– బోర్డుకే భూబదలాయింపు నిధులు
– విలేకరుల సమావేశంలో ఈటల రాజేందర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 8: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో పార్కులు, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వరద కాలువల నిర్మాణం చేయబోతున్నామని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ సుందరమైన ప్రాంతం.. ఇక్కడ వాతావరణం రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని, కంటోన్మెంట్‌లో డబుల్ బెడ్ రూమ్‌లు కూడా నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. జూబ్లీ బస్ స్టేషన్ నుండి శామీర్‌పేట వరకు ఎలివేటెడ్ కారిడార్‌కు కావలసిన రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి రక్షణ శాఖ 2024లో బదలాయించిందన్నారు. అందుకు బదులుగా వచ్చిన రూ.303 కోట్లను రక్షణ శాఖ కన్సాలిడేటెడ్ ఫండ్‌కు జమ చేయాలని అప్పట్లో నిర్ణయించారని, అయితే కంటోన్మెంట్ బోర్డుకే ఈ డబ్బు జమ చేయాలని బోర్డు తీర్మానం చేసి లేఖ రాసిందని, తాను, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా లేఖలు రాశామని చెప్పారు. తాను పార్లమెంటులో కూడా ఈ విషయంపై మట్లాడానని, శామీర్‌పేట ఎలివేటెడ్ కారిడార్‌తో పాటు డబుల్ డెక్కర్ బ్రిడ్జి నిర్మించి మెట్రో, రోడ్డు ఉండేలా చూడాలని కూడా కోరాననన్నారు. బోర్డు తీర్మానం, తాము రాసిన లేఖలకు స్పందించిన కేంద్ర రక్షణ శాఖ రూ.303 కోట్లు బోర్డు ఖాతాలోనే జమచేసేలా మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందని ఈటల చెప్పారు. దీంతోపాటు రూ.11 కోట్ల గ్రాంట్ కూడా అందించిందన్నారు. రూ.160 కోట్లతో రెండు స్టార్మ్ వాటర్ డ్రైన్లు.. ఒకటి జూబ్లీ నుండి ప్యాట్నీ వరకు, రెండవది రసూల్‌పుర బస్తీల మీదుగా మంజూరు చేశారని చెప్పారు. వాటిని ఎస్‌ఎన్‌డీపీ మాదిరిగా నిర్మాణం చేయబోతున్నామని, దీంతో కంటోన్మెంట్, బోయినపల్లికి వరద ముంపు నుండి శాశ్వత పరిష్కారం లభించనుందని చెప్పారు. రూ.128 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అభివృద్ధి చేయబోతున్నామన్నారు. కంటోన్మెంట్‌కు కేంద్రం ఏం ఇచ్చింది అనేవారికి ఇదే తమ సమాధానమన్నారు. సాధారణంగా రక్షణ శాఖ భూములు ఇస్తే అందుకు బదులుగా వచ్చిన నిధులు కేంద్ర రక్షణ శాఖ అకౌంట్ కి జమ అవుతాయి. అలాకాక తొలిసారిగా బోర్డుకు డబ్బులు ఇచ్చినందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కుి, పూర్తి సహకారం అందించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఈటల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ పాలకమండలి కావాలని తాము కూడా కోరుకుంటున్నాం.. త్వరలో బోర్డు ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నాం.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని ప్రస్తావిస్తాం అని చెప్పారు. సమావేశంలో
సీఈఓ మధుకర్ నాయక్, బోర్డు మెంబర్ నర్మద మల్లికార్జున, కార్పొరేటర్ దీపిక పాల్గొన్నారు.





