రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడమే

– స్పీకర్ తీర్పుపై బీజేపీ చీఫ్ రామచందర్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11: అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆరు నెలల్లోపే మరో పార్టీలో చేరి అదే పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేయడాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారని, ఇంత స్పష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దాన్ని పార్టీ ఫిరాయింపుగా పరిగణించలేమని స్పీకర్ చెప్పడం ఆశ్చర్యకరమని అన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి మరో పార్టీ అభ్యర్థికి ప్రచారం చేయడం, అదే పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడం వంటి స్పష్టమైన రికార్డులు ఉన్నప్పటికీ కూడా ఇది పార్టీ ఫిరాయింపు కాదని చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనన్నారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరవపరిచినట్లే. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ కాబట్టి ఈ అంశంపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అదే యాంటీ డిఫెక్షన్ చట్టం స్పష్టంగా ఉల్లంఘనకు గురవుతున్న పరిస్థితుల్లో స్పీకర్ ఇలాంటి తీర్పు ఇవ్వడం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడమే. రాహుల్ గాంధీ.. మీరు ఒకవైపు రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కానీ మరోవైపు మీ పార్టీకి చెందిన నాయకుల చర్యలను సమర్థించే విధంగా ఇలాంటి తీర్పులు రావడం ఎలా సమర్థించగలరు? ఈ  తీర్పు ప్రజాస్వామ్యాన్ని మాత్రమే కాదు.. రాజ్యాంగాన్ని, ప్రజల తీర్పును కూడా అగౌరవపర్చడమే, అవమానించడమే.. దీనిపై తమ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది అని రామచందర్‌రావు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *