ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతించొద్దు
యంగ్ ఇండియా స్కూళ్ల ఆలోచన విరమించాలి
పలు ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసిన బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పెల్లుబికిన ఆగహ్రంతో అధికారింలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అవే విధానాలను కొనసాగిస్తోందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆరోపించింది. ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసే విధానాలను ప్రతిఘటించాలని పిలుపునిస్తూ తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఇందిరా పార్కువద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భÛంగా పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను ధ్వంసం చేసి ప్రైవేటు, కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తున్నాయని, కార్పొరేటీకరణ, కాషాయీకరణను వేగవంతం చేయడానికి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ (కేంద్ర) ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని తెచ్చిందని, 2014 బడ్జెట్‌లో బడ్జెట్‌లో 6 శాతం నిధులు కేటాయిస్తే 2025లో 2.5 శాతానికి తగ్గించిందని కమిటీ ఆరోపించారు. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చేపట్టిన బడిబాట ఆశించిన ఫలితాలను ఇవ్వడంలేదన్నారు. రాష్ట్రంలో ఎన్నికలపుడు తన మేనిఫెస్టోలో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో కేటాయించిన బడ్జెట్ 7.6 శాతానికి మించలేదని తెలిపారు. పాఠశాలల్లో బోధన సరిగా జరుగుతున్నదా లేదా చూసుకోవడానికి కావలసిన విద్యా శాఖధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని , పాఠ్యప్రణాళిక, పాఠ్యాంశాలను ఖరారు చేయాల్సి ఎస్‌సీఈఆర్టీలోనూ పోస్టులు భారీగా ఖాళీగా ఉన్నాయని, దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందనే విశ్వాసం తల్లిదండ్రుల్లో పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కార్పొరేటీకరణ, కేంద్రీకరణను, కాషాయీకరణను ప్రోత్సహించే జాతీయ విద్యావిధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని, పాఠశాల విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే 5_3+3+4 విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనను మానుకోవాలని, కేంద్రం తన బడ్జెట్‌లో 10 శాతం, రాష్ట్ర బడ్జెట్‌లో 20 శాతం నిధులు విద్యకు కేటాయించాలని, విదేశీ విశ్వవిద్యాలయాలకు అనుమతులు ఇవ్వరాదని, నియోజకవర్గానికొక ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, విద్యార్థుల సంఖ్య 20లోపు ఉంటే ఇద్దరు టీచర్లను , ఆ తర్వాత ప్రతి 20మందికి ఒక టీచర్‌ను నియమించాలని, విద్యార్థుల సంఖ్య 100 దాటితే ఒక ప్రధానోపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలను దగ్గరగా ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల పేరుమీద పట్టణాలకు తరలించే ప్రక్రియను ఆపివేయాలని, ఆ పాఠశాలలు ఉన్నచోటే సొంత భవనాలు నిర్మించి అభివృద్ది చేయాలని, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పద్ధతిలో అన్ని వసతులతో కేంద్రీయ పాఠశాలల స్థాయికి అభివృద్ధి చేయాలని, పాఠశాలలన్నింటిలో మధ్యాహ్న భోజనంతోపాటు అల్పాహారం, స్నాక్స్స్ అందించాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ధర్నాలో టీపీటీఎఫ్, డీటీఎఫ్, ట్రెట్టా, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, పీవైఎల్, పీడీఎస్‌యూ(వి), పీఏవీ, ఎస్‌సీఐఈ, ఎఐవైఎఫ్ వంటి సంస్థల నాయకులు పాల్గొన్నారు.





