 వేల కి.మీ మేర జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు. రూ.2,471.76 కోట్లతో 64 కి.మీ పొడవున ఆర్మూర్- జగిత్యాల జాతీయ రహదారి, రూ.2,484 కోట్ల అంచనా వ్యయంతో 59 కి.మీ మేర జగిత్యాల- కరీంనగర్ జాతీయ రహదారి, రూ.2,730 కోట్లతో 68 కి.మీ పొడవున 4 లేన్లతో ఆర్మూరు-జగిత్యాల-మంచిర్యాల జాతీయ రహదారి నిర్మాణాలు, రూ.3,175 కోట్లతో మహబూబ్‌నగర్-గూడెబళ్లూరు మధ్య 80 కి.మీ మేర రహదారి విస్తరణ చేపట్టనున్నట్లు వివరించారు. 231 కి.మీ మేర ఆరు లేన్లతో హైదరాబాద్-విజయవాడ మధ్య రూ.10,297 కోట్లతో రహదారి నిర్మించనున్నామన్నారు. హైదరాబాద్ ఆరఆరఆర్ (ఉత్తర భాగం)కు రూ.21,629 కోట్లను కేంద్రం కేటాయించిందని, రాష్ట్రం మొత్తంమీద రూ.42 వేల కోట్లతో కొత్తగా జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు.

హైదరాబాద్‌కు రైల్వే ప్రాజెక్టులు

ఏ రాష్ట్రానికి లేనివిధంగా హైదరాబాద్‌కు అనేక రైల్వే ప్రాజెక్టులు కేటాయించామని, తాజా బడ్జెట్‌లో ఏకంగా రూ.5,454 కోట్లు కేటాయించామని కిషన్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.47,984 కోట్ల విలువైన రైల్వే ట్రాక్‌ల నిర్మాణం, రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, అమృత్ భారత్ పథకం ద్వారా 42 రైల్వే స్టేషన్లను పునరుద్ధరిస్తున్నట్లు, వాటిలో ఇప్పటికే ఐదు పూర్తి అయ్యాయని, త్వరలోనే కొమురవెల్లి మల్లన్న, జోగులాంబ రైల్వే స్టేషన్లు కూడా పూర్తికానున్నాయని చెప్పారు. తెలంగాణకు ఇప్పటికే 5 వందే భారత్ రైళ్లు, 2 అమృత్ భారత్ రైళ్లు కేటాయించినట్లు, 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 900 కి.మీ మేర కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం పూర్తయిందని, 2014 నుంచి ఇప్పటివరకు 1,115 కి.మీ మేర రైల్వే ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తయ్యాయని, దీంతో తెలంగాణలోని రైల్వే ట్రాక్‌లకు 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ సాధ్యమైందని వివరించారు. మొత్తం 1242 కి.మీ మేర రైల్వే లైన్లలో కవచ్ వ్యవస్థ ఏర్పాటుకు మంజూరు కాగా ఇప్పటివరకు 627 కి.మీ మేర పూర్తి అయిందని చెప్పారు. హైదరాబాద్‌లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సికింద్రాబాద్‌లో ఏర్పాటు అవుతోందన్నారు. దేశంలో 7 హైస్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్స్ ప్రకటిస్తే అందులో మూడు మన హైదరాబాద్ నగరం నుంచే ప్రారంభమవుతున్నాయని, అవి హైదరాబాద్-పుణే, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై అని చెప్పారు. వీటివల్ల మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తమిళనాడుకు తెలంగాణకు కనెక్టివిటీ మరింతగా పెరుగుతుందని చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో దశ నిర్మాణం కోసం రూ.12 వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ లైన్ నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

పెట్టుబడులకు సిద్ధంగా అనేక దేశాలు

మన దేశ ఆర్థిక స్థితి పట్ల అనేక దేశాలకు నమ్మకం కుదిరి పెట్టబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. దీని ద్వారా హైదరాబాద్ లబ్ధి పొందుతుందని, ఈ బడ్జెట్‌ను దీర్ఘకాలికంగా దేశ అభివృద్ధికి ఉపయోగపడేలా రూపొందించామని, అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం సమ దృష్టితో చూస్తూ నిధులు కేటాయించిందని కిషన్‌రెడ్డి తెలిపారు.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు పెద్ద పీట వేసినందుకు ప్రధానమంత్రి, రైల్వే శాఖ, జాతీయ రహదారుల మంత్రి, ఆర్థిక మంత్రులకు నా తరఫున, తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. మేడారానికి రూ.3 కోట్లకు పైగా నిధులను కేంద్రం కేటాయించిందని, గతంలో 20 లక్షలు కూడా ఉండకపోయేదని చెప్పారు. గనుల కేటాయింపులో టెండర్లు వేసే ముందు సైట్ విజిట్ చేయాలనేది దేశవ్యాప్తంగా ఉన్న రూల్.. ఇది ప్రజలకు మేలు చేస్తుంది.. కానీ దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. 17 కంపెనీలు విజిట్ చేస్తే ఒక్కరికి కూడా సర్టిఫికెట్ ఇవ్వలేదన్నారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో మంత్రులు రెండు వర్గాలుగా విడిపోయి గొడవలు పెట్టుకుంటున్నారని విమర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *