స్పీకర్ తీరు ప్రజా తీర్పును కాలరాయడమే

– కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యానికి అగౌరవం
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11: కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యానికి అడుగడుగునా అగౌరవం ఎదురవుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి పార్టీ ఫిరాయింపుదారులకు అసెంబ్లీ స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజల తీర్పును కాలరాయడమేనన్నారు. ఈ విషయంలో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన తీరునే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని, ఈ రెండు పార్టీల ఆలోచనా శైలి, వ్యవహార శైలిలో ఏమార్పూ లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత ముఖ్యమంత్రి సమక్షంలో కండువా మార్చుకుని ఏకంగా కాంగ్రెస్ బీ-ఫాం మీద ఎంపీగా తనపై పోటీ చేసిన సాక్ష్యాలు సరిపోవా స్పీకర్ గారూ.. సామాన్యులందరికీ కనిపించిన సాక్ష్యాలు మీకు ఎందుకు కనిపించడం లేదు అని ఆయ‌న‌ ప్రశ్నించారు. ఫిరాయింపులను అరికట్టాల్సిన అత్యున్నతమైన, బాధ్యతాయుతమైన స్పీకర్ పదవిలో ఉండి వాటికి చట్టబద్ధత కల్పించడం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయం అని అన్నారు. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారి రాజ్యాంగ వ్యవస్థలను అధికార పార్టీ చేతిలో బందీగా మార్చారని విమర్శించారు. ప్రజల తీర్పును కాంగ్రెస్ పార్టీ అపహాస్యం చేసిన తీరుకు ఇది నిదర్శనమన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పదవుల కోసం ప్రజా తీర్పును అంగట్లో సరకులాగా మారిస్తే దానికి స్పీకర్ వత్తాసు పలకడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గుర్తుమీద ఎన్నికైన శాసనసభ్యులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు.. పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లుపొడిచి ప్రజాస్వామ్యాన్ని కాలరాసి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించడం.. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ప్రతినిధి కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయడం.. ఈ రెండు పార్టీలు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాలరాయడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడంలో ఒకదానికొకటి పోటీపడి ప్రజాతీర్పునకు వెన్నుపోటు పొడుస్తున్నాయి అని కిషన్‌రెడ్డి విమర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *