– మంత్రి సీతక్క వెల్లడి
– సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: మహిళా సంఘ సభ్యుల కోసం త్వరలో యూనిఫాం చీరలు పంపిణీ చేస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో సోమవారం జరిగిన సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమంలో ఆమె, పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ సెర్ప్ ద్వారా మత్స్యకార మహిళలకు ‘నిథం’ వంటి ప్రముఖ మేనేజ్‌మెంట్ విద్యా సంస్థల్లో శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాకాలను మహిళలు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆర్టీసీ అద్దె బస్సుల ద్వారా ఒక్కో మహిళా సంఘం ప్రతినెలా రూ.70 వేలను సంపాదిస్తున్నదని, పెట్రోల్ బంకుల ద్వారా ప్రతినెలా రూ.4 నుంచి 5 లక్షల వరకు ఆదాయం గడిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే మొదటి విడతలో 31 సంచార చేపల విక్రయ వాహనాలను పంపిణీ చేసిందని, మత్స్యకార మహిళల ఆర్థిక బలోపేతానికి ఉపయోగపడుతున్న ఈ వాహనాల ద్వారా అనేక కుటుంబాలు మంచి ఆదాయం పొందుతున్నాయని చెప్పారు. మంచి ఫలితాలు రావడంతో ప్రభుత్వం ఈ రోజు మరో 36 వాహనాలను పంపిణీ చేస్తున్నదన్నారు. ఈ వాహనాల ద్వారా రోజుకు రూ.8 వేల వరకు ఆదాయం సంపాదిస్తున్నట్లు మహిళలు తమ అనుభవాలను మంత్రులతో పంచుకున్నారు. మంత్రి శ్రీహరి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి పట్ల సీతక్క నిబద్ధతతో పనిచేస్తున్నారని కొనియాడారు. మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉందని, చేపలు తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని, ముఖ్యంగా హృదయ సంబంధిత వ్యాధులు తగ్గుతాయని వివరించారు. చేపల పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడానికి విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపడతామని, త్వరలో వందల సంఖ్యలో సంచార చేపల విక్రయ వాహనాలను పంపిణీ చేస్తామని ప్రకటించారు. వ్యాపారం చేస్తున్న పలువురు మహిళలకు సీతక్క, వాకిటి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




