చేయి దాటిపోయింది

-నాకు అన్యాయం జ‌రిగింది

– పార్టీలో ఉండి స్వ‌ప‌క్షంతో యుద్ధం చేయ‌లేను
– రేపు కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ అవుతా
– స్ప‌ష్టం చేసిన ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి
– ఫ‌లించ‌ని పీసీసీ చీఫ్ దౌత్యం
– పార్టీ మారొద్ద‌ని కోరామ‌న్న మ‌హేష్‌కుమార్‌

జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి 24 తన పదేళ్ల ఒంటరి పోరును పార్టీ అధిష్ఠానం చిన్నచూపు చూసిందని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పీసీసీ చీఫ్ పదవి రాకున్నా పార్టీ అధికారంలోకి వచ్చినందుకు సంతోషపడ్డానని అన్నారు. అధిష్ఠానం పంపిన దూతలతో జగిత్యాలలోని తన నివాసంలో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో తనది పూలబాట కాదని.. ముళ్ల బాట అని స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్ కాబట్టి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి, సీఎల్పీ లీడర్ కాబట్టి భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారన్నారు. కానీ తాను శాసనమండలిలో నేతను అని గుర్తు చేశారు. మరి తనకెందుకు అన్యాయం చేశారంటూ అధిష్ఠానం పెద్దలను సూటిగా ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల్లో మనకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదర్శం కాదు కదా అంటూ రాష్ట్ర నేతలకు చరకలంటించారు. అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనలు ఏమిటి? మనం చేస్తున్నదేమిటంటూ నిలదీశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ వంటి నేతలు ఇచ్చిన హామీ అమలు కాకపోతే పార్టీ ఎందుకంటూ జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అధిష్ఠానం తనను బుజ్జగించలేదని చెప్పారు. తాను పార్టీ వీడి వెళ్తున్నానని తెలిసి అలా వచ్చి వెళ్లారంటూ కాంగ్రెస్ ప్రతినిధుల రాకపై జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో కలిసి జీవన్‌రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. పార్టీలో కొనసాగండి, భవిష్యత్తుపై చర్చిద్దామంటూ సూచించారు. ఏఐసీసీ నాయకులు సైతం పార్టీలోనే కొనసాగాలని జీవన్ రెడ్డిని కోరారన్నారు. అనంత‌రం మహేశ్‌కుమార్ మాట్లాడుతూ రాజకీయాల్లో జీవన్‌రెడ్డి సీనియర్ నేత. కొన్ని ఇబ్బందులకు గురయ్యారు.. పార్టీ ఆయన్ను వదలుకోదలచుకోలేదు.. పార్టీ వీడే అంశంలో పునరాలోచన చేయాలని కోరాం అని తెలిపారు. ‘జీవన్ రెడ్డి తమ తండ్రి సమానులు. 43 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఆయనది. రాష్ట్రంలో అంతకన్నా సీనియర్ నాయకులు లేరు. అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ఇబ్బంది పడ్డారు.. కొన్నిసార్లు రాజకీయంలో అనుకోని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.. జీవన్‌రెడ్డి ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి నా సూచనల మేరకు మంత్రి శ్రీధర్‌బాబు వచ్చారు.. నేను కూడా ఈ రోజు కలిశాను.. కాంగ్రెస్‌తో అనుబంధాన్ని తెంచుకోవ‌ద్దని, మమ్మల్ని వీడొద్దని వారికి విన్నవించాను.. కార్యకర్తల ఒత్తిడి, తదితర కారణాల వల్ల వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.. వారు పార్టీలోనే ఉండాలని ఏఐసీసీ పట్టుబడుతోంది.. నాకు జీవన్‌రెడ్డితో 1986 నుంచి పరిచయం.. అప్పటినుంచి రాజకీయంగా సలహాలు ఇచ్చారు.. జీవన్ రెడ్డి రాజీనామా చేయరు అనే ఆశతో ఇక్కడినుంచి వెళ్తున్నామ’ని చెప్పారు. అయితే వారు ఎలాంటి హామీ ఇవ్వలేకపోయారని, దీంతో ఆయనకు సూచనలు చేసి వెనుదిరిగామని చెప్పారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ మారడమా లేదా అన్నది తన చేతిలో లేదని వ్యాఖ్యానించారు. ఇక ఈ భేటీ అనంతరం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. జీవన్‌రెడ్డి ఇంటిపై ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీని అభిమానులు తొలగించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఇది పరిష్కారం లేని సమస్యగా మారింది.. సమస్యకు పరిష్కారం నా దగ్గర లేదు.. వారి దగ్గర కూడా లేదని అన్నారు. బుధ‌వారం ఉదయం 10 గంటలకు కార్యకర్తలు అందరూ భేటీ అయ్యేందుకు గార్డెన్‌కి రండి అని పిలుపునిచ్చారు. భవిష్యత్తు, పయనం ఎలా ఉంటుందో తెలియదు.. కాంగ్రెస్‌లో ఉండి స్వపక్షంతో యుద్ధం చేయలేను. నేను నా నిర్ణయం బుధ‌వారం ప్రకటించబోతున్న.. నా నిర్ణయం దైవ నిర్ణయంగా భావిస్తున్నా’ అని జీవన్‌రెడ్డి తెలిపారు. ఇక కాంగ్రెస్‌కు ఆయన ఆరోజే రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *